సామాన్యులు విలవిల
చేతిలో చిల్లర లేక ఇక్కట్లు
వైద్య ఖర్చులకూ కటకట
సగానికి పైకా ఏటీఎంల మూగనోము
ఏడో రోజూ బ్యాంకుల వద్ద బారులు
విశాఖపట్నం: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. నల్లకుబేరులకు చెక్ పెట్టే లక్ష్యంతో కేంద్రం తీసుకున్న ఈనిర్ణయం సామాన్యుల పాలిట శాపంగా మారింది. నిరు పేదల నుంచి ఎగువ మధ్యతరగతి ప్రజల వరకు ప్రతి ఒక్కరూ నరకంచూస్తున్నారు. రోజువారీ ఖర్చులకు కూడాసొమ్ముల్లేక ఇక్కట్లపా లవుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చేతిలో సొమ్ము లేకుండా ఏపని జరిగే పరిస్థితి లేదు. ఇంట్లో పచారీ సామాన్ల దగ్గర నుంచి ఇంట్లోని పిల్లలు, వృద్ధుల వైద్య ఖర్చుల వరకు కటకటలాడిపోతున్నారు.
కూలీ పనుల్లేవు. ఒక వేళ దొరికినా చేతికి కూలి డబ్బులురాని పరిస్థితి. మరోవైపు వ్యాపారాల్లేవు..ఆషాడ మాసంలో సైతం ఆఫర్ల పుణ్యమాని అమ్మకాలుంటాయి. అలాంటిది కార్తీక మాసం..మరో పక్క పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. అయినా సరే అమ్మకాల్లేక చిరువ్యాపారుల నుంచి బడాషాపింగ్ మాల్స్ వరకు నిర్వహణ ఖర్చులు కూడా వస్తాయోలేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇక తోపుడు బండ్లు, చిల్లరవర్తకుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. అమ్మకాల్లేకపోవడంతో పండ్లు, కూరగాయలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. విశాఖసిటీలోనే కాదు..గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడకెళ్లినా..ఎవర్ని కదిపినా నోట్లకష్టాలే ఎకరవుపెడుతున్నారు. ప్రతిఒక్కరూ కన్నీటిపర్యంతమవుతున్నారు. వరుసగా తొమ్మిదో రోజు కూడా బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్ద బారులు తీరిన క్యూలు కనిపిస్తున్నాయి. నిన్న కాస్త తక్కువరద్దీ కన్పించినప్పటికీ బుధవారం మాత్రం విపరీతమైన రద్దీ కన్పించింది. పోస్టాఫీసుల వద్ద తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరి కనిపించారు. గ్రామీణ ప్రాంతంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.
నిబంధనలకు పాతరేస్తున్న బ్యాంకర్లు
ఆర్‌బీఐ, కేంద్రం జారీ చేసిన నిబంధనలను కొంతమంది బ్యాంకర్లు తుంగలో తొక్కేస్తున్నారు. బుధవారం నుంచి బ్యాంకుల్లో రూ.4500, ఏటీఎంలో అయితే రూ.2500 కొత్తనోట్లు తీసుకో వచ్చని కేంద్రం ప్రకటించింది. కానీ మెజార్టీ బ్యాంకుల్లో సొమ్ముల కొరతను సాకుగా చూపి గతంలో మాదిరిగానే రూ.4వేలే ఇస్తున్నారు. ఇక ఏటీఎంల్లో ఈరోజు కూడా సగానికిపైగా మూగ నోము పాటిస్తున్నాయి. ఏపీజీవీబీలో డిపాజిట్లు తీసుకొని ఒక్క విత్‌డ్రాలు మాత్రమే ఇస్తున్నారు తప్పితే పాత నోట్లుకు కొత్త నోట్లు మార్పిడి ఇవ్వడంలేదు.గ్రామీణ ప్రాంతాల్లో డిపాజిట్లు, విత్‌డ్రాలకు పాస్‌బుక్, ఆధార్‌కార్డు జెరాక్స్ తప్పనిసరి చేశారు. పాతనోట్లుకు కొత్తనోట్లు మార్పు నిబంధన లేదు. యునియన్ బ్యాంక్‌లో డిపాజిట్, విత్‌డ్రాకు ఇదే నిబంధన అమలు చేసి పాతనోట్లుకు కొత్త నోట్లు మార్పుకు పాస్‌బుక్, ఆధార్‌కార్డు జెరాక్స్ కాపీలతోపాటు పాత నెంబర్లు వివరాలను పొందుపరచాలని కొత్త నిబంధన పెట్టారు. దీంతో అకౌంట్లు లేని ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. డెబిట్ కార్డుల్లేకపోవడంతో ఫారం నింపే అవగాహన లే క బ్యాంకుల వద్ద గిరిజనులు నరకం చూస్తున్నారు. మునగపాక ఎస్‌బీఐ వద్ద బ్యాంక్ సిబ్బంది ముందస్తుగా టోకెన్‌లు ఇచ్చేందుకు సన్నద్ధమవుతుండగా వాటిని తీసుకునేం దుకు ఎగపడాల్సి రావడంతో తోపులాటలు జరిగాయి. వారిని అదుపుచేసేందుకు పోలీసులు నానా హైరానా పడాల్చివచ్చింది.
ఒడిలో పసిబిడ్డతో...
ఈయన పేరు యరకం అప్పలకొండ, రాజుపేట, కోటవురట్ల మంలం. ఇటీవల తన ఇంటి వద్ద కుమార్తెకు పురుడు పోశారు. పండంటి బిడ్డ పుట్టింది. బాలింతరాలైన ఆమెకు అవసరమైన పత్యం సరుకులు కూడా కొనే పరిస్థితి లేక ఇబ్బందులపడుతున్నారు. ఎక్కడికెళ్లినా తన వద్ద ఉన్న రూ.500 నోటుకు చిల్లరలేదంటున్నారు. బ్యాంకృుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తే కాని మార్చడం కుదరడం లేదు.. బాలింత అయిన కుమార్తెను వెంటబెట్టుకోని నగదు మార్పిడికి బ్యాంకుకు వచ్చారు. కుమార్తె లోనికి వెళ్లడంతో రోజుల పసిబిడ్డను ఒడిలో పెట్టుకుని ఆరుబయట నిరీక్షిస్తున్న దృశ్యమిది.