రోడ్డెక్కిన ఉల్లి రైతు
రోడ్డెక్కిన ఉల్లి రైతు
Published Sat, Aug 27 2016 9:50 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
– ధరలు పడిపోవడంతో ఆందోళన
– ఉల్లిని రోడ్డుపై పోసి ధర్నా
– వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్‌రెడ్డి మద్దతు
కర్నూలు(అగ్రికల్చర్): అసలే పడిపోయిన ఉల్లి ధరలు.. ఆపై మార్కెట్‌యార్డులోని వేలంపాటల్లో వ్యాపారుల ఆగడాలు వెరసి రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మూకుమ్మడిగా రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు ఎదుట రోడ్డుపై ఉల్లి పంటను పోసి తొక్కుతూ నిరసన తెలిపారు. మార్కెట్ కమిటీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు పురుగు మందు డబ్బాలు బయటకు తీయగా పోలీసులు అడ్డుకున్నారు. మార్కెట్ యార్డులో వ్యాపారులు వేలం పాటలను రూ. 100 నుంచి ప్రారంభించి రూ. 150 ముగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉల్లికి కనీస మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మార్కెట్‌యార్డులో వేలం పాటలను రూ.500 నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు భరత్‌కుమార్‌రెడ్డి రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. మరోవైపు రైతుల ధర్నా కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. ఇరువైపులా వందలాదిగా వాహనాలు ఆగిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకుని సర్ధిచెప్పారు. అయినా ఫలితం లేకపోవడంతో విషయాన్ని మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్, సెక్రెటరీ దష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు చైర్‌పర్సన్ శమంతకమణి, కార్యదర్శి నారాయణమూర్తి, వైస్ చైర్మన్ దేవేంద్రరెడ్డి అక్కడకు చేరుకుని రైతులతో చర్చించారు. ఉల్లిని గ్రేడింగ్ చేసుకువస్తే మంచి ధర లభిస్తుందంటూ సర్ధి చెప్పారు. వేలంపాటలను రూ.300 ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు.
మళ్లీ మొదటికే...
మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన హామీ అమలు కాలేదు. ధర్నా అనంతరం వ్యాపారులు మళ్లీ రూ.100 నుంచే వేలంపాటలు ప్రారంభించి రూ.150, రూ.180కే ముగింపు పలుకుతుండటంతో మరోసారి రైతులు ఆగ్రహించారు. వేలంపాటలను అడ్డుకున్నారు. మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కార్యదర్శి తదితరులు వెళ్లి రూ.300 నుంచి వేలంపాట నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు.
రైతులపై దౌర్జన్యం...
ఉల్లి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని, నష్టాన్ని అధికారుల దష్టికి తీసుకెళ్లేందుకు వచ్చిన రైతులపై మార్కెట్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారు. మొదటి అంతస్తులో ఉన్న కమిటీ కార్యాలయంలోకి వెళ్తున్న పోలకల్ గ్రామానికి చెందిన రాజు, మరికొందరు రైతులను అడ్డుకుని దౌర్జన్యం చేశారు.
ప్రభుత్వ దష్టికి తీసుకెళ్లా..
కర్నూలు మార్కెట్‌లో ఉల్లి ధరలు, రైతుల పరిస్థితిని ప్రభుత్వ దష్టికి తీసుకెళ్లినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శమంతకమణి తెలిపారు. ముఖ్యమంత్రితో సహా వ్యవసాయ పౌర సరఫరాల శాఖ మంత్రులు, జిల్లాకలెక్టర్, జేసీల దష్టికి తీసుకెళ్లి ఉల్లి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరామని వివరించారు.
సర్కారు హామీ ఏమైంది..
గత ఏడాది ఇదే నెలలో క్వింటాలు ఉల్లి ధర రూ.4 వేలకు పైగా ఉంది. ధరలు పెరిగి వినియోగదారులు ఆందోళన చెందుతుండటంతో ప్రభుత్వం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోలు చేసి రాష్ట్రంలోని 13 జిల్లాలకు సరఫరా చేసి కిలో రూ.20 ప్రకారం పంపిణీ చేసింది. ఆ సమయంలో ఉల్లి కొనుగోళ్ల పరిశీలకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. ధర పడిపోయిన సందర్భాల్లో కనీస మద్దతు ధర ప్రకారం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సరిగ్గా ఏడాది గడిచిందో లేదో పరిస్థితి తారుమారైంది. హామీలు నీటిమూటలయ్యాయి.
Advertisement
Advertisement