విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి
-
మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయింపు
-
ఉద్రిక్తత పరిస్థితి
ఉదయగిరి : విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని దేకూరుపల్లిలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని దేకూరుపల్లికి చెందిన గోపిదేశి వెంకటరమణయ్య (30) ఉదయం ఎద్దులను మేత కోసం తోలుకోని గ్రామ సమీపంలో ఉన్న తమ పొలం వద్దకు వెళ్లాడు. పొలంలో పనిచేసుకుంటుండగా, ఎద్దులు పక్కనే ఉన్న పైరును మేస్తుండటంతో వాటిని తోలేందుకు పరుగెత్తుతుండగా అదే పొలంలో తాత్కాలిక కర్రల మీద ఏర్పాటు చేసిన విద్యుత్‌తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. గ్రామ ఎస్సీ కాలనీ సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి కిలో మీటరు దూరం వ్యవసాయ పొలాల్లో ఉండగా కర్రల ఆధారంగా సిద్దు నారాయణరెడ్డి, కారుమంచి రసూల్ తమ పొలాల వద్దకు ఏర్పాటు చేసుకున్నారు. ఈ వైర్లు మృతుడి పొలం వద్ద కర్రల మీద నుంచి కిందికి పడిపోయాయి. గమనించని వెంకట రమణయ్య షాక్ తగిలి మృతి చెందారు. నారాయణరెడ్డి, రసూల్ చర్యల వల్లే వెంకట రమణయ్య మృతి చెందాడని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు స్టేషన్ బయట బైఠాయించారు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటల సమయంలో మృతుడి బంధువులకు, ఈ ప్రమాదానికి కారకులుగా ఆరోపిస్తున్న వ్యక్తుల బంధువుల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. కొంతమంది పెద్దలు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వైద్యులు సంధానిబాషా పోస్టుమార్టం నిర్వహించారు.