మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్
- సమీక్షలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్
ఖమ్మం జెడ్పీసెంటర్:
జిల్లాల పునర్విభజనలో పంపకాలు పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్ర శాఖాధిపతుల ఆమోదం పొందిన ఉద్యోగుల జాబితాకు అనుగుణంగానే కేటాయింపులు ఉండాలన్నారు. టీటీడీసీ భవన్‌లో ఆయా శాఖల జిల్లా బాధ్యులతో కేటాయింపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వశాఖలలో కేడర్‌తో సంబంధం లేకుండా సిబ్బంది కేటాయింపులుండాలన్నారు. రాష్ట్ర శాఖ బాధ్యుల జాబితా, జిల్లా అధికారుల కేటాయింపుల జాబితా ఒకేలా ఉండాలన్నారు. ప్రభుత్వం ఎప్పుడు జాబితా అడిగినా పంపించేందుకు పర్యవేక్షక అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఉద్యోగుల జాబితాతో పాటు నూతన జిల్లాలో కార్యాలయ వసతి, చిరునామా, కార్యాలయ మ్యాప్, ప్రస్తుతం జిల్లా కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఫైళ్ల వివరాలు, వాహనాలను విడదీసి జాబితాను సంబంధిత పర్యవేక్షక అధికారులకు అందించాలని సూచించారు. ప్రభుత్వ వాహనాలు, అద్దెవాహనాల వివరాలు కూడా పొందుపర్చాలన్నారు. సింగిల్ కేడర్ పోస్టులు రెండు లేదా మూడు ఉన్న పక్షంలో ఒక సింగిల్ కేడర్ పోస్టును నూతన జిల్లాకు కేటాయించాలన్నారు. పాత జిల్లాలో ఉన్న శాఖలు కొన్ని కలిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వం, రాష్ట్ర హెచ్‌ఓడీల ఆదేశాల మేరకు సిబ్బంది జాబితా తయారు చేయాలన్నారు. నూతన జిల్లాలో శాఖాధిపతిని నిర్దేశిస్తూ జాబితా ఇవ్వాలన్నారు. నూతనంగా ఏర్పడే జిల్లాలో అవసరమైన వనరులన్నీ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యాలయాల భవనాల కేటాయింపులు జరపాలన్నారు. వాటి మరమ్మతులకు నిధులు మంజూరు కాని పక్షంలో ప్రైవేట్ భవనాలను ప్రభుత్వ రేట్ల ప్రకారం అద్దెకు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు యజమానితో అగ్రిమెంట్ చేయించుకోవాలన్నారు. కొన్ని శాఖల్లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిని కూడా పంచాలన్నారు. ఫైళ్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకొని ఉమ్మడిగా ఉన్న ఫైళ్లను స్కాన్, జిరాక్స్ తీసి నూతన జిల్లాకు పంపాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, డీఆర్వో శ్రీనివాస్, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ మురళీధర్‌రావు పాల్గొన్నారు.