
మంజుల(ఫైల్)
పంజగుట్ట: రోడ్డు ప్రమాదానికి గురైన ఓ గృహిణి తాను మరణిస్తూ అవయవాలు దానం చేసి మరో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపిది. నిమ్స్ జీవన్‌దాన్ ప్రతినిధులు తెలిపిన మేరకు.. నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన మంజుల (43) మంజుల ఈ నెల 27న నగరంలో ఉంటున్న తన సోదరుని ఇంటికి వచ్చింది. మలక్‌పేట యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువును చూసేందుకు సోదరునితో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా మలక్‌పేట గంజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
తీవ్రంగా గాయపడ్డ మంజులను మలక్‌పేట యశోదా ఆసుపత్రికి తరలించగా శుక్రవారం బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్ధారించారు. మంజుల భర్త యాదయ్య, కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన చేయడంతో వారు ఒప్పుకున్నారు. దీంతో మంజులకు శస్త్రచికిత్స నిర్వహించి కిడ్నీలు, కాలేయం, కళ్లు తొలగించి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో అవసరమైన వారికి అమర్చారు.