నగదు కోసం రోడ్డెక్కిన ప్రజలు
నందికొట్కూరు: నగదు కోసం ప్రజలు శుక్రవారం రోడ్డెక్కారు. నందికొట్కూరులోని కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై దాదాపు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. అలాగే బ్రాహ్మణకొట్కూరులో ఇండియన్ బ్యాంక్ ఎదుట ఖాతాదారులు ధర్నా చేపట్టారు. ప్రధానమంత్రి నరేంధ్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు డౌన్, డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నాలగైదు రోజుల నుంచి బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నా..డబ్బులు లేవంటే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బ్యాంక్‌కు వచ్చిన సొమ్ము ఎంతో.. ప్రజలకు ఇచ్చిన సొమ్ము ఎంతో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాల విద్యార్థి సంఘం డివిజన్ నాయకులు చరణ్, డీవైఎఫ్‌ఐ డివిజన్ నాయకులు నాగార్జున మాట్లాడుతూ.. కొందరు బ్యాంక్ అధికారులు కమీషన్‌లకు పాల్పడి వచ్చిన డబ్బు అంతా పక్క దారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఇష్టానుసారంగా పెద్దనోట్ల రద్దు ప్రకటించి ప్రజలను తిప్పలు పెడుతోందని విమర్వించారు. ఆందోన చేపట్టిన ఖాతాదారులతో ఎస్‌ఐ లక్ష్మీనారాయణ మాట్లాడి..ధర్నాను విరమింపజేశారు.