బ్రౌన్‌షుగర్ అమ్మేందుకు ప్రయత్నించి..
-
కటకటాలపాలైన టీ మాస్టర్
-
రూ.60 లక్షలు విలువచేసే ఆంఫిటమైన్ పట్టివేత
నెల్లూరు(క్రైమ్) : మాదకద్రవ్యాల విక్రయిస్తున్న ఓ వ్యక్తిని నెల్లూరు రెండోనగర పోలీసులు అరెస్ట్‌చేశారు. అతని వద్ద నుంచి రూ.60 లక్షలు విలువచేసే బ్రౌన్‌షుగర్ (ఆంఫిటమైన్)ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జి.వెంకటరాముడు వివరాలను వెల్లడించారు. ముత్తుకూరు మండలం పొట్టెంపాడు గ్రామానికి చెందిన మారంరెడ్డి శ్రీహరి కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరుకు వచ్చాడు. సంతపేటలో ఉంటూ ప్రధాన రైల్వేస్టేషన్ వద్ద తన బావ టీ దుకాణంలో టీమాస్టర్‌గా పనిచేసేవాడు. ఈక్రమంలో స్టేషన్ పరిసరాల్లో చిల్లరమల్లరగా తిరిగే పెద్దోడు, చిన్నోడులతో పరిచయమైంది. నాలుగునెలల క్రితం శ్రీహరి తన బావవద్ద పనిమానేసి కొత్తహాల్ సెంటర్‌లో లీజుకు ఓ టీకొట్టును తీసుకున్నాడు. పెద్దోడు, చిన్నోడు కొద్దిరోజులు అతని వద్ద పనిచేశారు.
రైల్వేస్టేషన్ వద్ద..
మూడునెలల క్రితం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేసన్‌లో బిరియానీ ప్యాకెట్లు అమ్ముకుంటున్న రవి అనే వ్యక్తికి ప్లాట్‌ఫారం సమీపంలో ఓ పార్శిల్ దొరికింది. అతను దానిని పెద్దోడు, చిన్నోడుల సమక్షంలో విప్పాడు. తెల్లటిపొడి ఉండటంతో అది ఏంటో వారికి అర్థం కాలేదు. దీంతో పెద్దోడు, చిన్నోడు శ్రీహరికి ఫోనుచేసి టపాసులు తయారుచేసే మందు ఉందని, అది అమ్మి సొమ్ము ఇవ్వాలని కోరగా శ్రీహరి ప్యాకెట్ తీసుకున్నాడు. పొడిని రుచిచూడగా మత్తు కలిగింది. ఈక్రమంలోనే అతనికి తన స్నేహితుని ద్వారా భక్తవత్సలనగర్‌లో నివాసముంటున్న వెంకటసురేష్‌తో పరిచయమైయింది. జరిగిన విషయాన్ని శ్రీహరి అతడికి చెప్పి తన వద్ద ఉన్న రెండు ప్యాకెట్లు (3 కేజీలు)ను అప్పగించాడు. హైదరాబాద్‌లోని ఓ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా ఆ పొడిలో 71 శాతం బ్రౌన్‌షుగర్ ఉందని అది ఆంఫిటమైన్ అనే మత్తుపదార్థమని తేలింది. దీంతో దానిని అమ్మేందుకు ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో ప్యాకెట్లు సురేష్‌కు అప్పగించి శ్రీహరి నెల్లూరుకు వచ్చాడు.
వేరొకరితో కలిసి..
ఈనేపథ్యంలో సురేష్ దానిని తన స్నేహితుడైన కిశోర్‌తో కలిసి అమ్మేందుకు ప్రయత్నించాడు. ఇటీవల శ్రీహరి హైదరాబాద్‌కు వెళ్లి ఆంఫిటమైన్‌ను ఇచ్చివేయాలని అతడిని నిలదీశాడు. అందులో సగభాగం పనికిరాకుండా పోయిందని సురేష్ తనవద్దనున్న 1.50 కేజీల ప్యాకెట్‌ను శ్రీహరికి ఇవ్వగా అతను నెల్లూరుకు చేరుకుని తనకు తెలిసిన వ్యక్తి ద్వారా చెన్నైలోని సినీ పరిశ్రమలో వారికి అమ్మే ప్రయత్నం చేశాడు. చెన్నైకు చెందిన ఆ వ్యక్తి ఈనెల 24వ తేదీన ఫోన్ చేసి బ్రౌన్‌షుగర్‌ను తీసుకుని నెల్లూరు రైల్వేస్టేషన్ ఈస్ట్‌పార్శిల్ కార్యాలయం వద్ద ఉండమని, పార్టీ వస్తోందని చెప్పాడు. ఈక్రమంలో మత్తుపదార్థాలు విక్రయిస్తున్నారనే సమాచారం రెండోనగర ఇన్‌స్పెక్టర్ కె.రామకృష్ణారెడ్డికి అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి తూర్పు పార్శిల్ కార్యాలయం వద్ద బ్రౌన్‌షుగర్ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు జీడిమెట్ల వద్ద వెంకటసురేష్‌తో పాటు అతని స్నేహితుడు కిశోర్‌ను అరెస్ట్‌చేసి వారి నుంచి రూ.60 లక్షలు విలువచేసే ఆంఫిటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రెండోనగర ఇన్‌స్పెక్టర్ కె.రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ తిరుపతి, ఏఎస్‌ఐ బ్రహ్మానందం పాల్గొన్నారు.