ఫ్యాన్సీ నంబర్‌కు ఆన్‌లైన్‌ బ్రేక్‌ | online brake on fancy nubers | Sakshi
Sakshi News home page

ఫ్యాన్సీ నంబర్‌కు ఆన్‌లైన్‌ బ్రేక్‌

Published Sun, Feb 12 2017 1:58 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

online brake on fancy nubers

తణుకు : కొత్త వాహనం కొనుగోలు చేసినవారు గుర్తింపునిచ్చే (ఫ్యాన్సీ) నంబర్‌కు ప్రాధాన్యమిస్తుంటారు. కొందరు తమకు ఇష్టమైన నంబర్‌ కోసం ఎంతైనా వెచ్చిస్తుంటారు. దీనిద్వారా కోట్లాది రూపాయల ఆదాయం రవాణా శాఖకు సమకూరుతోంది. అయితే జిల్లాలో ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ ప్రక్రియ కారణంగా ఫ్యాన్సీ నంబర్లకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ ప్రక్రియలో భాగంగా కొత్త సాఫ్ట్‌వేర్‌ రూపొందించడంలో జరుగుతున్న జాప్యంతో నంబర్ల కేటాయింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రవాణాశాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం సాధారణ నంబర్లను సీరియల్‌ ప్రకారం కేటాయిస్తున్నారు.
 
జిల్లాలో కొత్త సిరీస్‌లు
జిల్లాలో ఏలూరులోని ఉపరవాణాశాఖ కార్యాలయంతోపాటు భీమవరంలోని ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయాలకు అనుసంధానంగా తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు పట్టణాల్లో రవాణాశాఖ యూనిట్‌ కార్యాలయాలు నడుస్తున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ ప్రక్రియతో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు నిలిపివేశారు. ప్రస్తుతం వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌ల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో ప్రతి కార్యాలయానికి కొత్త సిరీస్‌ను కేటాయించారు. ఆన్‌లైన్‌లో కొనసాగుతున్న సిరీస్‌కు అనుబంధంగా ఆఫ్‌లైన్‌లో కొత్తగా సిరీస్‌ను కేటాయించారు. దీనిలో భాగంగా ఏలూరుకు 37/డీఈ, భీమవరం 37/సీయూ, తణుకు 37/సీఎస్, కొవ్వూరు 37/సీఆర్, తాడేపల్లిగూడెం 37/సీక్యూ, జంగారెడ్డిగూడెం 37/సీవీ సిరీస్‌లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ సిరీస్‌ల నంబర్ల కేటాయిస్తున్నారు. పాత సిరీస్‌లో ఆన్‌లైన్‌ ద్వారా జరుగుతున్న ప్రక్రియలో ప్రభుత్వం నిర్దేశించిన ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు నిలిచిపోయింది. పది నెలలుగా ఫ్యాన్సీ నంబర్ల కొరత ఏర్పడింది.  
 
‘ఈ–బయ్‌’ ఎక్కడ..?
ఆన్‌లైన్‌ ప్రక్రియలో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపునకు వీలుగా ‘ఈ–బయ్‌’ విధానం ప్రవేశపెట్టడానికి రవాణాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అయితే నంబర్‌ దక్కించుకునేందుకు వేలంలో పాల్గొనే వారంతా బ్యాంకింగ్‌ లేదా డెబిట్, క్రెడిట్‌ కార్డులతో లావాదేవీలు నిర్వహించాలి. వేలంలో నంబర్‌ దక్కని వారికి తిరిగి చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. తిరిగి చెల్లింపుల విషయంలో స్పష్టత రాకపోవడంతో ‘ఈ–బయ్‌’ విధానానికి బ్రేకులు పడ్డాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రవాణా శాఖకు ఏటా రూ.కోట్లు మేర ఆదాయం సమకూరుతుంది. ఒక్కో సిరీస్‌లో 0001 నుంచి 9999 వరకు నంబర్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో సిరీస్‌లో ఫ్యాన్సీ నంబర్ల ద్వారా సుమారు రూ.కోటి వరకు ఆదాయం వస్తున్నట్టు అంచనా. ఫ్యాన్సీ నంబర్‌కు కనీసం రూ.5 వేలు నుంచి గరిష్టంగా రూ.50 వేల వరకు ధర నిర్ణయించారు. కొన్ని నంబర్లను వేలంలో లక్షలు వెచ్చించి వాహనదారులు సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానంతో కరెంట్‌ రిజర్వేషన్‌ కూడా నిలిచిపోయింది
 
త్వరలో ఇబ్బందులు తొలగిస్తాం
ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ ప్రక్రియలో భాగంగా ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు నిలిచిపోయింది. ఆన్‌లైన్‌లో ఫ్యాన్సీ నంబర్ల కోసం బిడ్‌లు ఆహ్వానించి నంబర్లు కేటాయించాల్సి ఉంది. తిరిగి చెల్లింపుల విషయంలో స్పష్టత రాలేదు. త్వరలోనే ఇబ్బందులన్నీ తొలగించి ఫ్యాన్సీ నంబర్లు కేటాయింపునకు చర్యలు తీసుకుంటాం.
– ఎస్‌.సత్యనారాయణమూర్తి, డీటీసీ, ఏలూరు 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement