వృద్ధ దంపతుల దారుణహత్య
♦ నెల్లూరు సమీపంలోని పెద్దచెరుకూరులో కిరాతకం
♦ శివాలయం ఆవరణలో ఘటన
♦ మృతులది పర్చూరు మండలం నూతలపాడు
♦ అంతర్రాష్ట్ర ముఠాలపై అనుమానం
నెల్లూరు (బారకాసు) : నిద్రలోనే వారి జీవితం తెల్లారిపోయింది. రోజూ ఉదయాన్నే లేచి శివయ్య సేవలో తరించే ఆ దంపతులకు శనివారం ఆ భాగ్యం లేకుండా పోయింది. ఎక్కడి నుంచి వచ్చారో.. ఎందుకు వచ్చారో తెలియదుగానీ గుర్తుతెలియని దుండగులు వారిని కిరాతకంగా హతమార్చారు. బీహార్, కిరాయి హంతకుల తరహాలో తలపగలగొట్టి నూతలపాటి చంద్రమౌళీశ్వరరావు (66), పుష్పవేణి (60) దంపతుల ఉసురు తీశారు. జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ ఘటన నెల్లూరు సమీపంలోని పెద్దచెరుకూరులో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు...
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడుకు చెందిన నూతలపాటి చంద్రమౌళీశ్వరరావు, పుష్పవేణి దంపతులు కుమారుడు సుబ్బయ్యశాస్త్రితో కలిసి 11 ఏళ్ల క్రితం పెద్దచెరుకూరు వచ్చారు. అప్పటి నుంచి గ్రామంలోని చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. సుబ్బయ్యశాస్త్రి ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టలు చేస్తుంటారు. తల్లిదండ్రులు ఆలయ ఆవరణలోని రేకుల ఇంట్లో ఉండగా, సుబ్బయ్యశాస్త్రి మరో ఇంట్లో భార్యపిల్లలతో కలిసి ఉంటున్నాడు. మొదట్లో చంద్రమౌళీశ్వరరావు కూడా అర్చకుడిగా ఉండేవారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంచానికే పరిమితమయ్యారు.
కిరాతక ఘటన...
వృద్ధ దంపతులను దుండగులు గుర్తుతెలియని ఆయుధాలతో తలలపై మోదడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళీశ్వరరావు నేలపై పడివుండగా, పుష్పవేణి మంచంపైనే కన్నుమూశారు. ఆలయ తాళాలు, దుస్తులు, పంచాంగం పుస్తకాలు ఘటన స్థలంలో చెల్లాచెదురుగా పడివున్నాయి. పుష్పవేణి మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు.
వివిధ కోణాల్లో దర్యాప్తు...
సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై శేఖరబాబు ఘటన స్థలానికి చేరుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం ఘటన స్థలంలో ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యాయి. జాగిలం శివాలయం ఆవరణలో నుంచి వంతెన మీదుగా కోడూరు రోడ్డు వరకు వెళ్లి వెనుదిరిగింది. అనంతరం ఎస్పీ విశాల్‌గున్నీ ఘటన స్థలాన్ని పరిశీలించి వివిధ కోణాల్లో ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.
ప్రత్యేక బృందాలతో దర్యాప్తు...
కేసు దర్యాప్తునకు ఎస్పీ విశాల్‌గున్నీ మూడు ప్రత్యేక బృందాలను నియమించారు. ప్రధానంగా ఇది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ముఠాల పనిగా అనుమానిస్తున్నారు. ఇటీవల కావలి శివారులో జరిగిన ఘటనతో దీనిని పోల్చుకుంటూ విచారిస్తున్నారు. మరోవైపు స్థానిక పరిస్థితులపై ద ృష్టిపెట్టారు. చంద్రమౌళీశ్వరరావు ఇటీవల ఒకరికి అప్పుగా ఇచ్చిన కొంత మొత్తం తిరిగి వచ్చినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వారు ఎవరైనా దారుణానికి ఒడిగట్టారా.. అని స్థానికులు అనునిస్తున్నారు.
ప్రజాప్రతినిధుల పరామర్శ...
సుబ్బయ్యశాస్త్రి తల్లిదండ్రులు దారుణహత్యకు గురైన విషయం తెలిసిన వెంటనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాస్‌యాదవ్, మేకల రామ్మూర్తి ఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్యకు గల కారణాలు తెలుసుకుని దుండగులను పట్టుకోవాలని పోలీసులకు సూచించారు.
నిద్రలోనే అనంతలోకాలకు...
పుష్పవేణి ఉదయాన్నే ఆలయ తలుపులు తెరిచి దీపారాధన చేస్తుంటారు. శనివారం మాత్రం ఆమె ఇంట్లో నుంచి బయటకు రాలేదు. పాలుపోసే వ్యక్తి వచ్చి తలుపు తీయగా చంద్రమౌళీశ్వరరావు, పుష్పవేణి దంపతులు విగతజీవులుగా పడివున్నారు. అతను వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. కుమారుడు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు.