అధికారులు అందుబాటులో ఉండాలి
-
ప్రజలకు పూర్తి సహాయం అందించాలి.
-
లోతట్టు ప్రాంతాల వారిని పునరావాసాలకు తరలించాలి
-
వైద్యాధికారులు అప్రమత్తం కావాలి
-
సమీక్ష సమావేశంలో కలెక్టర్ కరుణ
హన్మకొండ అర్బన్: ‘జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు, చెరువులు దెబ్బతిన్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయం అందించాలి’ అని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సదర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నగరంలో లోతట్టు ప్రాతాల ప్రజలను ప్రత్యేక శిబిరాల్లోకి తరలించాలని, వారికి అక్కడ భోజనం, వసతి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం 60 చెరువులకు గండ్లు పడ్డాయని, వాటిని పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇగతా చెరువులు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తం కావాలని, అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం..
కలెక్టరేట్‌లో 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూం ఉంటుందని, ఇక్కడ ముఖ్యమైన ప్రభుత్వ విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 18004252747కు ఫోన్ చేస్తే అధికారులు స్పందిస్తారని చెప్పారు. అగ్నిమాపక, మత్య్సశాఖల అధికారులు అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా, జేసీ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, గ్రేటర్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.