జేసీబీ కింద పడి యువకుడి మృతి
దుత్తలూరు : జేసీబీకి మరమ్మతులు చేస్తున్న ఓ యువకుడు అదే జేసీబీ కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం దుత్తలూరు సెంటర్ సమీపంలో జరిగింది. ఆత్మకూరు మండలం కరటంపాడుకు చెందిన హరీష్ (25) అనే యువకుడు నర్రవాడలో జేసీబీ ఆపరేటర్‌గా నాలుగు నెలల క్రితం చేరాడు. బుధవారం దుత్తలూరు–వింజమూరు మార్గంలోని మూతబడిన పెట్రోల్ బంక్ వద్ద జేసీబీని నిలిపి కిందవైపు మరమ్మతులు చేస్తున్నాడు. అయితే జేసీబీని ఆపరేట్ చేసే గేర్ లివర్లను లాక్ చేయడం మరిచాడు. మరమ్మతులు చేస్తుండగా అటుగా ఆడుకుంటున్న పిల్లలు పొరపాటున వాటిని తగలడంతో జేసీబీ ముందు భాగంలోని తొట్టెవంటి భాగంలో ఇరుక్కుపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం వింజమూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు ఆందలేదు.