తాడేపల్లిగూడెం రూరల్: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు.. మరో పది మంది కూలీలు, డ్రైవర్ గాయపడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని అప్పారావుపేట గ్రామానికి చెందిన మాచర్ల రామారావు మాధవరం కోతిగుంట సమీపంలోని బాడవా పొలాల్లో కలుపు తీత కోసం అదే గ్రామానికి చెందిన 12 మంది కూలీలను తన ట్రాక్టర్‌పై తీసుకెళ్లాడు. మధ్యాహ్నం పనులు ముగించుకుని తిరిగి వారిని అప్పారావుపేట తీసుకెళ్తుండగా కోతిగుంట చెరువు గట్టు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో మహిళా కూలీలు ఆకుమర్తి సుజాత (46), పాకా భారతి (35) మృతి చెందారు. డ్రైవర్ మాచర్ల రామారావు, కూలీలు కోట సింహాచలం, షేక్ మస్తాన్ బీబీ, జొన్నాడ శివపార్వతి, పెరుమళ్ల నాగలక్ష్మి, పెరుమళ్ల కోట సత్తెమ్మ, కోయిల నాగజ్యోతి, పెరుమళ్ల రామలక్ష్మి, తానేటి వరలక్ష్మి, మడిపల్లి సుబ్రహ్మణ్యం, మిద్దే పద్మ గాయపడ్డారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ వైకేవీ అప్పారావు, తాడేపల్లిగూడెం పట్టణ సీఐ నాగరాజు, పెంటపాడు సీఐ జి.సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మాధవరం పీహెచ్‌సీకి తరలించారు.
ప్రథమ చికిత్స అనంతరం తాడేపల్లిగూడెంలోని ట్రినిటీ ఆస్పత్రికి పంపించారు. ట్రాక్టర్ డ్రైవర్ రామారావును సాయిసంజీవని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. ప్రమాద ఘటనతో మాధవరం, అప్పారావుపేట గ్రామాల్లో విషాదం నెలకొంది.
క్షతగాత్రులకు ఉప ముఖ్యమంత్రి పరామర్శ
ట్రినిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. మృతులు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున బీమా రూపేణా పరిహారం అందిస్తామని ప్రకటించారు.
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మహిళా కూలీల దుర్మరణం
Published Tue, Feb 7 2023 4:34 AM | Last Updated on Tue, Feb 7 2023 4:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment