
ఘోర రోడ్డు ప్రమాదం
- రక్షణ కంచెను ఢీకొన్న బైక్
- బావ, బామ్మర్ది దుర్మరణం
- మరొకరి పరిస్థితి విషమం
చిలమత్తూరు (హిందూపురం) : చిలమత్తూరు మండలం శెట్టిపల్లి పంచాయతీ కమ్మయ్యగారిపల్లి క్రాస్ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బావ, బామ్మరిది దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, ఎస్‌ఐ జమాల్‌బాషా తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బత్తలపల్లికి చెందిన బాబావలి (23), అనుప్రియ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత పనిమీద బాబావలి భార్య అనుప్రియ, బామ్మరిది అభి (13)తో కలిసి హీరోహోండా బైక్‌పై బత్తలపల్లి నుంచి బెంగళూరుకు బయల్దేరాడు.
44వ నంబరు జాతీయరహదారిలోని కమ్మయ్యగారిపల్లి తండా క్రాస్‌లో మలుపు వద్ద బైక్ అదుపు తప్పి రక్షణ కంచెలా ఏర్పాటు చేసిన ఇనుప ప్లేట్లను ఢీకొంది. అభి ఇనుపప్లేట్ల మధ్యలోకి దూసుకెళ్లి అక్కడే ప్రాణం విడిచాడు. తీవ్రంగా గాయపడిన బాబావలి దంపతులను బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాబావలి మృతి చెందాడు. కాళ్లు విరిగి, చేతులు, తలకు బలమైన గాయాలు తగిలిన అనుప్రియ పరిస్థితి కూడా విషమంగా ఉందని ఎస్‌ఐ తెలిపారు.