అధికారుల నిర్లక్ష్యమే..!
అధికారుల నిర్లక్ష్యమే..!
Published Fri, Nov 25 2016 12:34 AM | Last Updated on Thu, Mar 21 2019 8:24 PM
ప్రభుత్వ కళాశాలలో టాయిలెట్ల సమస్యపై పట్టించుకోని అధికారులు
పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం శూన్యం
’సాక్షి’ కథనంతో కదలిక.. అధికారులపై కలెక్టర్ సీరియస్
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మరుగుదొడ్ల దుస్థితికి అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. టాయిలెట్ల సమస్య తీవ్రంగా ఉందని కళాశాల ప్రిన్సిపాల్ పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని తేలింది. మూడేళ్లుగా టాయిలెట్ల కోసం మున్సిపల్, కలెక్టర్, విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ మేరకు కళాశాల సిబ్బంది పలుమార్లు ఉన్నతాధి కారులకు లేఖలు రాశారు. సమస్య తీవ్రతను అందరికీ వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా గతంలో ఉన్న గిరిజాశంకర్ దృష్టికి 2014 ఫిబ్రవరి 4న కాలేజీ పరిస్థితిని వివరిస్తూ అప్పటి ప్రిన్సిపాల్ ఎన్.జనార్దన్‌గౌడ్ ఒక నివేదిక అందజేశారు.
అరుునా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మాధ్యమిక విద్యా శాఖకు 2016 జనవరి 5న కాలేజీ అప్పటి ప్రిన్సిపాల్ వెంకయ్య నాయక్ మరోసారి లేఖ రాశారు. అంతకు ముందు మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. కాగా, మంగళవారం ’సాక్షి’లో ప్రచు రితమైన ‘చెప్పుకోలేని బాధ’ కథనంతో అధికార యంత్రాంగమంతా కదిలింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కన్నెర్ర చేయడంతో జిల్లా అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. శుక్ర వారం స్వయంగా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ కాలేజీ పరిసరాలను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న ఆరు మరుగుదొడ్లకు అదనంగా మరో 20 నిర్మించాలని సిబ్బందిని ఆదేశించారు.
Advertisement