డివైడర్‌ను ఢీకొన్న బైక్
-
–అపాచి కార్మికుడి దుర్మరణం
-
మరొకరికి తీవ్రగాయాలు
సూళ్లూరుపేట : ప్రమాదవశాత్తు డివైడర్‌ను బైక్ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన చెన్నై–గుంటూరు ఏషియన్ హైవేపై సూళ్లూరుపేట సమీపంలోని మన్నారుపోలూరు మలుపురోడ్డు వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చిట్టమూరు మండలం జంగాలపల్లికి చెందిన పాలిచెర్ల లక్ష్మీనారాయణ (20), అతని సమీప బంధువు చిల్లకూరు మండలం నల్లయ్యగారి పాళెంకు చెందిన పీ శ్రీనివాసులు (24) ఆపాచి కంపెనీలో చేరి పట్టణంలోని కోళ్లమిట్టలో రూము తీసుకుని ఉంటున్నారు. టౌన్‌లో అద్దెలు ఎక్కువగా ఉన్నాయని, ఎక్కడైనా పల్లెటూరులో రూము తీసుకుంటే అద్దెలు తగ్గుతాయనే భావనతో ఇద్దరు కలిసి మోటార్‌బైక్‌పై చిత్తూరుజిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకం వెళ్లి రూము చూసుకుని తిరిగి వస్తుండగా డివైడర్‌ను కొట్టుకుని పక్కనే ఇనుప రైలింగ్‌కు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనివాసులు తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మృతుడి బంధువులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ఎస్సై జీ గంగాధర్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.