Brown sugar
-
అస్సాంలో రూ.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత
గౌహతి : అస్సాంలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో రూ.5 కోట్ల విలువైన హెరాయిన్, బ్రౌన్ షుగర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో మణిపూర్ నుంచి వస్తున్న ఓ వాహనంలో సోదాలు జరపగా 75 ప్యాకెట్లలో యబా ట్యాబ్లెట్లు, 68 ప్యాకెట్లలో హెరాయిన్, బ్రౌన్ షుగర్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే బార్పేట జిల్లాలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు డ్రగ్ స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి వద్ద పెద్ద సంఖ్యలో బ్రౌన్ షుగరు పొట్లాలు లభించాయి. -
బ్రౌన్‌షుగర్ ముఠాలో టీడీపీ ఉపసర్పంచ్!
సాక్షి, రాజంపేట: రాజంపేట కేంద్రంగా సాగుతున్న బ్రౌన్‌షుగర్ ముఠాకు సంబంధించి వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలంలోని టీడీపీకి చెందిన పోలి పంచాయతీ ఉపసర్పంచ్ లింగుట ప్రసాద్‌నాయుడు పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన అధికార పార్టీ వర్గాలను కలవరపాటుకు గురిచేసింది. పట్టుబడిన ప్రసాద్‌నాయుడును రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ ఎస్ఐ రాజగోపాల్ విలేకర్లకు తెలియచేశారు. గత నెల 17న రాజంపేట పట్టణ పోలీసులు బ్రౌన్‌షుగర్ అమ్మకాలు చేస్తున్న ముఠాను డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 8మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇందులో పుల్లంపేటకు చెందిన జయసింహ అలియాస్ జయకాంత్, రాజంపేట మండలం పోలికి చెందిన ప్రసాద్‌నాయుడు, పట్టణంలోని ఉస్మాన్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్‌లు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. పోలీసులు నిఘా వేసి ముఠాలో ఒకరైన ప్రసాద్‌నాయుడును పట్టుకుని విచారణ చేపట్టారు. లింగుట ప్రసాద్‌నాయుడు పోలి గ్రామపంచాయతీలో ఎమ్మెల్యేకి అనుచరుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమ పార్టీకి చెందిన ఉపసర్పంచ్ బ్రౌన్‌షుగర్ ముఠా కేసులో పట్టుబడటంతో తెలుగుతమ్ముళ్లను ఆందోళన గురిచేసింది. -
రాజంపేటలో బ్రౌన్‌షుగర్ అమ్మకాలు...
సాక్షి, రాజంపేట : వైఎస్సార్ జిల్లా రాజంపేట పట్టణం బ్రౌన్‌షుగర్ క్రయవిక్రయాలకు అడ్డాగా మారింది. నిషేధిత బ్రౌన్‌షుగర్ అమ్ముతున్నారన్న సమాచారంపై పట్టణానికి చెందిన కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. శనివారం రాత్రి కొంతమంది యువకులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. వారి వద్ద నుంచి బ్రౌన్‌షుగర్ కూడా లభ్యమైనట్లు తెలిసింది. కాగా ముగ్గురిని ముందుగా అదుపులోకి తీసుకొని విచారించినట్లు, ఆపై మరికొంతమందిని కూడా పోలీసులు విచారణ చేసినట్లుగా సమాచారం. అయితే పోలీసులు అదుపులో ఉన్న యువకులు పట్టణానికి చెందిన వారు కావడంతో పోలీసుస్టేషన్ వద్ద సంబంధీకులు మకాం వేశారు. దీన్ని బట్టి చూస్తే రాజంపేట పట్టణంలో బ్రౌన్‌షుగర్ అమ్మకాలు జరుగుతున్నాయనే వాదన బలపడుతోంది. స్థానికంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ఎక్కువ కావటంతో ఇతర ప్రాంతాల నుంచి మాదక ద్రవ్యాలను ఇక్కడికి తెప్పించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని చెబుతున్నారు. స్థానికంగా డ్రగ్స్ వ్యాపారం సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో నిఘాను పెంచారు. శనివారం రాత్రి అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కిలో బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా... పొద్దున్నే వస్తా!
క్రైమ్ పేరెంటింగ్ కంబైన్డ్ స్టడీస్ అనుకునేరు.. లేక బర్త్‌డే పార్టీ అనుకున్నారా? ఉహూ.. అమెరికాకు వెళ్లిపోతున్న ఫ్రెండ్‌కి సీ ఆఫ్ అనుకున్నారా? ఫ్రెండ్ వాళ్ల నాన్నకు బాలేకపోతే హాస్పిటల్లో ఉన్నారనుకున్నారా? వీటిలో ఏదైనా కావచ్చు.. అయితే పర్వాలేదు! కాకపోతే...? బిడ్డను చేజార్చుకునే ప్రమాదం పొంచి ఉంది. దానికి సంతోష్ కథే ఉదాహరణ. అతని వయసు 24 ఏళ్లు! ఊరు విజయవాడ. గతం గుర్తుకొస్తే.. గుర్తుచేస్తే పీడకలలా వణుకిపోతాడు సంతోష్. కారణం డ్రగ్స్! లేకపోతే ఇక్కడ సంతోష్ స్టోరీ ఉండేది కాదు. ఇది ఒక్క అతనిదే కాదు.. అలాంటి చాలామంది యువతీయువకుల కథ! సంతోష్ విజయవాడలో పుట్టి పెరిగాడు. అక్కడే ఓ ప్రైవేట్ స్కూల్లో పదవతరగతి వరకు చదువుకున్నాడు. అతని తండ్రికి కొడుకు పట్ల పెద్ద పెద్ద కోరికలుండేవి. తను ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. వెనక ఆస్తుపాస్తులేమీ లేవు. కొడుకు మంచి చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేయాలని అందరి తండ్రుల్లాగే కలలు కన్నాడు. అందుకే ఇద్దరు కూతుళ్లు ఉన్నా కొడుకుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. ఆడపిల్లలను మున్సిపల్ స్కూల్లో చేర్పించి కొడుకును కాన్వెంట్ స్కూల్‌కు పంపించాడు. పద్నాలుగేళ్ల వరకు బాగానే ఉన్న సంతోష్ పదిహేనో యేట అంటే పదవ తరగతిలో దారి తప్పాడు. తన తండ్రి కలతో నిమిత్తం లేని ప్రపంచంలో సంచరించాడు. ఉన్నత చదువులు అటుంచి ఉన్న చదువునే పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఏం చేస్తున్నాడు? ఎనిమిదేళ్ల వయసులో స్నేహితులతో కలిసి విజయవాడ రోడ్ల మీద తిరుగుతున్నాడు. ప్రకాశం బ్యారేజ్‌ను అడ్డాగా మలచుకున్నాడు. నాన్న జేబులోంచి డబ్బులు దొంగతనం చేసి దమ్ము కొట్టడం మొదలుపెట్టాడు. ఆ మత్తు సిగరెట్ స్థాయి నుంచి మాదకద్రవ్యాల వరకూ వెళ్లింది. అయిదు, పది కాదు ఏకంగా వందల్లో డబ్బులు కావల్సి వచ్చాయి. అందుకే ఏకంగా డెబిట్ కార్డ్‌నే కొట్టేశాడు. నాలుగంకెల్లో డబ్బును డ్రా చేశాడు. మెస్సేజ్ తండ్రి మొబైల్‌కి వెళితే కాని తెలియలేదు కొడుకు ఎలా పెరుగుతున్నాడో. ఇంటికొచ్చి విపరీతంగా కొట్టాడు తండ్రి. కోపం, ఆవేశం తగ్గాక నెమ్మదిగా చెప్పి చూశాడు. విన్నట్టే నటించాడు సంతోష్. తెల్లవారి యథావిధిగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తిష్ట వేశాడు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికపోయాడు తండ్రికి. మళ్లీ పట్టుకుపోయాడు తండ్రి. ఈసారి కొడుకును బతిమాలాడు.. బామాలాడు. కొడుకు ఫ్రెండ్స్‌కూ వార్నింగ్ ఇచ్చాడు.