విద్యుదాఘాతానికి యువకుడి మృతి
కోట : విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పుచ్చలపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు మెట్టు గ్రామం గిరిజన కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్ మణి (25) పుచ్చలపల్లి సమీపంలోని రావిగుంట చెరువు వద్ద జరుగుతున్న తూము నిర్మాణ పనులకు కూలీగా వెళ్లాడు. ట్రాక్టర్ ద్వారా బొంత రాళ్లను తరలిస్తుండగా వాటిని లెక్కించే పని మణికి అప్పగించారు. రాళ్లను అన్‌లోడ్ చేస్తుండగా అక్కడే తక్కువ ఎత్తులో ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు ట్రాక్టర్‌కు తగలడంతో ట్రక్కును పట్టుకుని ఉన్న మణి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ మాత్రం దూకేయడంతో ప్రాణాలు కాపాడుకోగలిగాడు. మణికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.