కదిలిస్తే కన్నీళ్లే! | only tears | Sakshi
Sakshi News home page

కదిలిస్తే కన్నీళ్లే!

Published Wed, May 10 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

కదిలిస్తే కన్నీళ్లే!

కదిలిస్తే కన్నీళ్లే!

కాటేస్తున్న కరువు రక్కసి
- నీటి సమస్యతో ఉక్కిరిబిక్కిరి
- ఉపాధి పనుల్లేక కూలీల వలసబాట
- పశుగ్రాసం కొరతతో సంతకాలకు పశువులు
- కనికరించని ప్రభుత్వం
 
- 2015-16 సంవత్సరానికి సంబంధించి పంటల బీమా పరిహారం అతీగతీ లేకుండా పోయింది.
- 2014 కరువుకు సంబంధించి ఐదు మండలాలకు రూ.73కోట్ల పరిహారం పెండింగ్‌లో ఉంది.
- 2015 కరువుకు సంబంధించి ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీకి రూ.46 కోట్లు తక్కువ పడ్డాయి. ఫలితంగా 50వేల మంది రైతులు పరిహారానికి దూరమయ్యారు.
- 2016-17లోనూ కరువు ప్రభావం తీవ్రంగా ఉంది.
 
పంటల్లేవు.. అప్పుల భారం
నాకు 5.50 ఎకరాల భూమి ఉంది. మూడు ఎకరాల్లో బోరు వేయించా. కేవలం అర ఇంచు మాత్రమే నీళ్లు పడ్డాయి. దీని కింద టమాట వేసిన. నీళ్లు సరిపోక ఎండిపోయింది. దాదాపు రూ.75 వేలు పెట్టిబడి పెట్టి వేరుశనగ సాగు చేసిన. 16 బస్తాలు వచ్చింది. పెట్టుబడిలో రూ.32వేలు మాత్రమే వచ్చింది. పశుగ్రాసం కొరత, నీటి సమస్యకు తట్టుకోలేక ఉన్న పశువులను అమ్మేసుకున్న. ప్రభుత్వం కరువు రైతును ఆదుకోకపోవడం దారుణం.
- బంగారు రంగన్న, తుగ్గలి
 
కర్నూలు(అగ్రికల్చర్‌): కరువు రక్కసి రైతన్నను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉపాధి లేకపోవడం.. తాగునీటి సమస్య.. పశుగ్రాసం కొరత.. ప్రభుత్వ చేయూత లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏప్రిల్‌ నెలలోనే ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 7.50 లక్షల మందికి జాబ్‌కార్డులు పంపిణీ చేయగా.. 5లక్షల మంది ఉపాధి వేటలో ఉన్నారు. ఇందులో 1.50 లక్షల మందికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పనులు కల్పిస్తుండగా.. మిగిలిన వారిలో అధిక శాతం వలసబాట పట్టారు. దాదాపు లక్ష మంది ఉపాధి పనుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కరువులోనూ టీడీపీ నేతలు రాజకీయం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. తాము సూచించిన గ్రూపులకే పనులు కల్పించాలని ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. డోన్‌, పత్తికొండ, ఆదోని నియోజకవర్గాల్లో ఈ తరహా రాజకీయం సాగుతోంది.
 
సాధారణ వర్షపాతం 609.7 మి.మీ.. కురిసింది 540.4 మి.మీ.,
2016 జనవరి నెల నుండి 2017 మార్చి నెల వరకు జిల్లా సాధారణ వర్షాతం 605.7 మిల్లీమీటర్లుగా ఉంది. ఈ ప్రకారం వర్షాలు కురిస్తే కరువు జాడ ఉండదు. అయితే 540.4 మి.మీ., వర్షపాతం నమోదయింది. గత ఏడాది జూన్, జులై, సెప్టెంబర్‌ నెలల్లో మినహా మిగిలిన అన్ని నెలల్లో వర్షపాతం తక్కువగానే ఉంది. వర్షాలు లేకపోవడం వల్ల జిల్లాలో చెరువులు, కుంటలు, వాగుల్లో చుక్కనీరు లేదు. దీంతో భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. ప్యాపిలి, బేతంచెర్ల, కృష్ణగిరి, దేవరకొండ, సి.బెళగల్, గూడూరు మండలాల్లో 65 మీటర్లకు పైగా అడుగుకు భూగర్భ జలాలు చేరాయి.
 
కంటతడి పెట్టిస్తున్న నీటి సమస్య
జిల్లా ప్రజలు నీటి సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రేయింబవళ్లు తిరిగినా నీళ్లు దొరకని పరిస్థితి. జిల్లాలో 914 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఇందులో సగం గ్రామాల్లో 10 రోజులకు  ఒక్కరోజు మాత్రమే పంచాయతీల ద్వారా నీరు ఇస్తున్నారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. అనేక గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. పశుపోషణ రైతులకు భారంగా మారింది. జిల్లాలో 9 పశువుల సంతలు ఉండగా, జనవరి నెల నుంచి ఇప్పటి వరకు 66 వేల పశువులు, 2.50 లక్షల గొర్రెలను విక్రయించడం కరువు తీవ్రతకు అద్దం పడుతోంది.
 
నీటి తొట్లలో నీరు కరువు
అన్ని గ్రామ పంచాయతీల్లో పశువుల సంఖ్యను బట్టి ఒకటి.. అంత కంటే ఎక్కువ నీటి తొట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. నీటి తొట్లకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా నిధులు ఇస్తారు. మూడు నెలలుగా హడావుడి చేస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన నీటి తొట్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇదివరకే 700 గ్రామాల్లో నీటి తొట్లు ఉండగా, వీటిలో నీటిని నింపే వారు కరువయ్యారు. ప్రధానంగా కర్నూలు, ఆదోని  రెవెన్యూ డివిజన్‌లలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. జూన్‌ నెల వరకు జిల్లాలో 35వేల టన్నుల పశుగ్రాసం కొరత ఉన్నట్లు నిర్ధారించారు. ఈ కొరతను అధిగమించేందుకు సైలేజి గడ్డి పంపిణీ, మొలకగడ్డి పెంపకం, అజోల్ల యూనిట్ల ఏర్పాటు, బావులు, బోర్లు ఉన్న రైతులకు గడ్డి పెంపకానికి 75శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాల పంపిణీ  తదితర కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది.
 
పడిపోయిన దిగుబడులు
గత ఏడాది ఖరీఫ్‌లో సాధారణ సాగు 6,20,763 హెక్టార్లు ఉండగా.. 6,56,214 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. రబీలో సాధారణ సాగు 3,54,341 హెక్టార్లు ఉండగా.. 3,13,219 హెక్టార్లు సాగు అయింది.  ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో ఉత్పాదకత 22,35,214 టన్నులు సాధించాలనేది లక్ష్యం కాగా 19,52,724 టన్నులు సాధించారు. పెట్టుబడులు దక్కక నష్టపోయిన రైతులు లక్షల్లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement