ప్రాణపాయం తప్పింది
ప్రాణపాయం తప్పింది
Published Thu, Jan 5 2017 12:08 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఉంగుటూరు : జాతీయరహదారిపై వెళ్తున్న ప్రైవేటు హైటెక్ బస్సు(వోల్వో) ఉంగుటూరు వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న రైల్వే కొలనులోకి దూసుకుపోయింది. చెట్టును ఢీకొని నిలిచిపోయింది. అందులో ఉన్న 29 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రయాణికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఈ ప్రైవేటు హైటెక్ బస్సు హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి 12 గంటలకు బయలుదేరింది. ఉంగుటూరు వచ్చే సరికి ఓ లారీ అడ్డురావటంతో అదుపు తప్పి రైల్వే కొలనులోకి వెళ్లిపోయింది. బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. జాతీయ రహదారి నుంచి కిందకు వేగంగా పోయిన బస్సు అక్కడ ఉన్న చెట్టును ఢీకొనటంతో ఏమి జరిగిందో తెలీక ప్రయాణికులు అరుపులు కేకలు వేశారు. చీకటిగా ఉండటంతో బయటకు రావటటానికి ఇబ్బంది పడ్డారు. బస్సు అత్యవసర ద్వారం నుంచి కొందరు, బస్సు అద్దాలు పగలుగొట్టి మరికొందరు బయటకు వచ్చారు. వారిని అదె ట్రావెల్స్‌కు చెందిన మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. అందరం గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరిగిందని, సీట్లో ఉన్న వాళ్లం ముందుకు పడిపోయామని, ఏం జరిగిందో తెలిసేసరికే బస్సు కొలనులోకి వెళ్లిపోయిందని ప్రయాణికులు చెప్పారు. భగవంతుని దయ వల్ల బతికామని ఊపిరిపీల్చుకున్నారు. లారీ అడ్డు రావడం వల్ల బస్సు అదుపు తప్పిందని డ్రైవర్ మజూరుద్దీన్ చెప్పారు. ఇదిలా ఉంటే కొలను వద్ద కొద్దిదూరంలో విద్యుత్ హెచ్‌టీ లైన్ ఉంది. బస్సు ఏమాత్రం ఆ లైన్‌ను ఢీకొన్నా భారీ ప్రమాదం జరిగేదని స్థానికులు చెబుతున్నారు.
Advertisement
Advertisement