అధికారులపై దాడులు సరికాదు
Published Wed, Oct 5 2016 9:53 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
చాగలమర్రి: కార్యాలయాల్లో అధికారులు పనులు చేయకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప దాడులకు పాల్పడకూడదని జిల్లా కలెక్టర్ విజయమోహన్ అన్నారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్ అంజనేయులును దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అనంతరం కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. తహసీల్దార్ అంజనేయులుపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. వెంటనే జిల్లా ఎస్పీకి తెలియజేశామన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసిన పోలీసు శాఖాధికారులను ఆయన అభినందించారు. ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. చట్టపరమైన తీసుకుంటామని హెచ్చరించారు.సమస్యలు పరిష్కరించాలని సహకార సంఘం అధ్యక్షుడు రఘనాథ్‌రెడ్డి, సర్పంచ్‌లు మస్తాన్‌రెడ్డి, నరసింహారెడ్డి, దేశంరెడ్డి, వీరభద్రుడు, బాబు, సుబ్బారెడ్డిలు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ సుధాకర్‌రెడ్డి, సీఐ దస్తగిరి బాబు, తహసీల్దార్‌లు శ్రీనివాసులు, షెక్‌మోహిద్దీన్, మాలకొండయ్య, ఆల్‌ఫ్రెడ్, రాజశేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
నిరాశతో వెనుతిరిగిన రైతులు
స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ వస్తున్నారని తెలిసి రైతులు భారీగా తరలివచ్చారు. భూసమస్యలు కలెక్టర్‌కు విన్నవించాలని ఉదయం నుంచి వేచి ఉన్నారు. అయితే కలెక్టర్ సాయంత్రం 5.00 గంటలకు వచ్చారు. కేవలం 20 నిమిషాల్లో తహసీల్దార్, ఆర్‌డీఓతో చర్చించి రైతుల సమస్యలు వినకుండానే వెళ్లిపోయారు. దీంతో రైతులు విలేకరుల ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. చాగలమర్రి రెవెన్యూ కార్యాలయంలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని.. చేయి తడిపితే తప్ప పనులు కావడం లేదన్నారు.
Advertisement
Advertisement