రైతులకు భరోసా కల్పిస్తాం: పొంగులేటి
18న కలెక్టర్లకు వినతి పత్రాలు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర సమస్యల్తో కొట్టుమిట్టాడుతున్న రైతులకు అండగా నిలిచి వారికి తాము భరోసాను కల్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపరకు అడ్డుకట్ట వేసేందుకు, ఆ దిశగా తక్షణం చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తొలి విడతగా ఈ నెల 18న 9 జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తామని మంగళవారం ఆయన ‘సాక్షి’కి చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, వాటిని ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావించాల్సి ఉంటుందని ప్రతిపక్షంలో ఉండగా కేసీఆర్ చాలా సందర్భాల్లో పేర్కొన్నారు.
కానీ ఇప్పుడు ఆయన హయాంలో దేశంలోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో జరుగుతున్నాయి. బంగారు తెలంగాణ వస్తుందని ఆశించిన రైతులు అన్నిరకాలుగా నష్టపోయి ఆత్మహత్యల బారినపడడం అత్యంత విచారకరం. తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడి, సరిగా కరెంటు రాక, అప్పోసప్పో చేసి వేసిన పంటలు పండక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు ఆత్మహత్య బాటపట్టే దుస్థితి ఏర్పడింది. రైతులకు ప్రకటించిన రూ.లక్ష రుణ మాఫీని ఒక్క విడతలో కాకుండా 4 విడతలుగా చేయాలని నిర్ణయించడంతో పాత అప్పులు తీరక, కొత్త రుణాలందక రైతులు తీవ్ర సంక్షోభంలో పడ్డారు’’ అని విమర్శించారు. రైతుల స్థితిగతులను, వారి సమస్యలను దగ్గర నుంచి పరిశీలించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తాను సీఎం కాగానే అనేక రైతు సంక్షేమ చర్యలు తీసుకున్నారని పొంగులేటి గుర్తు చేశారు.
‘‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సమర్థంగా అమలుచేసి, గతంలో ఆత్మహత్యల బారిన పడిన రైతుల కుటుంబాలకు రూ.లక్షన్నర పరిహారం అందించేలా జీవో 421ను తెచ్చిన ఘనత వైఎస్‌కే దక్కింది’’ అన్నారు. ప్రస్తుతం 421 జీవోను సవరించి, రూ.5 లక్షలు పరిహారమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకవసరమైన ప్రణాళికలను వెంటనే రూపొందించి అమలు చేయాలన్నారు.