మృత్యువుతో పోరాడి.. చివరకు ఓడి... | old women dies with mattu mandu | Sakshi
Sakshi News home page

మృత్యువుతో పోరాడి.. చివరకు ఓడి...

Published Sun, Aug 28 2016 10:48 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

మృత్యువుతో పోరాడి.. చివరకు ఓడి... - Sakshi

మృత్యువుతో పోరాడి.. చివరకు ఓడి...

‘మత్తు మందు’ సంఘటనలో అత్త మృతి
ఆగంతకుడికిపై హత్య కేసు నమోదు
అమలాపురం టౌన్‌ : అమలాపురంలో అత్తాకోడళ్లకు మత్తు ఇచ్చిన ఆగంతకుడు.. ఇల్లు దోచుకున్న ఘటనలో అత్త మరణించింది. మత్తు ప్రభావం నుంచి బయటపడకపోవడంతో, కోమాలో ఉండి చికిత్స పొందుతున్న అత్త గన్నవరపు సీతామహాలక్ష్మి(84) ఆదివారం ఉదయం చనిపోయింది. దీంతో చోరీకి పాల్పడిన ఆగంతకుడిపై పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌.. హత్య కేసు నమోదు చేశారు. ఈ నెల 24న పట్టపగలు అమలాపురం కూచిమంచి అగ్రహారంలోని గన్నవరపువారి వీధిలో పైఅంతస్తులో నివసిస్తున్న ఉపాధ్యాయుడు వెంకటరమణ ఇంట్లో ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో లేని సమయంలో ఓ ఆగంతకుడు విద్యుత్‌ బిల్లు తీసుకునే వ్యక్తిగా ఇంట్లోకి వచ్చాడు. వెంకటరమణ భార్య, తల్లికి మత్తు మందు ఇచ్చి, రూ.7 లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులు అపహరించాడు. మత్తుమందు ప్రభావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అత్తాకోడళ్లలో, కొన్ని గంటల తర్వాత కోడలు తెలివిలోకి వచ్చింది. ఘటన జరిగినప్పటి నుంచి మత్తు తీవ్రతతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అత్త సీతామహాలక్ష్మిని పట్టణలలోని ఓ ఎమర్జన్సీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీతామహాలక్ష్మి ఆదివారం మరణించడంతో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. మత్తు ఇవ్వడం వల్లే ఆమె మరణించిందన్న కారణంతో నిందితుడిపై పోలీసులు అదనంగా హత్య కేసు కూడా నమోదు చేశారు. అత్తాకోడళ్లకు క్లోరోఫామ్‌ ఇచ్చినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. ఈ కేసును త్వరగా ఛేదించాలని పోలీసులను డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇప్పటికే ఆదేశించడంతో, ఈ కేసులో లోతుగా దర్యాప్తు జరుగుతోంది. స్థానికులు పథకం ప్రకారం చేశారా, బయటి నుంచి వచ్చిన వ్యక్తులు చేశారా అనే దిశగా విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement