ఫ్రెండ్‌ ఇంట్లో ఉన్నా... పొద్దున్నే వస్తా! | special story to Crime Parenting | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్‌ ఇంట్లో ఉన్నా... పొద్దున్నే వస్తా!

Published Mon, Apr 24 2017 11:38 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

ఫ్రెండ్‌ ఇంట్లో ఉన్నా... పొద్దున్నే వస్తా! - Sakshi

ఫ్రెండ్‌ ఇంట్లో ఉన్నా... పొద్దున్నే వస్తా!

క్రైమ్‌ పేరెంటింగ్‌

కంబైన్డ్‌ స్టడీస్‌ అనుకునేరు.. లేక బర్త్‌డే పార్టీ అనుకున్నారా?
ఉహూ.. అమెరికాకు వెళ్లిపోతున్న ఫ్రెండ్‌కి సీ ఆఫ్‌ అనుకున్నారా?
ఫ్రెండ్‌ వాళ్ల నాన్నకు బాలేకపోతే హాస్పిటల్లో ఉన్నారనుకున్నారా?
వీటిలో ఏదైనా కావచ్చు.. అయితే పర్వాలేదు! కాకపోతే...?


బిడ్డను చేజార్చుకునే ప్రమాదం పొంచి ఉంది. దానికి సంతోష్‌ కథే ఉదాహరణ. అతని వయసు 24 ఏళ్లు! ఊరు విజయవాడ. గతం గుర్తుకొస్తే.. గుర్తుచేస్తే పీడకలలా వణుకిపోతాడు సంతోష్‌. కారణం డ్రగ్స్‌! లేకపోతే ఇక్కడ సంతోష్‌ స్టోరీ ఉండేది కాదు. ఇది ఒక్క అతనిదే కాదు.. అలాంటి చాలామంది యువతీయువకుల కథ! సంతోష్‌ విజయవాడలో పుట్టి పెరిగాడు. అక్కడే ఓ ప్రైవేట్‌ స్కూల్లో పదవతరగతి వరకు చదువుకున్నాడు. అతని తండ్రికి కొడుకు పట్ల పెద్ద పెద్ద కోరికలుండేవి. తను ఓ ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగి. వెనక ఆస్తుపాస్తులేమీ లేవు. కొడుకు మంచి చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేయాలని అందరి తండ్రుల్లాగే కలలు కన్నాడు. అందుకే ఇద్దరు కూతుళ్లు ఉన్నా కొడుకుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. ఆడపిల్లలను మున్సిపల్‌ స్కూల్లో చేర్పించి కొడుకును కాన్వెంట్‌ స్కూల్‌కు పంపించాడు. పద్నాలుగేళ్ల వరకు బాగానే ఉన్న సంతోష్‌ పదిహేనో యేట అంటే పదవ తరగతిలో దారి తప్పాడు. తన తండ్రి కలతో నిమిత్తం లేని ప్రపంచంలో సంచరించాడు. ఉన్నత చదువులు అటుంచి ఉన్న చదువునే పట్టించుకునే పరిస్థితుల్లో లేడు.

ఏం చేస్తున్నాడు?
ఎనిమిదేళ్ల వయసులో స్నేహితులతో కలిసి విజయవాడ రోడ్ల మీద తిరుగుతున్నాడు. ప్రకాశం బ్యారేజ్‌ను అడ్డాగా మలచుకున్నాడు. నాన్న జేబులోంచి డబ్బులు దొంగతనం చేసి దమ్ము కొట్టడం మొదలుపెట్టాడు. ఆ మత్తు సిగరెట్‌ స్థాయి నుంచి మాదకద్రవ్యాల వరకూ వెళ్లింది. అయిదు, పది కాదు ఏకంగా వందల్లో డబ్బులు కావల్సి వచ్చాయి. అందుకే ఏకంగా డెబిట్‌ కార్డ్‌నే కొట్టేశాడు. నాలుగంకెల్లో డబ్బును డ్రా చేశాడు. మెస్సేజ్‌ తండ్రి మొబైల్‌కి వెళితే కాని తెలియలేదు కొడుకు ఎలా పెరుగుతున్నాడో. ఇంటికొచ్చి విపరీతంగా కొట్టాడు తండ్రి. కోపం, ఆవేశం తగ్గాక నెమ్మదిగా చెప్పి చూశాడు. విన్నట్టే నటించాడు సంతోష్‌. తెల్లవారి యథావిధిగా ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర తిష్ట వేశాడు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికపోయాడు తండ్రికి. మళ్లీ పట్టుకుపోయాడు తండ్రి. ఈసారి కొడుకును బతిమాలాడు.. బామాలాడు. కొడుకు ఫ్రెండ్స్‌కూ వార్నింగ్‌ ఇచ్చాడు.రిజల్ట్‌ ఇంకో రకంగా వచ్చింది. సంతోష్‌ ఇంట్లోంచి వెళ్లిపోయి!

బ్యారేజ్‌ మీద.. వీధుల్లో...
ఇప్పుడు సంతోష్‌ ఆటపాటలకు పగ్గాల్లేవ్‌. ఆకాశమే హద్దు. ప్రకాశం బ్యారేజ్‌ అనాథలకు స్వర్గధామం.. మాదకద్రవ్యాలు వాళ్లను ఓలలాడించే దేవతలు. ఆ ఆనందం కోసమే కోరి అనాథయ్యాడు సంతోష్‌. అయిన వాళ్లు ఉన్నా అందరినీ వద్దనుకున్నాడు. వీ«ధే ఇల్లయింది. బ్రౌన్‌షుగరే అన్నమైంది. స్నానం లేదు.. తిండి లేదు. ఆయన ధ్యాసంతా డ్రగ్స్‌ మీదే. ఆకలి అంతా బ్రౌన్‌ షుగర్‌ మీదే. దొంగతనాలు, టూరిస్ట్‌లను మోసం చేయడం.. ఇలా డ్రగ్స్‌ కోసం అన్ని పనులూ ప్రారంభించాడు. పోలీసులకు దొరికిపోయాడు. యేడాదిపాటు జువైనల్‌ హోమ్‌లో ఉన్నాడు. విషయం తండ్రికి తెలిసి విలవిల్లాడాడు. కొడుకు చేజారిపోయాడనే మనోవ్యధతో మంచం పట్టాడు. అయినా సంతోష్‌లో మార్పు లేదు. ఆ అబ్బాయి ప్రేమంతా ప్రకాశం బ్యారేజ్‌ మీదే.

బ్రౌన్‌షుగర్‌ పాకెట్లను జేబుల్లో పడేసే ఆ పిల్లర్స్‌ప్లేస్‌ అంటే సంతోష్‌కు ప్రాణం. అందుకే విడుదలయిన వెంటనే బ్యారేజ్‌ దగ్గర వాలిపోయాడు. తన మీద బెంగతో తండ్రి చనిపోయాడని తెలిసినా ఇంటికి వెళ్లలేదు. వంతెన కింద చేరి డ్రగ్స్‌ దాహార్తిని తీర్చుకున్నాడు. ఈ క్రమంలో పోలీసుల దెబ్బలు.. రాత్రివేళ్లల్లో వీధి కుక్కల కాట్లు.. వేటినీ లెక్క చేయలేదు. డాక్టర్‌ దగ్గరకు వెళ్లి మందులు తీసుకునే బదులు బ్రోకర్‌దగ్గరకు వెళ్లి డ్రగ్స్‌ కొనుక్కునేవాడు. గాయాలు నొప్పి పుట్టినప్పుడల్లా నషా పీల్చి మత్తులో జోగేవాడు. అలా ప్రతి రెండు గంటల కొకసారి మాదకద్రవ్యాలతో మెదడును నిద్రపుచ్చేవాడు.

పద్దెనిమిదేళ్లు వచ్చేసరికి..
ప్రకాశం బ్యారేజ్‌ బయట అతనికి ఓ అమ్మాయి కనిపించింది. పేరు ఉమ. పదిహేనేళ్లుంటాయేమో! స్వస్థలం ఒరిస్సా. ట్రాఫికింగ్‌ బాధితురాలు. సంతోష్‌లాగే ఆ పిల్లా డ్రగ్స్‌కి ఎడిక్ట్‌ అయింది. వీధి గుండాల బారి నుంచి ఆ పిల్లను రక్షించాడు ఒకసారి. అలా ఇద్దరి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. డ్రగ్స్‌ నుంచి కష్టసుఖాల వరకు అన్నిటినీ పంచుకోవడం మొదలుపెట్టారు. ఇంతలోకే ఒరిస్సా నుంచి ఉమ వాళ్ల తండ్రి, మేనమామ ఇద్దరూ ఆమెను వెదుక్కుంటూ విజయవాడ వచ్చారు. బ్యారేజ్‌ దగ్గర సంతోష్‌తో ఉన్న తమ అమ్మాయిని గుర్తుపట్టి తీసుకెళ్లారు. ఆ పిల్ల తనను వదిలివెళ్లిపోతుంటే గుండె కోసేసినట్టయింది. కాని వద్దని వారించేంత స్పృహలో లేడు. డ్రగ్స్‌లో మునిగిపోయి ఉన్నాడు. ఆ అమ్మాయి తమ వాళ్లతో వెళ్లిపోయింది. ఆ బాధనూ మళ్లీ డ్రగ్స్‌తోనే ఉపశమింపజేశాడు సంతోష్‌. డ్రగ్స్‌లోనే స్వర్గం.. అందులోనే మనశ్శాంతి.. అందులోనే సంతోషం.. అందులోనే విశ్రాంతిని పొందసాగాడు.

మార్పు కావాలనుకున్నాడు..
కాలం సాగిపోతోంది. బ్యారేజ్‌ దగ్గరే సంతోష్‌ను ఓ వ్యక్తి చూశాడు. నిత్యం మత్తులో జోగుతున్న సంతోష్‌కి అతనే స్నానం చేయించేవాడు. వేళకింత అన్నం పెట్టేవాడు. ఆ మత్తు వదిలాక తెలిసింది సంతోష్‌కి అతను ఎవరో కాదు చిన్నప్పుడు తనతోపాటే తిరిగిన స్నేహితుడు మస్తాన్‌ అని. తనతో కలిసి దమ్ము కొట్టిన, డ్రగ్స్‌ తీసుకున్న జతగాడు మారిపోయాడు మనిషిలా. సంతోష్‌కి సంతోషమైంది. చక్కగా ఇంగ్లిష్‌ మాట్లాడుతున్నాడు. శుభ్రంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. మస్తాన్‌ సంతోష్‌లో ఆలోచనను రేకెత్తించాడు. జీవిత పరమార్థాన్ని గ్రహించాడు సంతోష్‌. తనూ మనిషిలా మారాలని ఆశపడ్డాడు. ఆ దిశగా ప్రయత్నం మొదలుపెట్టాడు.

ఇప్పుడు..
మళ్లీ జన్మెత్తాడు సంతోష్‌. ప్రకాశం బ్యారేజ్‌కి వెళతాడు. తన జీవితాన్ని పాఠంగా చెప్తూ అక్కడున్న పిల్లల్లో పరివర్తన తేవడానికి శ్రమిస్తున్నాడు. అయితే ఇప్పుడు అతను హెచ్‌ఐవీ పాజిటివ్‌. ఎవరెవరో వాడిన సిరంజిలు, సూదులతో మత్తుమందు నరాల్లోకి ఎక్కించుకోవడం వల్ల హెచ్‌ఐవి సోకింది. అది విన్న వెంటనే నేలలో కుంగిపోతున్నట్లు ఫీలయ్యాడు. కాని తన పరిస్థితిని ఆమోదించే పరిణతిని తెచ్చుకున్నాడు. జీవితాన్ని ఉన్నదున్నట్టు స్వికరించే స్థితప్రజ్ఞతకు వచ్చేశాడు. కోల్పోయిన కాలాన్ని తిరిగి పోందాలనుకుంటున్నాడు. దూరం చేసుకున్న కుటుంబ ఆప్యాయతలను అందుకోవాలనుకుంటున్నాడు.

అక్క, చెల్లెళ్లు ఈ తోబుట్టువును అక్కున చేర్చుకున్నారు. తన వల్లే నాన్న చనిపోయాడన్న కోపంతో అమ్మే ఇంకా క్షమించలేకపోతోంది. తనలో పరివర్తనను తన తల్లి గమనించట్లేదనే బాధ హెచ్‌ఐవీ కన్నా కుంగదీస్తోంది. ఇప్పుడు సంతోష్‌ ఆర్తి.. తపన.. ఆశ అంతా అమ్మే. తన తప్పును తెలుసుకొని ఆమె కాళ్ల మీద పడ్డాడు. ఆమె క్షమించి తన తల నిమరాలి. తల్లి ఒళ్లో తల దాచుకొని గుండె అవిసేలా ఏడ్వాలి. తనకు హెచ్‌ఐవీ ఉందనే విషయాన్నీ చెప్పాలి. ఆ ధైర్యాన్ని గూడగట్టుకునే పనిలోనే ఉన్నాడు సంతోష్‌. ‘నా గతం ఒక పీడకల. దాన్ని పదేపదే గుర్తుచేసే మనుషులు, వాతావరణం నాకు వద్దు.. నాకు ప్రేమ కావాలి. దాన్ని పంచే నా కుటుంబం కావాలి..’ అంటున్న సంతోష్‌ కళ్లల్లో ఆశ.. ప్రేమ కోసం ఆర్తి.. తన వాళ్లు తనను ఆదరించాలనే తపన.. తడిగా మెరుస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement