బహిరంగ మలవిసర్జన సాంఘిక దురాచారం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) :
బహిరంగ మలవిసర్జన సాంఘిక దురాచారమని జేసీ–2 ఆర్.సాల్మన్‌రాజ్‌కుమార్ పేర్కొన్నారు. బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కృష్ణ పుష్కరాలను పురస్కరించుకుని స్థానిక పాత జెడ్పీ సమావేశ మందిరంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ ఆత్మగౌరవం అంశాలపై చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ–2 మాట్లాడుతూ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను చేపట్టారన్నారు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో 68 శాతం బహిరంగ మలవిసర్జనకు అలవాటు పడ్డారన్నారు. దీన్ని నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు మరుగుదొడ్లపై అవగాహన కల్పించాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. తొలుత ఆత్మగౌరవం కళాజాత బృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధశాఖల అధికారులు, స్వచ్ఛందసేవాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.