ఓఎన్‌జీసీ భద్రతా వారోత్సవాలు ప్రారంభం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) : భద్రత విషయంలో ఓఎన్‌జీసీ రాజీ లేకుండా పనిచేస్తోందని ఆ సంస్థ రాజమహేంద్రవరం ఎసెట్ మేనేజర్ దేబశీష్ సన్యాల్ పేర్కొన్నారు. 46వ జాతీయ భద్రతా వారోత్సవాలను ఆయన ఓఎన్‌జీసీ రాజమహేంద్రవరం బేస్ కాంప్లెక్స్‌లో సోమవారం ప్రారంభించారు. భద్రత నియమాలు ప్రాణాలను కాపాడతాయనే నినాదంతో జాతీయ భద్రతా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సన్యాల్ మాట్లాడుతూ ఆయిల్ , గ్యాస్ నిక్షేపాలను కనుగొనడం, వెలికితీసే పరిశ్రమ హైరిస్క్‌తో కూడుకుందన్నారు. అయినప్పటికీ భద్రతా నియమాలను నిబద్ధతతో పాటిస్తున్నందునే ఓఎన్‌జీసీలో ప్రమాదాల సంఖ్య తక్కువన్నారు. ఓఎన్‌జీసీ ఎంతో అనుభవజ్ఞులైన మానవ వనరులను కలిగి అత్యంత సమగ్రమైన మౌలిక సదుపాయాలతో కూడి తమ ఆపరేషన్లలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగలుగుతుందన్నారు. ఉద్యోగుల భద్రతే మొదటి ప్రాముఖ్యతగా పరిగణించే సంస్థగా ఓఎన్‌జీసీ నిరంతరం తన వద్ద పనిచేసే ఉద్యోగులకు భద్రతా సంబంధిత విషయాలలో శిక్షణ ఇస్తోందన్నారు. దేబశీష్ సన్యాల్ నేతృత్వంలో సంస్థ ఉద్యోగులందరూ తమ కుటుంబ, తమ చుట్టూ ఉన్న సొసైటీ, సంస్థే కాకుండా జాతీయ అవసరాల దృష్ట్యా ప్రమాదాలను నివారించడంతో పాటు వ్యాధులు రాకుండా , పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఏడాది థీమ్‌ను దృష్టిలో ఉంచుకుని భద్రతపై ఉద్యోగులు, సాధారణ ప్రజలతో పాటు స్కూలు పిల్లల్లో కూడా అవగాహన కలిగించడానికి వారం పాటూ సాగే పలు కార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తోందన్నారు. ఈ నెల పదో తేదీ వరకు వారోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు.