బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
సూళ్లూరుపేట : బైక్ అదుపు తప్పి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని శేషసాయి కల్యాణ మండపం సమీపంలో చెన్నై–కోల్‌కత్తా ఏషియన్ హైవేపై బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నాయుడుపేట మండలం అత్తలపాళెంకు చెందిన చిన్నస్వామి (45) వరదయ్యపాళెం మండలం సాధనవారిపాళెంలోని తన అక్క ఇంటికి మోటార్‌బైక్‌పై వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగి ఇంటికెళ్తూ శేషసాయి కల్యాణ మండపం వద్ద ఆటోను క్రాస్ చేస్తూ అదుపు తప్పి రోడ్డు మీద పడిపోయాడు. తలకు బలమైన గాయంకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ జీ గంగాధర్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.