రిజల్ట్ ఇంకో రకంగా వచ్చింది. సంతోష్ ఇంట్లోంచి వెళ్లిపోయి! బ్యారేజ్ మీద.. వీధుల్లో... ఇప్పుడు సంతోష్ ఆటపాటలకు పగ్గాల్లేవ్. ఆకాశమే హద్దు. ప్రకాశం బ్యారేజ్ అనాథలకు స్వర్గధామం.. మాదకద్రవ్యాలు వాళ్లను ఓలలాడించే దేవతలు. ఆ ఆనందం కోసమే కోరి అనాథయ్యాడు సంతోష్. అయిన వాళ్లు ఉన్నా అందరినీ వద్దనుకున్నాడు. వీ«ధే ఇల్లయింది. బ్రౌన్షుగరే అన్నమైంది. స్నానం లేదు.. తిండి లేదు. ఆయన ధ్యాసంతా డ్రగ్స్ మీదే. ఆకలి అంతా బ్రౌన్ షుగర్ మీదే. దొంగతనాలు, టూరిస్ట్‌లను మోసం చేయడం.. ఇలా డ్రగ్స్ కోసం అన్ని పనులూ ప్రారంభించాడు. పోలీసులకు దొరికిపోయాడు. యేడాదిపాటు జువైనల్ హోమ్‌లో ఉన్నాడు. విషయం తండ్రికి తెలిసి విలవిల్లాడాడు. కొడుకు చేజారిపోయాడనే మనోవ్యధతో మంచం పట్టాడు. అయినా సంతోష్‌లో మార్పు లేదు. ఆ అబ్బాయి ప్రేమంతా ప్రకాశం బ్యారేజ్ మీదే. బ్రౌన్‌షుగర్ పాకెట్లను జేబుల్లో పడేసే ఆ పిల్లర్స్ప్లేస్ అంటే సంతోష్‌కు ప్రాణం. అందుకే విడుదలయిన వెంటనే బ్యారేజ్ దగ్గర వాలిపోయాడు. తన మీద బెంగతో తండ్రి చనిపోయాడని తెలిసినా ఇంటికి వెళ్లలేదు. వంతెన కింద చేరి డ్రగ్స్ దాహార్తిని తీర్చుకున్నాడు. ఈ క్రమంలో పోలీసుల దెబ్బలు.. రాత్రివేళ్లల్లో వీధి కుక్కల కాట్లు.. వేటినీ లెక్క చేయలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు తీసుకునే బదులు బ్రోకర్దగ్గరకు వెళ్లి డ్రగ్స్ కొనుక్కునేవాడు. గాయాలు నొప్పి పుట్టినప్పుడల్లా నషా పీల్చి మత్తులో జోగేవాడు. అలా ప్రతి రెండు గంటల కొకసారి మాదకద్రవ్యాలతో మెదడును నిద్రపుచ్చేవాడు. పద్దెనిమిదేళ్లు వచ్చేసరికి.. ప్రకాశం బ్యారేజ్ బయట అతనికి ఓ అమ్మాయి కనిపించింది. పేరు ఉమ. పదిహేనేళ్లుంటాయేమో! స్వస్థలం ఒరిస్సా. ట్రాఫికింగ్ బాధితురాలు. సంతోష్లాగే ఆ పిల్లా డ్రగ్స్‌కి ఎడిక్ట్ అయింది. వీధి గుండాల బారి నుంచి ఆ పిల్లను రక్షించాడు ఒకసారి. అలా ఇద్దరి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. డ్రగ్స్ నుంచి కష్టసుఖాల వరకు అన్నిటినీ పంచుకోవడం మొదలుపెట్టారు. ఇంతలోకే ఒరిస్సా నుంచి ఉమ వాళ్ల తండ్రి, మేనమామ ఇద్దరూ ఆమెను వెదుక్కుంటూ విజయవాడ వచ్చారు. బ్యారేజ్ దగ్గర సంతోష్‌తో ఉన్న తమ అమ్మాయిని గుర్తుపట్టి తీసుకెళ్లారు. ఆ పిల్ల తనను వదిలివెళ్లిపోతుంటే గుండె కోసేసినట్టయింది. కాని వద్దని వారించేంత స్పృహలో లేడు. డ్రగ్స్‌లో మునిగిపోయి ఉన్నాడు. ఆ అమ్మాయి తమ వాళ్లతో వెళ్లిపోయింది. ఆ బాధనూ మళ్లీ డ్రగ్స్‌తోనే ఉపశమింపజేశాడు సంతోష్. డ్రగ్స్‌లోనే స్వర్గం.. అందులోనే మనశ్శాంతి.. అందులోనే సంతోషం.. అందులోనే విశ్రాంతిని పొందసాగాడు. మార్పు కావాలనుకున్నాడు.. కాలం సాగిపోతోంది. బ్యారేజ్ దగ్గరే సంతోష్‌ను ఓ వ్యక్తి చూశాడు. నిత్యం మత్తులో జోగుతున్న సంతోష్‌కి అతనే స్నానం చేయించేవాడు. వేళకింత అన్నం పెట్టేవాడు. ఆ మత్తు వదిలాక తెలిసింది సంతోష్‌కి అతను ఎవరో కాదు చిన్నప్పుడు తనతోపాటే తిరిగిన స్నేహితుడు మస్తాన్ అని. తనతో కలిసి దమ్ము కొట్టిన, డ్రగ్స్ తీసుకున్న జతగాడు మారిపోయాడు మనిషిలా. సంతోష్‌కి సంతోషమైంది. చక్కగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నాడు. శుభ్రంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. మస్తాన్ సంతోష్‌లో ఆలోచనను రేకెత్తించాడు. జీవిత పరమార్థాన్ని గ్రహించాడు సంతోష్. తనూ మనిషిలా మారాలని ఆశపడ్డాడు. ఆ దిశగా ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇప్పుడు.. మళ్లీ జన్మెత్తాడు సంతోష్. ప్రకాశం బ్యారేజ్‌కి వెళతాడు. తన జీవితాన్ని పాఠంగా చెప్తూ అక్కడున్న పిల్లల్లో పరివర్తన తేవడానికి శ్రమిస్తున్నాడు. అయితే ఇప్పుడు అతను హెచ్ఐవీ పాజిటివ్. ఎవరెవరో వాడిన సిరంజిలు, సూదులతో మత్తుమందు నరాల్లోకి ఎక్కించుకోవడం వల్ల హెచ్ఐవి సోకింది. అది విన్న వెంటనే నేలలో కుంగిపోతున్నట్లు ఫీలయ్యాడు. కాని తన పరిస్థితిని ఆమోదించే పరిణతిని తెచ్చుకున్నాడు. జీవితాన్ని ఉన్నదున్నట్టు స్వికరించే స్థితప్రజ్ఞతకు వచ్చేశాడు. కోల్పోయిన కాలాన్ని తిరిగి పోందాలనుకుంటున్నాడు. దూరం చేసుకున్న కుటుంబ ఆప్యాయతలను అందుకోవాలనుకుంటున్నాడు. అక్క, చెల్లెళ్లు ఈ తోబుట్టువును అక్కున చేర్చుకున్నారు. తన వల్లే నాన్న చనిపోయాడన్న కోపంతో అమ్మే ఇంకా క్షమించలేకపోతోంది. తనలో పరివర్తనను తన తల్లి గమనించట్లేదనే బాధ హెచ్ఐవీ కన్నా కుంగదీస్తోంది. ఇప్పుడు సంతోష్ ఆర్తి.. తపన.. ఆశ అంతా అమ్మే. తన తప్పును తెలుసుకొని ఆమె కాళ్ల మీద పడ్డాడు. ఆమె క్షమించి తన తల నిమరాలి. తల్లి ఒళ్లో తల దాచుకొని గుండె అవిసేలా ఏడ్వాలి. తనకు హెచ్ఐవీ ఉందనే విషయాన్నీ చెప్పాలి. ఆ ధైర్యాన్ని గూడగట్టుకునే పనిలోనే ఉన్నాడు సంతోష్. ‘నా గతం ఒక పీడకల. దాన్ని పదేపదే గుర్తుచేసే మనుషులు, వాతావరణం నాకు వద్దు.. నాకు ప్రేమ కావాలి. దాన్ని పంచే నా కుటుంబం కావాలి..’ అంటున్న సంతోష్ కళ్లల్లో ఆశ.. ప్రేమ కోసం ఆర్తి.. తన వాళ్లు తనను ఆదరించాలనే తపన.. తడిగా మెరుస్తున్నాయి. -
బ్రౌన్‌షుగర్ అమ్మేందుకు ప్రయత్నించి..
