కొత్తిమీర కోసం వచ్చి..మృత్యు ఒడికి
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
పత్తికొండ రూరల్ : కొత్తిమీర తీసుకొద్దామని బయలుదేరిన వ్యక్తి మృత్యు ఒడికి చేరిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా..ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన కొత్తిమీర వ్యాపారి బోయ ఈరన్న(45) మంగళవారం ఉదయం పత్తికొండ నుంచి కొత్తిమీర తీసుకొద్దామని బయలుదేరాడు. దేవనకొండ మండలం గుండ్లకొండకు చెందిన కిరణ్‌కుమార్, అదే గ్రామానికి చెందిన పాండు, బడికెలింగన్న బైక్‌పై పత్తికొండకు బయలుదేరారు. చిన్నహుల్తి సమీపంలోని సూర్యాభారత్ గ్యాస్ గోడౌన్ వద్ద బోయ ఈరన్న కిరణ్‌కుమార్ బైకును ఓవర్‌టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో కిరణ్‌కుమార్ బైకు వెనకనుంచి ఈరన్న బైకును ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న బోయ ఈరన్న ఎగిరి బోర్లా పడడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
అలాగే కిరణ్‌కుమార్‌తోపాటు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. ఎస్‌ఐ మధుసూదన్‌రావు సిబ్బందితో అక్కడికి చేరుకుని ప్రమాదానికి కారణం తెలుసుకున్నారు. గాయపడిన వారిని ఆంబులెన్స్‌లో పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత వైద్యుల సలహా మేరకు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మృతుడికి భార్య లక్ష్మి మాత్రమే ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.