తెలంగాణలో 1400మంది రైతుల ఆత్మహత్యలు
కరీంనగర్ : వైఎస్ రాజశేఖరరెడ్డిని ఇప్పటికీ ప్రజలు దేవుడిగా పూజిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ షర్మిలను రాజన్న బిడ్డగా, జగనన్న సోదరిగా ప్రజలే ఓదార్చారని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర నేటితో ముగిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జిల్లాలో రెండు విడతలుగా ఆరు రోజులు షర్మిల పర్యటించారని, 30 కుటుంబాలను పరామర్శించినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం గడిచిన 16 నెలల్లో సాధించిందేమీ లేదని పొంగులేటి విమర్శించారు. కరీంనగర్ జిల్లాలోనే 16 నెల్లలో 162 మంది రైతులు, 55మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1400మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పొంగులేటి వెల్లడించారు. ఇక కల్తీకల్లుకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని తప్పించుకోవటం భావ్యం కాదని పొంగులేటి అన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు భరోసా కల్పించేలా నవంబర్లోగా పంట రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని, అలాగే కరవు మండలాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కరవు సహాయక చర్యలకు వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని పొంగులేటి అన్నారు. రైతులకు అండగా ఉంటే విపక్షాలన్నీ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన తోటపల్లి, ఎల్లంపల్లి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులును రీడిజైన్ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని పొంగులేటి మండిపడ్డారు.