పింఛను పాట్లు.. పండుటాకు మృతి
పింఛను పాట్లు.. పండుటాకు మృతి
Published Fri, Dec 16 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
డోన్ టౌన్: పింఛను తీసుకోకుండానే ఓ వృద్ధురాలు కన్నుమూసిన ఘటన కర్నూలు జిల్లా డోన్‌లో చోటు చేసుకుంది. డబ్బు చేతికందక బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగిపోతున్న వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. డోన్ మండలం మల్యాలకు చెందిన హరిజన బాణాల సుంకులమ్మ(75)కు డోన్‌లోని ఆంధ్రా బ్యాంకులో ఎస్‌బీ(011110100083620) ఖాతా ఉంది. ఈమెకు ఐడీ(417680) నెంబర్‌పై వితంతు పింఛన్ వస్తోంది. గత కొంత కాలంగా బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు చేపట్టకపోవడంతో సీజ్ అయింది. వారం రోజులుగా పింఛను కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్న ఈమె బుధవారం రూ.150 చెల్లించి ఖాతాను పునరుద్ధరించుకుంది. పింఛను డబ్బు తీసుకునేందుకు రెండు రోజులు ఆగి రమ్మని బ్యాంకు అధికారులు చెప్పడంతో శుక్రవారం బ్యాంకుకు వెళ్లింది. అయితే మినిమమ్ బ్యాలెన్స్ చార్జీల కింద రూ.688 పోను ఖాతాలో రూ.312 మాత్రమే ఉందని.. అది కూడా తీసుకునేందుకు వీల్లేదని చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికులు గమనించి బ్యాంకు బయటకు తీసుకొచ్చి సపర్యలు చేస్తుండగానే కన్నుమూసింది. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
Advertisement
Advertisement