ట్రాక్టర్ కిందపడి యువకుడి దుర్మరణం
-
మరొకరికి తీవ్రగాయాలు
గూడూరు : ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను అధిగమించే క్రమంలో దాని కింద పడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదివారం పట్టణంలోని ముత్యాలపేట ప్రాంతంలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు రెండో పట్టణంలోని ఎస్‌ఆర్‌ఏ థియేటర్ ప్రాంతానికి చెందిన పందేటి మస్తాన్ (28), 1వ పట్టణంలోని రాణీపేట ప్రాంతానికి చెందిన ఏడుకొండలు మోటార్ బైక్‌పై టవర్‌క్లాక్ సెంటర్ నుంచి రైల్వేస్టేషన్ వైపు వెళ్తున్నాడు. ముందు వెళ్లే ట్రాక్టర్‌ను అధిగమించే క్రమంలో పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొని అదుపు తప్పి ట్రాక్టర్ చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న మస్తాన్ తీవ్రంగా గాయపడగా, మోటార్ బైక్ నడుపుతున్న ఏడుకొండలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మస్తాన్ మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ మాత్రం వెళ్లిపోయింది. మస్తాన్, ఏడుకొండలు ఇద్దరూ సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 1వ పట్టణ ఎస్సై సుధాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాకుదిక్కెవరు
మస్తాన్ రెక్కాడితే కానీ ఆ కుటుంబానికి పూడగడవని పరిస్థితి. రోడ్డు ప్రమాదంలో మస్తాన్ మృత్యువాత పడటంతో ఇక మాకు దిక్కెవరంటూ మృతుడి భార్య అపర్ణ తన ఇద్దరు కుమారులను పట్టుకుని బోరున విలపించింది. సెంట్రింగ్ పనులు చేస్తూ వచ్చే సంపాదనతో పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారని, మస్తాన్ పెద్ద కుమారుడు నిఖిల్‌కుమార్ 5వ తరగతి, భానుప్రసాద్ 3వ తరగతి వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో చదువుతున్నారు.