కటకటాలపాలైన టీ మాస్టర్ రూ.60 లక్షలు విలువచేసే ఆంఫిటమైన్ పట్టివేత నెల్లూరు(క్రైమ్) : మాదకద్రవ్యాల విక్రయిస్తున్న ఓ వ్యక్తిని నెల్లూరు రెండోనగర పోలీసులు అరెస్ట్‌చేశారు. అతని వద్ద నుంచి రూ.60 లక్షలు విలువచేసే బ్రౌన్‌షుగర్ (ఆంఫిటమైన్)ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జి.వెంకటరాముడు వివరాలను వెల్లడించారు. ముత్తుకూరు మండలం పొట్టెంపాడు గ్రామానికి చెందిన మారంరెడ్డి శ్రీహరి కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరుకు వచ్చాడు. సంతపేటలో ఉంటూ ప్రధాన రైల్వేస్టేషన్ వద్ద తన బావ టీ దుకాణంలో టీమాస్టర్‌గా పనిచేసేవాడు. ఈక్రమంలో స్టేషన్ పరిసరాల్లో చిల్లరమల్లరగా తిరిగే పెద్దోడు, చిన్నోడులతో పరిచయమైంది. నాలుగునెలల క్రితం శ్రీహరి తన బావవద్ద పనిమానేసి కొత్తహాల్ సెంటర్లో లీజుకు ఓ టీకొట్టును తీసుకున్నాడు. పెద్దోడు, చిన్నోడు కొద్దిరోజులు అతని వద్ద పనిచేశారు. రైల్వేస్టేషన్ వద్ద.. మూడునెలల క్రితం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేసన్లో బిరియానీ ప్యాకెట్లు అమ్ముకుంటున్న రవి అనే వ్యక్తికి ప్లాట్ఫారం సమీపంలో ఓ పార్శిల్ దొరికింది. అతను దానిని పెద్దోడు, చిన్నోడుల సమక్షంలో విప్పాడు. తెల్లటిపొడి ఉండటంతో అది ఏంటో వారికి అర్థం కాలేదు. దీంతో పెద్దోడు, చిన్నోడు శ్రీహరికి ఫోనుచేసి టపాసులు తయారుచేసే మందు ఉందని, అది అమ్మి సొమ్ము ఇవ్వాలని కోరగా శ్రీహరి ప్యాకెట్ తీసుకున్నాడు. పొడిని రుచిచూడగా మత్తు కలిగింది. ఈక్రమంలోనే అతనికి తన స్నేహితుని ద్వారా భక్తవత్సలనగర్‌లో నివాసముంటున్న వెంకటసురేష్‌తో పరిచయమైయింది. జరిగిన విషయాన్ని శ్రీహరి అతడికి చెప్పి తన వద్ద ఉన్న రెండు ప్యాకెట్లు (3 కేజీలు)ను అప్పగించాడు. హైదరాబాద్‌లోని ఓ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా ఆ పొడిలో 71 శాతం బ్రౌన్‌షుగర్ ఉందని అది ఆంఫిటమైన్ అనే మత్తుపదార్థమని తేలింది. దీంతో దానిని అమ్మేందుకు ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో ప్యాకెట్లు సురేష్‌కు అప్పగించి శ్రీహరి నెల్లూరుకు వచ్చాడు. వేరొకరితో కలిసి.. ఈనేపథ్యంలో సురేష్ దానిని తన స్నేహితుడైన కిశోర్‌తో కలిసి అమ్మేందుకు ప్రయత్నించాడు. ఇటీవల శ్రీహరి హైదరాబాద్‌కు వెళ్లి ఆంఫిటమైన్‌ను ఇచ్చివేయాలని అతడిని నిలదీశాడు. అందులో సగభాగం పనికిరాకుండా పోయిందని సురేష్ తనవద్దనున్న 1.50 కేజీల ప్యాకెట్‌ను శ్రీహరికి ఇవ్వగా అతను నెల్లూరుకు చేరుకుని తనకు తెలిసిన వ్యక్తి ద్వారా చెన్నైలోని సినీ పరిశ్రమలో వారికి అమ్మే ప్రయత్నం చేశాడు. చెన్నైకు చెందిన ఆ వ్యక్తి ఈనెల 24వ తేదీన ఫోన్ చేసి బ్రౌన్‌షుగర్‌ను తీసుకుని నెల్లూరు రైల్వేస్టేషన్ ఈస్ట్పార్శిల్ కార్యాలయం వద్ద ఉండమని, పార్టీ వస్తోందని చెప్పాడు. ఈక్రమంలో మత్తుపదార్థాలు విక్రయిస్తున్నారనే సమాచారం రెండోనగర ఇన్స్పెక్టర్ కె.రామకృష్ణారెడ్డికి అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి తూర్పు పార్శిల్ కార్యాలయం వద్ద బ్రౌన్‌షుగర్ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు జీడిమెట్ల వద్ద వెంకటసురేష్‌తో పాటు అతని స్నేహితుడు కిశోర్‌ను అరెస్ట్‌చేసి వారి నుంచి రూ.60 లక్షలు విలువచేసే ఆంఫిటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రెండోనగర ఇన్స్పెక్టర్ కె.రామకృష్ణారెడ్డి, ఎస్ఐ తిరుపతి, ఏఎస్ఐ బ్రహ్మానందం పాల్గొన్నారు. -
మత్తు...చిత్తు
