
గండం గడిచింది!
⇒సింగపూర్ కంపెనీతో ఒప్పందంపై రైతుల వ్యతిరేకత
⇒ లింగాయపాలెంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన
⇒మూడు గ్రామాల్లో కట్టుదిట్టమైన నిఘా
⇒ స్టార్టప్ ఏరియా శంకుస్థానకు సామాన్య రైతులు దూరం
⇒ హాజరైన వారంతా టీడీపీ కార్యకర్తలు, అనుకూలురే..
⇒ టెన్షన్ టెన్షన్‌గా అధికార యంత్రాంగం
⇒వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నేతలకు పలుమార్లు ఫోన్లు
అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్ : ‘అమరావతి నగరాన్ని అద్భుతంగా నిర్మించాలని నన్ను దేవుడు ఆదేశించాడు...’ అని ఓ వైపు సీఎం చంద్రబాబు సభా వేదికపై చెబుతుండగానే... మరోవైపు పోలీసు అధికారులు మాత్రం ఎటువైపు నుంచి ఎవరు వచ్చి ఆందోళనలు చేస్తారోనని మండుటెండలో వణికిపోయారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమం వద్ద ఏ చిన్న గొడవ జరిగినా సింగపూర్ పెద్దల ముందు సిగ్గుపోతుందని భయపడిన ప్రభుత్వ పెద్దలు... చివరకు ‘హమ్మయ్యా... గండం గడిచింది.. గట్టెక్కాం..’ అని ఊపిరి పీల్చుకున్నారు.
తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం పరిధిలో 1,691 ఎకరాల విస్తీర్ణాన్ని ప్రభుత్వం స్టార్టప్ ఏరియాగా గుర్తించిన విషయం తెలిసిందే. ఇందులో 396 ఎకరాలను రైతులు ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వడానికి నిరాకరించారు. అయితే ఈ భూములను కూడా ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకు అప్పగించేందుకు సిద్ధమైంది. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా తాళ్లాయపాలెం సమీపంలో భూమి పూజ కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేశారు.
అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన
ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని భూములను సింగపూర్ కంపెనీకి అప్పగిస్తూ నిర్వహించే కార్యక్రమాన్ని స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అందులో భాగంగా ఉదయం లింగాయపాలెంలో నిరసన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. కొందరు రైతులు ఏకమై నేరుగా అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం షాక్‌కు గురైంది. వెంటనే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు పోలీసులు, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ అధికారులను గ్రామాల్లోకి పంపారు.
రైతుల నివాసాల చుట్టూ పోలీసులు
సింగపూర్ ప్రభుత్వానికి చెందిన మంత్రి, మరికొందరు ప్రతినిధుల బృందం వస్తున్నందున రైతులు నిరసనలు వ్యక్తం చేస్తే ఇన్నాళ్లు తాము చేసిన ప్రయత్నాలకు ప్రయోజనం ఉండదని టీడీపీ పెద్దలు భావించారు. రాజధాని ప్రకటించిన మొదలు ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు... ఆందోళన చేసిన వారిని గుర్తించి నిఘా పెట్టారు. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ అధికారులు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి అనుమానం ఉన్న వారికి ఫోన్లు చేయడం, వారి నివాసాలకు వెళ్లి అభిప్రాయాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తల నివాసాల వద్ద నిఘా పెట్టారు. తాళ్లాయపాలెం సమీపంలో ఏర్పాటు చేసిన శంకుస్థాన కార్యక్రమం వద్ద కూడా భారీ ఎత్తున పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ప్రాంగణం చుట్టూ పోలీసులు, ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఎవరైనా నిరసన తెలియజేస్తే వారిని తరలించేందుకు ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశారు.
సామాన్య రైతులు దూరం...
స్టార్టప్ ఏరియా అభివృద్ధి శంకుస్థాపనకు కేవలం రాజధాని రైతులతో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వ యంత్రాంగం భావించింది. అయితే ఈ కార్యక్రమానికి సామాన్య రైతులు రావడానికి ఇష్టపడలేదు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డారు. కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే ఆహ్వానించారు. అందుకు ప్రత్యేకంగా పాసులు ముద్రించారు. ఆ పాసులు ఉన్న వారిని మాత్రమే పోలీసులు సభా ప్రాంగంణంలోకి అనుమతించడం కనిపించింది. స్థానిక రైతులు పెద్దగా రాకపోవడంతో తాడికొండ, అవనిగడ్డ నియోజకవర్గాల నుంచి టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను బస్సుల్లో తరలించారు. ఎటువంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా కార్యక్రమం ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకోవడం గమనార్హం.
సన్మానానికి సైతం రైతులు దూరం
స్టార్టప్ ఏరియాకు భూములు ఇచ్చిన రైతుల్లో కొందరు సింగపూర్ కంపెనీ ప్రతినిధులను సన్మానిస్తామని ప్రకటించారు. అయితే చివరికి వారు కూడా రాకపోవడంతో టీడీపీ నాయకులను రైతులుగా చూపించి సింగపూర్ కంపెనీ ప్రతినిధులను సన్మానింపజేశారు. వారిలో టీడీపీ తుళ్లూరు మండల అధ్యక్షుడు, తాడికొండ మార్కెట్ కమిటీ చైర్మన్, లింగాయపాలెం సర్పంచ్, టీడీపీ రైతు విభాగం నాయకులు ఉన్నారు.