ఆశ్రమం ముసుగులో దగా | orphanage children's begging | Sakshi
Sakshi News home page

ఆశ్రమం ముసుగులో దగా

Published Thu, Aug 18 2016 9:29 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

బ్రహ్మపుత్ర ఆశ్రమంలోని చిన్నారులు

బ్రహ్మపుత్ర ఆశ్రమంలోని చిన్నారులు

  • చిన్నారులతో భిక్షాటన
  • అనాథలతో చెలగాటం
  • నిర్వాహకుడి నిర్వాకం
  • పోలీసులు పట్టుకోవడంతో వెలుగుచూసిన వైనం
  • ఆశ్రమాన్ని సీజ్‌ చేసిన అధికారులు
  • రామచంద్రాపురం: పేరుకు ఓ అనాథ ఆశ్రమం. అక్కడ ఆశ్రమం ఉన్నట్టు ఎవరికీ తెలియదు. పైగా అందులో ఎంత మంది పిల్లలున్నారు? వారు ఏం చేస్తున్నారన్నదీ నిన్నటి వరకు రహస్యమే.. నేడు అసలు గుట్టు రట్టు కావడంతో అందరి దృష్టి ఆ అనాథ ఆశ్రమంపైనే పడింది. ఐటీ కారిడార్లలో భిక్షాటన చేస్తున్న చిన్నారులను పోలీసులు పట్టుకోవడం.. అధికారులు ఆశ్రమాన్ని సీజ్‌ చేయడం చకచకా జరిగిపోయాయి.. వివరాలిలా ఉన్నాయి..

    అమీన్‌పూర్‌ ప్రాంతంలో బ్రహ్మపుత్ర పేరిట ఓ అనాథ ఆశ్రమాన్ని ఖమ్మం జిల్లాకు చెందిన జెమ్స్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమాన్ని సుమారు ఐదేళ్లుగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆశ్రమంలో 20 మంది వరకు చిన్నారులున్నారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల చిన్నారులు కూడా  ఇందులో ఆశ్రయం పొందుతున్నారు. వీరందరికీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు.  అయితే సెలవు రోజుల్లో వీరి చేత భిక్షాటన చేయిస్తుండటం గమనార్హం.

    ‘అనాథ ఆశ్రమానికి చేయూత నివ్వండి’ అనే స్టిక్కర్‌ ఉన్న డబ్బాలను వీరి చేతికిచ్చి రోడ్లపై భిక్షాటన చేయిస్తున్నారు. బుధవారం రాత్రి గచ్చిబౌలి పోలీసులు ఐటీ సెక్టార్‌లో భిక్షాటన చేస్తున్న ఇద్దరు చిన్నారులను పట్టుకోవడంతో అసలువిషయం బయటకు వచ్చింది. ఆ చిన్నారులు ఉంటుంది అమీన్‌పూర్‌ ప్రాంతం అని తెలియడంతో వెంటనే వారు రామచంద్రాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనాథ ఆశ్రమంపై దాడిచేయడంతో  ఎన్నో  విషయాలు వెలుగుచూశాయి.

    అసలు ఆశ్రమానికి అనుమతే లేదని పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఆశ్రమం ఉన్నట్టు స్థానికులకు కూడా తెలియలేదంటే ఎంత గుట్టుగా నిర్వహిస్తున్నారో అర్థమవుతోంది. సేకరించిన డబ్బు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు.  ఆశ్రమంలో ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులకు తెలియలేదా? లేక చూసిచూడనట్టు వ్యవహరించారా? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

    అనాథ ఆశ్రమాల పేరిట అక్రమ దందాలు చేసేవారిపై నిఘా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. భిక్షాటన సమయంలో ప్రమాదం జరిగితే అందుకు బాధ్యత ఎవరిదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గురువారం సదర్‌ ఆశ్రమాన్ని అధికారులు సీజ్‌ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అనుమతిలేని అనాథ ఆశ్రమాలను గుర్తించి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

    అనుమానం వచ్చి పట్టుకున్నాం
    ఐటీ కారిడార్లలో ఇద్దరు చిన్నారులు చేతిలో డబ్బాలు పట్టుకొని భిక్షాటన చేస్తున్నారు. ఈ చిన్నారులు ఇక్కడికి ఎలా వచ్చారన్న అనుమానంతో వారి వద్దకు వెళ్లి విచారించగా తమను ఫాస్టర్‌ జెమ్స్‌ వదిలివెళ్లారని తిరిగి సాయంత్రం తీసుకువెళతారని చెప్పారు. తాము రామచంద్రాపురం పోలీసులకు సమాచారం  అందించాం.అమీన్‌పూర్‌లో ఆశ్రమానికి వెళ్ళిచూడాగా అందులో ఇరవై మంది అనాథ విద్యార్థులు ఉన్నారు. - ఎస్‌ఐ వెంకటేశ్‌, గచ్చిబౌలి

    ఎనిమిది నెలల క్రితం వచ్చాను
    నేను ఎనిమిది నెలల క్రితం ఈ ఆశ్రమానికి వచ్చాను. స్థానిక ఫాదర్‌ స్కూల్‌లో నర్సరీ చదువుతున్నాను. తనను ఇక్కడ బాగానే చూసుకుంటున్నారు. - కన్నయ్య, కల్హేర్‌

    ఈ డబ్బు మా కోసమే
    మాది మహబూబ్‌నగర్‌. కొంత కాలంగా అనాధ ఆశ్రమంలో ఉంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. తమను సారు ప్రధాన కూడళ్ళ వద్ద దింపుతారు. తాము ఆశ్రమానికి సహాయం చేయాల్సిందిగా కోరుతాం. వచ్చిన డబ్బు మాకోసమే ఖర్చు చేస్తారు. - వెంకటేష్‌, మహబూబ్‌నగర్‌

    డబ్బు సేకరించి సారుకు ఇస్తాం
    నేను స్థానిక ఫాదర్‌ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాను. మా సారు జెమ్స్‌ మమ్మల్ని బాగానే చదివిస్తారు. మంచిగా చదవకపోతే కొడతారు. సెలవు దినాల్లో తమను గచ్చిబౌలి ప్రాంతంలో దింపుతారు.   తాము డబ్బులు సేకరించి సారుకు ఇస్తాం. ఆ డబ్బులతో తమకు పుస్తకాలు, దుస్తులు కొనిస్తుంటారు. - అనురాగ్‌సేత్‌ విద్యార్థి

    చిన్నారులతో భిక్షాటన చేయించడం నేరం
    చిన్నారులతో భిక్షాటన చేయించడం నేరం. అలా చేసిన వారిపై కఠిన చర్చలు తప్పవు. గచ్చిబౌలి ఎస్‌ఐ చిన్నారులను పట్టుకుని విచారిస్తే అన్ని విషయాలు వెలుగుచూశాయి. అధికారులు పట్టనట్టు వ్యవహరించడం వల్లే అక్రమ దందాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అనుమతి లేని ఆశ్రమాలు సుమారు 30 వరకు ఉన్నాయని సమాచారం ఉంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలి. - ఎంఎస్‌. చంద్ర, కార్పెడ్‌ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement