Opposition to farmers
-
24 గంటలా? 9 గంటలా?
‘సార్.. కొత్తగూడెం సబ్ స్టేషన్ నుంచి లక్ష్మీపురం ఫీడర్‌కు విద్యుత్ సరఫరా చేసే లైన్లను గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజులుగా బ్రేక్‌డౌన్ అయ్యేలా చేస్తున్నారు. రోజూ సాయంత్రం బ్రేక్‌డౌన్ అవుతున్నట్లు లైన్‌మన్ తెలిపారు. వెళ్లి చూడగా 24 గంటల కరెంట్ వల్ల మూడు రోజులుగా బోర్లలో నీరు ఊరడం లేదని.. పాత కండక్టర్ ముక్కను పోల్‌కు తగిలేట్టుగా లైన్ మీద వేసి బ్రేక్‌డౌన్ అయ్యేలా చేస్తున్నారు’ – విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు వాట్సాప్‌లో మిర్యాలగూడ రూరల్ ఏఈ ఇటీవల పంపిన సందేశమిది. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. క్షేత్రస్థాయిలో రైతాంగం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో 24 గంటల సరఫరా కొనసాగింపుపై పునఃసమీక్షించేందుకు సిద్ధమైంది. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సర్వే నిర్వహించనున్నాయి. 24 గంటల విద్యుత్ కొనసాగించాలా, లేక గతంలో మాదిరి పగటి పూటే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తే సరిపోతుందా అనే అంశంపై రైతుల అభిప్రాయాన్ని తీసుకోనున్నాయి. 24 గంటల సరఫరాతో సమస్యలు ఎదురవుతున్నాయా అనే అంశంపైనా రైతుల నుంచి ఆరా తీయనున్నాయి. ప్రత్యేక నమూనాలో సర్వే.. అభిప్రాయ సేకరణను పకడ్బందీగా నిర్వహించేందుకు డిస్కంలు ఓ ప్రత్యేక నమూనాలో సర్వే ఫారాన్ని సిద్ధం చేశాయి. సర్వేలో భాగం గా 24 గంటల విద్యుత్‌పై అభిప్రాయం తెలిపే రైతు పేరు, ఫోన్ నంబర్, పొలం సర్వే నం బర్, విస్తీర్ణం, ఏ రకం పంట తదితర వివరాలను సేకరించనున్నారు. ఈ సర్వేలో అత్యధిక శాతం మంది రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభు త్వం ఓ నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నా యి. అసెంబ్లీ సమావేశా ల్లో కూడా 24 గంటల విద్యుత్ సరఫరాపై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కోరాలని భావిస్తోంది. ‘రబీ’ఎండిపోయే ప్రమాదం ఇటీవలి కాలంలో రైతులు గరిష్టంగా 600 అడుగుల లోతు వరకు బోరు బావులను తవ్వుతున్నారు. ఏళ్ల కిందటి బోర్లు 100–200 అడుగుల లోతులోనే ఉండటంతో కొత్త బోర్ల దెబ్బకి అవి ఎండిపోతున్నాయి. అధిక సామర్థ్యం ఉన్న మోటార్లతో పెద్ద రైతులు భూగర్భ జలాలను తోడుతుండటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లోని చిన్న రైతుల బోర్లకు నీళ్లు అందక అడుగంటిపోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే మార్చి వరకు 24 గంటల విద్యుత్‌ను కొనసాగిస్తే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి రబీ పంటలు ఎండిపోతాయని రైతులు భయాం దోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల భూగర్భ జలాల సమస్య ఏర్పడిందని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. 24 గంటల విద్యుత్ వద్దని కొన్ని చోట్ల రైతులు స్థానిక విద్యుత్ అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వరుసగా మూడు, నాలుగు రోజులపాటు కొన్నిచోట్ల బోర్లలో నీళ్లు ఊరడం లేదు. దీంతో రైతులు విద్యుత్ సరఫరా వైర్లపై కండక్టర్ వైరు ముక్కలు విసిరేసి విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిస్తున్నారని క్షేత్రస్థాయి అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభం.. వ్యతిరేకత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనవరి 1 నుంచి సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎన్నో నెలల ముందు నుంచి ప్రభుత్వం దీనికి ఏర్పాట్లు చేసింది. రూ.24 వేల కోట్లను వెచ్చించి రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరాకు వీలుగా రాష్ట్రంలో విద్యు త్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచింది. కేసీఆర్ సైతం ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి పలుసార్లు సమీక్షలు జరిపారు. దీంతో ఒక్కసారిగా యావత్ దేశం దృష్టి రాష్ట్రంపై పడింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్‌కు లేఖ రాశారు. గుజరాత్, యూపీ, పంజాబ్ తదితర రాష్ట్రాల అధికారులు రాష్ట్ర అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందని భావిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం పునరాలోచన జరపాల్సిన పరిస్థితి నెలకొంది. -
గండం గడిచింది!
⇒సింగపూర్ కంపెనీతో ఒప్పందంపై రైతుల వ్యతిరేకత ⇒ లింగాయపాలెంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ⇒మూడు గ్రామాల్లో కట్టుదిట్టమైన నిఘా ⇒ స్టార్టప్ ఏరియా శంకుస్థానకు సామాన్య రైతులు దూరం ⇒ హాజరైన వారంతా టీడీపీ కార్యకర్తలు, అనుకూలురే.. ⇒ టెన్షన్ టెన్షన్‌గా అధికార యంత్రాంగం ⇒వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నేతలకు పలుమార్లు ఫోన్లు అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్ : ‘అమరావతి నగరాన్ని అద్భుతంగా నిర్మించాలని నన్ను దేవుడు ఆదేశించాడు...’ అని ఓ వైపు సీఎం చంద్రబాబు సభా వేదికపై చెబుతుండగానే... మరోవైపు పోలీసు అధికారులు మాత్రం ఎటువైపు నుంచి ఎవరు వచ్చి ఆందోళనలు చేస్తారోనని మండుటెండలో వణికిపోయారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమం వద్ద ఏ చిన్న గొడవ జరిగినా సింగపూర్ పెద్దల ముందు సిగ్గుపోతుందని భయపడిన ప్రభుత్వ పెద్దలు... చివరకు ‘హమ్మయ్యా... గండం గడిచింది.. గట్టెక్కాం..’ అని ఊపిరి పీల్చుకున్నారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం పరిధిలో 1,691 ఎకరాల విస్తీర్ణాన్ని ప్రభుత్వం స్టార్టప్ ఏరియాగా గుర్తించిన విషయం తెలిసిందే. ఇందులో 396 ఎకరాలను రైతులు ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వడానికి నిరాకరించారు. అయితే ఈ భూములను కూడా ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకు అప్పగించేందుకు సిద్ధమైంది. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా తాళ్లాయపాలెం సమీపంలో భూమి పూజ కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని భూములను సింగపూర్ కంపెనీకి అప్పగిస్తూ నిర్వహించే కార్యక్రమాన్ని స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అందులో భాగంగా ఉదయం లింగాయపాలెంలో నిరసన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. కొందరు రైతులు ఏకమై నేరుగా అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం షాక్‌కు గురైంది. వెంటనే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు పోలీసులు, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ అధికారులను గ్రామాల్లోకి పంపారు. రైతుల నివాసాల చుట్టూ పోలీసులు సింగపూర్ ప్రభుత్వానికి చెందిన మంత్రి, మరికొందరు ప్రతినిధుల బృందం వస్తున్నందున రైతులు నిరసనలు వ్యక్తం చేస్తే ఇన్నాళ్లు తాము చేసిన ప్రయత్నాలకు ప్రయోజనం ఉండదని టీడీపీ పెద్దలు భావించారు. రాజధాని ప్రకటించిన మొదలు ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు... ఆందోళన చేసిన వారిని గుర్తించి నిఘా పెట్టారు. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ అధికారులు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి అనుమానం ఉన్న వారికి ఫోన్లు చేయడం, వారి నివాసాలకు వెళ్లి అభిప్రాయాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తల నివాసాల వద్ద నిఘా పెట్టారు. తాళ్లాయపాలెం సమీపంలో ఏర్పాటు చేసిన శంకుస్థాన కార్యక్రమం వద్ద కూడా భారీ ఎత్తున పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ప్రాంగణం చుట్టూ పోలీసులు, ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఎవరైనా నిరసన తెలియజేస్తే వారిని తరలించేందుకు ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశారు. సామాన్య రైతులు దూరం... స్టార్టప్ ఏరియా అభివృద్ధి శంకుస్థాపనకు కేవలం రాజధాని రైతులతో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వ యంత్రాంగం భావించింది. అయితే ఈ కార్యక్రమానికి సామాన్య రైతులు రావడానికి ఇష్టపడలేదు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డారు. కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే ఆహ్వానించారు. అందుకు ప్రత్యేకంగా పాసులు ముద్రించారు. ఆ పాసులు ఉన్న వారిని మాత్రమే పోలీసులు సభా ప్రాంగంణంలోకి అనుమతించడం కనిపించింది. స్థానిక రైతులు పెద్దగా రాకపోవడంతో తాడికొండ, అవనిగడ్డ నియోజకవర్గాల నుంచి టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను బస్సుల్లో తరలించారు. ఎటువంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా కార్యక్రమం ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకోవడం గమనార్హం. సన్మానానికి సైతం రైతులు దూరం స్టార్టప్ ఏరియాకు భూములు ఇచ్చిన రైతుల్లో కొందరు సింగపూర్ కంపెనీ ప్రతినిధులను సన్మానిస్తామని ప్రకటించారు. అయితే చివరికి వారు కూడా రాకపోవడంతో టీడీపీ నాయకులను రైతులుగా చూపించి సింగపూర్ కంపెనీ ప్రతినిధులను సన్మానింపజేశారు. వారిలో టీడీపీ తుళ్లూరు మండల అధ్యక్షుడు, తాడికొండ మార్కెట్ కమిటీ చైర్మన్, లింగాయపాలెం సర్పంచ్, టీడీపీ రైతు విభాగం నాయకులు ఉన్నారు. -
కథ అడ్డం తిరిగింది!
భూములివ్వం విమానాశ్రయ భూసమీకరణపై రైతుల వ్యతిరేకత మొదటి విడతకూ అంగీకరించబోమని వెల్లడి రాజధాని ప్రాంతంలో కేటాయింపుపై అనుమానాలు విజయవాడ : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూములు సమీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలను రైతులు తిప్పికొట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములు ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వబోమని అధికారులకు తెగేసి చెప్పారు. విమానాశ్రయ విస్తరణలో భాగంగా రెవెన్యూ అధికారులు ఆదివారం అవగాహన సదస్సుల పేరిట గన్నవరం మండలం బుద్దవరం, అజ్జంపూడి, చినఅవుటపల్లి గ్రామాల్లో పర్యటించారు. భూ సమీకరణకు అంగీకరించిన వారినుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు పథకం రచించారు. ల్యాండ్ పూలింగ్‌కు సహకరించి ఫారం-3 ఇస్తే రాజధాని ప్రాంతం ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం తరఫున అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతులు మొదటి విడత 750 ఎకరాల భూసమీకరణకు కూడా సహకరించేది లేదని స్పష్టం చేశారు. తమ భూములు ఇవ్వబోమంటూ ఫారం-2 దరఖాస్తులను అధికారులకు అందించారు. మొదటి విడత భూసమీకరణకు ఆరు మాసాల కిందట కలెక్టర్‌తో జరిపిన చర్చల్లో సగం మంది రైతులు అంగీకరించారు. ఫారం-2 దరఖాస్తులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న రైతులు... తాజాగా ఏలూరు కాల్వ మళ్లింపునకు మరో 450 ఎకరాలు జక్కులనెక్కలం, సావరగూడెం, కేసరపల్లి, గన్నవరం, మర్లపాలెం, చిన అవుటపల్లి, పెదఅవుటపల్లి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో సోమవారం అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేసి ల్యాండ్‌పూలింగ్‌కు భూములు ఇచ్చే వారి నుంచి ఫారం-3 దరఖాస్తులు స్వీకరించేందుకు కార్యక్రమాన్ని రూపొందించారు. దీంతో ఏలూరు కాల్వ మళ్లింపునకు కూడా భూములు ఇచ్చేది లేదని రైతులు అధికారులకు లిఖిత పూర్వకంగా ఫారం-2ను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ల్యాండ్ పూలింగ్ను తాము నమ్మబోమని రైతులు అధికారులకు తెగేసి చెబుతున్నారు. ఎన్నాళ్లకు తమకు రాజధాని ప్రాంతంలో ల్యాండ్‌పూలింగ్‌లో స్థలం కేటాయిస్తారో నమ్మకం లేదని నిర్వాసితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూములు తీసుకున్నాక రాజధాని ప్రాంతంలో స్థలం కేటాయించటంలో ఆలస్యమైతే తమ గతేమిటని ఆదివారం నాటి సదస్సుల్లో అధికారులను ప్రశ్నించారు. నూజివీడు సబ్ కలెక్టర్, గన్నవరం తహసీల్దార్, ఇతర అధికారులు రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతను సర్దుబాటు చేసి ల్యాండ్ పూలింగ్‌కు ఒప్పించేందుకు విఫలయత్నాలు చేశారు. రెండో విడత భూసమీకరణలో ఏలూరు కాల్వను మళ్లించబోమని, ఎయిర్‌పోర్టుకు ఆ భూములు అవసరమని అధికారులు వివరించారు. అధికారులు ఎన్ని విధాలుగా చెప్పినా రైతులు మాత్రం ససేమిరా అన్నారు.