నేడు ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ, రవాణా నియంత్రణ దినోత్సవం కడప: చాలా మంది మాదక ద్రవ్యాల మత్తులో జోగుతున్నారు. ఎక్కువగా ఆల్కాహాల్, గంజాయి, హెరాయిన్, బ్రౌన్ షుగర్, ఓపీయాడ్ ఇంజెక్షన్లు వంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. వీటిని వినియోగిస్తూ తమ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. జిల్లాలో 100కి 30 మంది వీటి బారిన పడుతున్నారు. కడప రిమ్స్‌కు చికిత్స కోసం వచ్చే ప్రతి 100 మందిలో 10 మంది ఇలాంటి వారే ఉన్నారు. ఆడవారిలో ప్రతి 100 మందిలో ఐదుగురు మత్తుకు బానిసలవుతున్నారు. ఆదివారం ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ, రవాణా నియంత్రణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం... జిల్లాలో... జిల్లాలో ఎక్కువగా రాయచోటి, బద్వేలు, ప్రొద్దుటూరు, పులివెందుల, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో గంజాయి ప్రభావం ఎక్కువగాఉంది. రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల నుంచి బ్రౌన్ షుగర్ లాంటి మాదక ద్రవ్యాలను తినుబండారాలు, ఔషధాల రూపంలో గల్ఫ్ దేశాలకు తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. నేడు కడపలో ర్యాలీ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ఆదివారం నిర్వహించనున్నారు. అనంతరం నూతన కలెక్టరేట్లోని సభా భవనంలో సదస్సు నిర్వహిస్తారు. జిల్లాలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారు, పోలీసు అధికారులు, సిబ్బంది, వైద్యులు, వైద్య సిబ్బంది, ఎన్జీఓ సంఘాల వారు, ప్రజలు పాల్గొంటారు. అనర్థాలు మాదక ద్రవ్యాల బారిన పడితే మెదడుపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారు తమ శరీరాన్ని అదుపు తప్పేలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మత్తులోనే ఏ పని చేయడానికైనా సిద్ధ పడుతూ ఉంటారు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు, ఘర్షణలు, ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. జాగ్రత్తలు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను చైతన్యపరిచి వాటి వల్ల కలిగే అనర్థాలు, నష్టాల గురించి వివరిస్తూ రావాలి. ముఖ్యంగా యువత త్వరగా ఆకర్షితులవుతారు. తమ పిల్లల ప్రవర్తన, వారి స్నేహాల గురించి తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఉండాలి. వారు పెరిగే వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది. విజయవంతం చేయండి రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా లీగల్‌సెల్ అథారిటీ వారు ఆదివారం చేపట్టబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. - రాఘవరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కడప. వైద్యం తప్పనిసరి మాదక ద్రవ్యాల బారిన పడిన వారు వైద్యసేవలు చేయించుకోవాలి. రిమ్స్‌లో మానసిక వైద్యం విభాగంలో వైద్యసేవలను అందిస్తాం. - డాక్టర్ వెంకటరాముడు, రిమ్స్ మానసిక వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, కడప. నిరంతర కృషి జిల్లాలో గంజాయి, హెరాయిన్ల ప్రభావం ఎక్కువగా ఉందని మా దృష్టికి రావడంతో నివారించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. - ప్రేమ్ ప్రసాద్, ప్రొహి బిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్, కడప. నిఘా పెంచుతాం జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణపై నిఘా పెంచుతాం. వీటిని ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. - పిహెచ్డి రామకృష్ణ, ఎస్పీ -
రూ. 7 లక్షల విలువైన బ్రౌన్‌షుగర్ స్వాధీనం
అక్రమంగా విదేశాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్న 720 గ్రాముల బ్రౌన్ షుగర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట నుంచి గల్ఫ్ దేశాలకు నల్లమందు సరఫరా చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం సాయంత్రం పాత బస్టాండ్‌లో తనఖీలు నిర్వహించి బ్రౌన్‌షుగర్ తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బ్రౌన్‌షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
మాదకద్రవ్యాల ఉచ్చులో యువత
నేరస్తులను గుర్తించడంలో విఫలమవుతున్న పోలీసులు జల్సాలకు అలవాటు పడ్డ యువత డబ్బు సంపాదనే ధ్యేయంగా అక్రమ మార్గాల వైపు మొగ్గుచూపుతోంది. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి పెలైట్లుగాను డ్రగ్స్ తదితర మాదకద్రవ్యాల వైపు మరలుతున్నారు. గతంలో జరిగిన సంఘటనలే కాకుండా ఇటీవల పోలీసు అరెస్టుల్లో కూడా యువకుల పాత్రతో పాటు వారికి స్మగ్లర్లు అందిస్తున్న డ్రగ్స్ కూడా వెలుగులోకి వస్తున్నాయి. సాక్షి, చిత్తూరు : చైనాతో పాటు ఇతర దేశాలకు చెందిన స్మగ్లర్లు భారతదేశానికి బ్రౌన్ షుగర్, కోకైన్ వంటి మాదక ద్రవ్యాలను దిగుమతి చేయిస్తున్నారు. అయితే మొదట వీటి గురించి తెలియని యువకులు కొందరి మాయలో పడుతున్నారు. 2014 అక్టోబర్ 12తేదీన బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్తూ చెన్నై విమానాశ్రయంలో పట్టుబడ్డ పీలేరుకు చెందిన ఆనంద్ విషయంలో నార్కో అనాలసిస్ విభాగం పలు పరీక్షలు చేసి చిత్తూరు జిల్లా పోలీసులకు సమాచారం అందించినా అసలు నిందితులను పట్టుకోలేకపోయారు. ఆనంద్ అనే వ్యక్తి ఆరోతరగతి వరకు చదువుకుని గొర్రెల కాపరిగా ఉంటూ, గిట్టుబాటు కాక ఆ గొర్రెలను అమ్ముకుని వచ్చిన డబ్బుతో కువైట్‌కు వెళ్లేందుకు బయలుదేరాడు. అతని సమీప గ్రామస్తుడైన వ్యక్తి వచ్చి పది గోధుమ పిండి పొట్లాలని చెప్పి బ్యాగు ఇచ్చి దాంతోపాటు ఆనంద్‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో వదిలి వచ్చాడు. ఎయిర్‌పోర్టులోకి వెళ్లిన ఆనంద్ కస్టమ్ అధికారుల తనిఖీల్లో బ్రౌన్ షుగర్ తరలిస్తున్నట్లు బయటపడింది. అయితే నేటికీ ఆనంద్ విడుదల కాకపోగా దీనికి సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. అయితే ఇదే కేసుకు సంబంధించి మదనపల్లెకు చెందిన ఛాయాదేవి అనే మహిళకు కూడా సంబంధమున్నట్లు, నైజీరియాలో ఆమె పట్టుబడట్లు కూడా అప్పుడు వార్తలొచ్చాయి. అయితే మదనపల్లె పోలీసులు ఆమె పాస్‌పోర్టును, తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణలో ఛాయాదేవికీ, ఆ కేసుకు ఎటువంటి సంబంధం లేదని మదనపల్లె టూ టౌన్ పోలీసులు తేల్చారు. అయితే నిరుద్యోగ యువకులు మాత్రం మాదకద్రవ్యాల ముఠా చేతుల్లో సమిధులవుతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా సమాచారాన్ని ఏదో ఒక విధంగా తెలుసుకుంటున్నా, మాదకద్రవ్యాల సమాచారం సేకణలో పోలీసులు విఫలమవుతున్నారు. దుబాయ్, చెన్నై, థాయ్‌లాండ్, నేపాల్‌లకు చెందిన పలువురు అంతర్జాతీయ స్మగ్లర్ల విచారణలో వారు తమ దేశాలకు ఎర్రచందనం తెప్పించుకోవడంతో పాటు ఎర్రచందానాన్ని పంపుతున్న ఇండియాకు మాదకద్రవ్యాలను పంపుతున్న ట్లు పోలీసులు సమాచారాన్ని రాబట్టగలిగారు. అయి తే చెన్నై ఎయిర్‌పోర్టు సంఘటన జరిగి సంవత్సరం దాటుతున్నా కేసు పురోగతి సాధించింది లేదు. -
బ్రౌన్ షుగర్ ముఠా అరెస్ట్
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలో బ్రౌన్ షుగర్ సరఫరా చేస్తున్న నలుగురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేసి వారివద్ద నుంచి 1.5 కిలోల బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. కడప రింగ్‌రోడ్డు వద్ద ఆదివారం ఎస్ఐ అనిల్‌కుమార్, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, అంజి, రాజేశ్వరరెడ్డి, హయాత్, సుబ్బరాయుడు, ధనుంజయలు వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఇండికా వాహనాన్ని తనిఖీ చేస్తుండగా అందులో ఉన్న శివయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. వల్లూరు పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రాంకుమార్, కడప చిన్నచౌకుకు చెందిన శివ, ముస్తఫాలు కలిసి బ్రౌన్ షుగర్‌ను బెంగళూరుకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో వాహనంలో ఉన్న నలుగురినీ అరెస్టు చేశారు. మరో ఇద్దరిపై కూడా అనుమానాలు ఉన్నాయని.. త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తామని ఏఎస్పీ తెలిపారు. ఇందుకు బాధ్యులు ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. ఈ బ్రౌన్ షుగర్‌ను ఇక్కడికి ఎందుకు తెచ్చారు.. ఎవరెవరికి విక్రయించారు అనే కోణంలో కూడా విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బ్రౌన్ షుగర్ విలువ దాదాపు రూ.35లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందివ్వాలని.. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చె ప్పారు. నిందితులను అరెస్టు చేసే విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి రివార్డులు అందేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామన్నారు. కార్యక్రమంలో పులివెందుల రూరల్ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్ఐలు అనిల్‌కుమార్, వెంకటనాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మత్తులో చిత్తవుతున్న కొండాపూర్
ముస్తాబాద్, న్యూస్‌లైన్ : మత్తు విచక్షణను చంపుతుంది.. క్షణికావేశాలకు పూరి గొల్పుతుంది.. ఫలితం భార్య, బిడ్డలనే కాదు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులపై దాడులు. అంతేకాదు చేతి చమురును కో ల్పోయేలా చేస్తుంది. చివరకు ప్రాణాలను హరిస్తుంది. కొద్ది నెలల్లోనే మండల కేంద్రంలోని కొండాపూర్‌లో అతిగా మద్యం తాగి నలుగురికి పైగా మృత్యువాతపడ్డారు. తాజా గా ఓ యువకుడు మత్తుకు అలవాటుపడి వింతగా ప్రవర్తించసాగాడు. కుటుంబసభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. మద్యంతోపాటు బ్రౌన్‌షుగర్ వాడుతున్నట్టు వైద్యు లు నిర్ధారించారు. మారుమూల పల్లెలోకి నిషేధిత మత్తుపదార్థమైన బ్రౌన్‌షుగర్ ఎలా వచ్చిందన్న విషయం ప్రస్తుతం అందరినీ తొలుస్తోంది. ముస్తాబాద్ మండలం కొండాపూర్‌లో కొద్ది సంవత్సరాలుగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో అనేక కుటుంబా లు వీధిన పడుతున్నాయి. తాగి దాడి చేశాడంటూ ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కన్న కొడుకు, భర్తపై కేసులు నమోద యిన ఘటనలు పెరిగిపోతున్నాయి. గుడుంబా, బెల్ట్‌దుకాణాల్లో లభిస్తున్న చౌక మద్యం గ్రామం పాలిటశాపంగా మారింది. ఇదంతా ఒక ఎత్తై.. తాజాగా ఓ వ్యక్తి తాగుడుకు బానిసై, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని భావించిన కుటుంబసభ్యులు వారం పాటు అతడికి మద్యం అందుబాటులో లేకుండా చేశారు. దీంతో అతడు మత్తుకోసం పిచ్చివాడిగా మారి, గోడలు, నేలపై పడి మట్టిని తింటున్నాడు. సద రు వ్యక్తి విపరీతంగా ప్రవర్తించడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అక్కడ వైద్యులు సదరు వ్యక్తిని పరీ క్షించగా మద్యం, గుడుంబాతోపాటు బ్రౌన్‌షుగర్ నిత్యం వాడడం వల్లె తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని తేల్చిచెప్పారు. కొద్ది రోజులుగా బ్రౌన్‌షుగర్ వాడుతున్నాడని వైద్యు లు చెప్పడంతో వారు తీవ్ర అందోళనకు గురువుతున్నారు. మామూలు పల్లెటూరిలో బ్రౌన్‌షుగర్ ఎక్కడి నుంచి వస్తోం దని గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి తాను ఆఫీసర్‌నంటూ ప్రభుత్వ పాఠశాలను సైతం తనిఖీ చేసి హల్చల్ సృష్టించాడు. ఇది కూడా మత్తు విపరీతానికి పరాకాష్టగా భావిస్తున్నామని ఎస్సై బాబురావు పేర్కొన్నారు. కొండాపూర్ సమీపంలోని రాంరెడ్డిపల్లి నుంచి పెద్ద ఎత్తున గుడుంబా ఇక్కడికి సరఫరా అవుతోంది. ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. బ్రౌన్‌షుగర్ వాడడం వల్లే హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, గ్రామంలో మద్యం, గుడుంబా విక్రయాలను నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులను రక్షించాల్సిన అవసరం అధికారులపై ఉంది.