
కళ్లెదుటే.. కన్నుమూశాడు!
- ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
- మరొకరికి తీవ్ర గాయాలు
పెద్దపప్పూరు : వేగంగా బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి గోతిలోకి ఎగిసిపడ్డారు. మొనలు తేలిన భారీ బండరాళ్లపై పడటంతో వారిద్దరికీ బలమైన గాయాలు తగిలాయి. ఈ ప్రమాదంలో అచేతనంగా కూర్చుండిపోయిన ఓ వ్యక్తిని చూసిన స్థానికులు నీళ్లు తాపారు. కాసేపు బండరాయికి ఆనుకుని సేద తీరుతున్నట్లు కనిపించిన ఆ వ్యక్తి అందరూ చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో ప్రాణం వదిలాడు. కళ్లముందే ప్రాణాలు పోతున్నా..‘అయ్యో’ అనడం తప్ప..అక్కడున్నవారు ఏమీ చేయలేకపోయారు.
మండల పరిధిలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలోని కనుమ వద్ద ద్విక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీహర్ష తెలిపిన వివరాల మేరకు కడప జిల్లా ఆర్‌ఎస్ కొండాపురం మండలం ఓబన్నపేట ఎల్లయ్య (50), కొర్రపాడుకు చెందిన రామాంజి వ్యక్తిగత పని నిమిత్తం అనంతపురానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో కనుమ వద్దకు రాగానే బైకు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందగా, రామాంజి తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడిన రామాంజిని 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఎల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ శ్రీహర్ష ఘటనాస్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు.