తరలింపు వద్దు! | Opposition expresses the proposal to build the collectorate at Bhimanagugattu. | Sakshi
Sakshi News home page

తరలింపు వద్దు!

Published Tue, Jun 6 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

తరలింపు వద్దు!

తరలింపు వద్దు!

కలెక్టరేట్‌ను ప్రస్తుతమున్న చోటే ఉంచాలని డిమాండ్‌
చర్చనీయాంశంగా మారిన సమీకృత కార్యాలయాల ఏర్పాటు
భీమన్నగుట్ట ప్రాంతంలో నిర్మాణానికి అధికారుల ప్రతిపాదనలు
జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరం కావడంతో వ్యతిరేకత
పునరాలోచించాలని సీఎంకు నివేదించిన నిర్మల్‌ జిల్లా సాధన సమితి

నిర్మల్‌అర్బన్‌: ప్రస్తుతం నిర్మల్‌ నడిబొడ్డున కొనసాగుతున్న కలెక్టరేట్‌ను జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో భీమన్నగుట్ట వద్దకు తరలించి, అక్కడ నిర్మించాలనే ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లా మంత్రి, అధికారుల నోట సమీకృత కార్యాలయాల కోసం భీమన్న గుట్ట ప్రాంతాన్ని ఎంపిక చేశామని, త్వరలోనే పనులకు టెండర్‌లు పూర్తి చేస్తామని చెప్పడంతో ప్రస్తుతం ఇది హాట్‌ టాపిక్‌గా మారింది.

ప్రభుత్వ ఆలోచన ఇలా...
పరిపాలన సౌలభ్యం కోసం సీఎం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని, పాలన సౌలభ్యం ఏర్పడుతుందని సమీకృత భవనాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒకే చోట 25 ఎకరాల స్థలం అందుబాటులో ఉండేలా చూడాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని నూతన జిల్లాల్లో ఈ దిశగా చర్యలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న నిర్మల్‌లో భీమన్న గుట్ట ప్రాంతంలో జిల్లా సమీకృత కార్యాలయాల నిర్మాణానికి అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. అయితే దీనిని కొందరు వ్యతిరేకిస్తుండగా, అధికారులు, మరికొందరు సమర్థిస్తున్నారు.

సమీకృత కార్యాలయాలే నిర్మల్‌ ప్రత్యేకత
ప్రభుత్వ కార్యాలయాల విషయంలో నిర్మల్‌కు ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చాలా కాలం నుంచే ఒకే ప్రాంతంలో అనేక కార్యాలయాలున్నాయి. సీఎం నోట సమీకృత మాట రావడంకంటే ముందు నుంచే ఇక్కడ సమీకృత కార్యాలయాలు కొనసాగుతున్నాయి. పట్టణం నడిబొడ్డున పాత ఆర్డీవో(ప్రస్తుతం కలెక్టరేట్‌), మున్సిపల్, తహసీల్దార్, న్యాయస్థానం, ఆర్‌అండ్‌బీ అథితి గృహం, ఆర్‌అండ్‌బీ కార్యాలయం, నీటిపారుదల శాఖ, అటవీ శాఖ, అగ్నిమాపక, పశుసంవర్థక శాఖ, ప్రసూతి ఆస్పత్రి, ఉపకారాగారం, వ్యవసాయ శాఖ, బాలుర బీసీ వసతి గృహం, బాలికల వసతి గృహం, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఇరిగేషన్, డీఎస్పీ, రూరల్‌ పోలీస్‌స్టేషన్, ఎంపీడీవో కార్యాలయం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పాత భవనం, తదితర కార్యాలయాలతో పాటు ఎన్టీఆర్‌ మిని స్టేడియం అన్నీ ఒకదాని పక్కనే మరోటి ఉన్నాయి.


అంటే సీఎం చెప్పిన సమీకృత సముదాయానికి దగ్గరిగానే ఉన్నాయి. దీంతో ప్రజలకు కార్యాలయాలు అన్ని అందుబాటులో ఉండేవి. దూర భారం లేకుండా సుదూరం నుంచి నిర్మల్‌కు వచ్చిన ప్రజలు సులువుగా అన్ని కార్యాలకు వెళ్లి పనులు పూర్తి చేసుకునేవారు. ఈ ప్రాంతంలో సమీకృత జిల్లా కార్యాలయాల ఏర్పాటు చేస్తే ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేది. అయితే దీనిని విస్మరించి నిర్మల్‌ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లన్న గుట్టను ఎంపిక చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత కలెక్టరేట్‌ కార్యాలయ చుట్టుపక్కనే ఉన్న ఈ ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన భూ విస్తీర్ణం సుమారు 65 ఎకరాలకు పైనే ఉంటుంది. ఇందులో శిథిల భవనాలు, ఖాళీ స్థలాలు, జిల్లా స్థాయి కార్యాలయాలున్నాయి. వీటితో పాటు చాలా ప్రాంతం కబ్జాకు గురయింది.

పాలకుల నోట.. భీమన్న గుట్ట మాట.. ఎవరి కోసం..?
జిల్లా సమీకృత కార్యాలయాల ఏర్పాటుకు 25 ఎకరాలు ఉండాలని ప్రభుత్వం సూచించింది. దీనిని ఆధారం చేసుకుని అధికారులు స్థల పరిశీలన చేపట్టారు. అయితే 25 ఎకరాల స్థలం జిల్లా కేంద్రంలో ఎక్కడా లేదని అధికారులు, పాలకులు చెబుతున్నారు. నడిబొడ్డున ప్రస్తుత కలెక్టరేట్‌ చుట్టూ సుమారు 65 ఎకరాల స్థలం ఉందన్న భావనను వ్యక్తం చేసినప్పటికీ దానిని పట్టించుకోకుండా జిల్లా కేంద్రం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమన్న గుట్టను ఎంపిక చేయడం విమర్శలకు తావిస్తోంది.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి సౌలభ్యంగా ఉండాల్సిన కార్యాలయాలను దూరం చేయడం వెనుక ఎవరికి ప్రయోజనం కలుగుతుందని ప్రశ్నిస్తున్నారు. కేవలం భీమన్న గుట్ట చుట్టూ వెలసిన రియల్‌ ఎస్టేట్‌ భూములున్న వారికి తప్ప ప్రజలకు ఒనగూరేదేమీ లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారుల పక్కనే ప్రజలకు అందుబాటులో ఉన్న స్థలాన్ని విస్మరించడంతో కొందరికి మాత్రమే ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలోని 7 లక్షల మందికి జిల్లా కార్యాలయాల పాలన దూరం చేయడం వెనుక ‘మతలబు’ ఏమిటన్నది..? ఎవరి కోసమన్నది..? ప్రస్తుతం అందరి నోటి నుంచి వెలువడుతున్న ప్రశ్న.

అభివృద్ధి పేరిట చారిత్రక స్థలాల ధ్వంసం
ప్రభుత్వ స్థలాలను రక్షించాల్సిన అధికారులు దానిని విస్మరించి అభివృద్ధి పనుల కోసం చారిత్రక స్థలాలను ధ్వంసం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అభివృద్ధి పనులు చేపడుతున్నామంటూ చెరువులు, కోటలు, గుట్టలు, కందకాలను చెరపుతున్నారు. ఏరియా ఆస్పత్రి నిర్మాణ సమయంలో పక్కన ఉన్న కోటలను ధ్వంసం చేశారు. అలాగే పద్మనాయక రాజుల కాలం నాటి లేడిస్‌ పార్కును ధ్వంసం చేసి ఇందిరమ్మ కాంప్లెక్స్‌ నిర్మించారు.

రోడ్డు విస్తరణ పేరిట నిర్మల్‌కు ముఖ ద్వారంగా ఉన్న గొలుసుల దర్వాజాలను నామరూపాల్లేకుండా చేశారు. ఇలా అభివృద్ధి పేరిట అనేక చారిత్రక స్థలాలను ధ్వంసం చేయడం ఒక వంతు అయితే ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం మరోవంతుగా మారింది. వందల ఎకరాల ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతుంటే వాటిని కాపాడాల్సింది పోయి అధికారులే ధారాదత్తం చేయడం, అభివృద్ధి కార్యక్రమాలకు స్థలాలు లేకుండా చేయడం పథకంలో భాగమేనన్న వాదన కూడా లేకపోలేదు. అన్యాక్రాంతం అయిన స్థలాలను గుర్తిస్తే భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడే అవకాశం ఉండేది. కానీ ఆ దిశగా అధికారులు చొరవ తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు.

తప్పని ఆర్థిక భారం..
నిర్మల్‌ నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమన్న గుట్ట ప్రాంతంలో కలెక్టరేట్‌తో పాటు అన్ని జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయనుండటంతో ప్రజలపై ఆర్థిక భారం పడనుందని మేధావులు పేర్కొంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావడం ఒక ఎత్తు అయితే, ఇక్కడి నుంచి అన్ని జిల్లా కార్యాలయాలకు వెళ్లడం మరో ఎత్తు కానుంది. జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేకంగా జిల్లా కార్యాలయాలకు వెళ్లి రావాలన్నా కనీసం రూ.100 వరకు ఖర్చు భరించాల్సి ఉంటుంది. ప్రజల మనోభీష్టాలతో సంబంధం లేకుండా, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరపకుండానే సమీకృత కార్యాలయాల ఏర్పాటుకు స్థల సేకరణలో అధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం చొరవ తీసుకోవాలని కోరాం..
సమీకృత జిల్లా కార్యాలయాల ఏర్పాటు విషయంలో స్థానిక అధికారులు, నాయకులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్నందున స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కోరాం. పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రస్తుత కార్యాలయాల స్థలంలో సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని నిర్మించాలని ఇటీవలే విన్నవించాం.
– నంగె శ్రీనివాస్, నిర్మల్‌ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement