బోల్తాపడ్డ ట్రాక్టర్ కింద ఇరుక్కున్న మృతదేహం
బుచ్చిపేట(నరసన్నపేట) : మడపాం నుంచి ముషిడిగట్టుకు వెళ్లే మార్గంలో బుచ్చిపేట సమీపంలో శనివారం ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మడపాం నుంచి చేనులవలస ఇసుక ర్యాంపునకు ఇసుక కోసం వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బుచ్చిపేట సమీపంలో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న యజమాని మడపాం పంచాయతీ కొత్తపేటకు చెందిన గొర్లె శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట ఎస్‌ఐ ఎన్.లక్ష్మణ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ట్రాక్టర్ కొన్న 10 రోజులకే..
శ్రీను పది రోజుల కిందటే ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఇసుకను తవ్వి అమ్మకాలు చేస్తున్నాడు. శనివారం కూడా అదే పనిలో ఉండగా డ్రైవర్ లేని సమయంలో ట్రాక్టర్‌ను శ్రీను తీసుకొని చేనులవలస ర్యాంపుకు బయలుదేరాడు. బుచ్చిపేట ముందు వర్షాలకు రోడ్డు బాగా కోతకు గురవడంతో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఇంజిన్ కింద ఇరుక్కుపోయిన శ్రీను తలకు బలమైన గాయమైంది. దీంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వర్షాలకు రోడ్డు కోతకు గురవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.