నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
- మద్యం మత్తులో ఎల్‌సీ తీసుకోకుండా పనులు చేయించిన లైన్‌మేన్
- విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
- గాజులపల్లెలో ఘటన
గాజులపల్లె(మహానంది): ఓ లైన్‌మేన్ నిర్లక్ష్యం కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. ఫూటుగా మద్యం సేవించి కనీసం ఎల్‌సీ కూడా తీసుకోకుండా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పనులు చేయించాడు. ఫలితంగా విద్యుదాఘాతం సంభవించి పనులు చేస్తున్న వ్యక్తి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఈ ఘటన మహానంది మండలం గాజులపల్లెలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాహెర్ హుసేన్(37) చిన్న చిన్న విద్యుత్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో లైన్‌మేన్ గోపాల్ గాజులపల్లె ఫీడర్‌లోని గుండంపాడు రస్తాలో పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులకు పిలుచుకెళ్లాడు.
అప్పటికే ఫూటుగా మద్యం తాగిన లైన్‌మేన్ ఎల్‌సీ తీసుకోకున్నా తీసుకున్నట్లు చెప్పి పనులు చేయాలని సూచించాడు. తాహెర్‌హుసేన్ పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. తర్వాత విచారించగా ఎల్‌సీ తీసుకోలేదని ఆపరేటర్ విశ్వరూపాచారి ఆలియాస్ విశ్వం తేల్చిచెప్పాడు. హుశేన్ మృతదేహంపై పడి భార్య మల్లికాబీ, పిల్లలు, కుటుంబ సభ్యులు రోదించిన తీరు స్థానికులను కంటతడిపెట్టించింది.
సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన..
తాహేర్‌హుశేన్ మృతితో ఆగ్రహంతో ఊగిపోయిన బాధిత కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు వందలాదిగా గాజులపల్లె సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మహానంది ఎస్‌ఐ జి.పెద్దయ్యనాయుడు, గ్రామస్తులు మధుసూదన్‌రెడ్డి, కొండారెడ్డి తదితరులు అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. ఏఈ శ్రీనివాసులుతో ఫోన్లో మాట్లాడారు. బాధితుడికి న్యాయం చేయాలని, లైన్‌మెన్ గోపాల్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారంతో పాటు ఒక ఉద్యోగం కల్పించాలని మతపెద్ద, ఖాజీ అబ్దుల్‌మన్నన్‌తో పాటు ముస్లీం పెద్దలు కోరారు.
కేసు నమోదు..
తాహెర్‌హుసేన్ మృతికి కారకుడైన లైన్‌మేన్ గోపాల్‌పై 304ఏ సెక‌్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పెద్దయ్యనాయుడు తెలిపారు. ప్రస్తుతానికి గోపాల్ పరారీలో ఉన్నాడని చెప్పారు.