న'గరం'
► రైతులకు మద్దతుగా ఖమ్మంలో విపక్షాల ఆందోళన
► కొనసాగిన అరెస్టుల పర్వం...
► పోలీసుల విస్తృత తనిఖీలు, బందోబస్తు
► ఖాకీ పహారా నడుమ మార్కెట్‌లో కొనుగోళ్లు
సాక్షి, ఖమ్మం/ఖమ్మం వ్యవసాయం: వ్యవసాయ మార్కెట్‌పై దాడి ఘటనతో ఖమ్మం నగరం అట్టుడికింది. రైతులకు మద్దతుగా విపక్షాల ఆందోళనలు, పోలీసుల విస్తృత తనిఖీలు, అరెస్ట్‌లు, 144 సెక్షన్‌తో శనివారం ఒక్కసారిగా ఖమ్మం నగరం వేడెక్కింది. మరోవైపు పోలీసుల పహారాలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లను వేగిరం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం మిర్చి కొనుగోలుపై దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధర పడిపోవడంతో రైతులు ఆందోళనకు గురై మార్కెట్‌యార్డుపై దాడి చేసిన విషయం విదితమే.
రైతుల ఆందోళనకు మద్దతుగా శనివారం ప్రతిపక్షాలు గొంతు కలిపాయి. కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా ఆందోళనలకు సిద్ధమయ్యారు. రైతుల దాడిలో మార్కెట్‌కు సంబంధించిన ఆస్తులు భారీగా విధ్వంసం కావడం, పరిస్థితులు చేయిదాటుతుండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం 144 సెక్షన్ విధించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీస్ యంత్రాంగాన్ని ఖమ్మంనగరంతోపాటు పరిసర మండలాల్లో మోహరింపజేసి గట్టి బందోబస్తు చేపట్టింది.
ఎక్కడికక్కడ అరెస్ట్‌లు..
మిర్చికి మద్దతు ధర కల్పించాలని విపక్షాలు మార్కెట్‌యార్డును సందర్శించడం, ఆందోళనలకు ప్రణాళికలు రూపొందించుకోవడం తదితర చర్యలకు సమాయత్తం కావడంతో పసిగట్టిన పోలీస్‌యంత్రాంగం చర్యలకు పూనుకుంది. నగరంలోని బస్టాండ్ సెంటర్‌తోపాటు కాల్వొడ్డు, వరంగల్ క్రాస్‌రోడ్డు, ప్రకాష్‌నగర్ బ్రిడ్జి, బైపాస్‌రోడ్డు, ఎన్‌టీఆర్ విగ్రహం, రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. జిల్లా సరిహద్దు వద్ద వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. నాయకన్‌గూడెం, ముదిగొండ, తిరుమలాయపాలెం, శ్రీశ్రీ సర్కిల్, ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు.
మార్కెట్ దాడి ఘటనలో రైతులున్నారనే అనుమానంతో ముదిగొండలో కొందరిని అదుపులోకి తీసుకోవడంతో పోలీస్‌స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఇక్కడ ఆందోళన చేపట్టడంతో పోలీసులు ఆయనను అరెస్ట్‌చేసి కొణిజర్లకు తరలించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డితోపాటు జిల్లాకు చెందిన సీపీఐ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి ఆందోళనకు బయలుదేరగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి కొణిజర్లకు తరలించారు. టీడీపీ నాయకులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, నామా నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబి స్వర్ణకుమారిలను అరెస్ట్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్, జిల్లా రాష్ట్ర, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పోటు రంగారావు,రాయల చంద్రశేఖర్ తదితరులను, సీపీఎం నాయకుడు సుదర్శన్ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
కొనుగోళ్లపై జేసీ పర్యవేక్షణ..
వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. మార్కెట్‌కు వచ్చిన సరుకు వివరాలు, కొనుగోళ్లు తదితర అంశాలను మార్కెటింగ్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిర్చి కొనుగోళ్లను వేగిరం చేయాలని అధికారులను ఆదేశించడంతోపాటు రహదారులపై ఉన్న మిర్చిని కాంటాలను పెట్టించి తరలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌లో ఉన్న సరుకు వివరాలు, కొనుగోళ్లు జరిగిన విధానాన్ని, ధరల వివరాలను జేసీ తెలుసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్‌స్థితిగతులను, మిర్చి కొనుగోళ్ల వ్యవహారాన్ని, శాంతిభద్రతలను తదితర అంశాలపై మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష జరిపి ఉన్నతాధికారులకు నివేదించ చర్యలను చేపట్టారు.