కుందుర్పి: ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... శెట్టూరు మండలం బొచ్చుపల్లికి చెందిన మల్లప్ప (46) తన మిత్రుడు తిప్పేస్వామితో కలిసి బుధవారం ద్విచక్రవాహనంలో బెస్తరపల్లి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద జరుగుతున్న వివాహానికి బయల్దేరాడు. బెస్తరపల్లి వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. మల్లప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన తిప్పేస్వామిని స్థానికులు కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. మృతుడు మల్లప్పకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎనిమిదేళ్లుగా భార్య దూరంగా ఉంటోంది. ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.