దిగొస్తున్నారు.. ధర పెంచుతున్నారు
దిగొస్తున్నారు.. ధర పెంచుతున్నారు
Published Sat, May 13 2017 11:27 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM
- రూ. 1400లకు పెరిగిన బొండాలు ధర
- మొదట్లో రూ. 1,150లు మాత్రమే
- గత సీజన్‌లో రూ.1800లు వరకు కొనుగోళ్లు
- రైతులకు అండగా నిల్చిన వైఎస్సార్ సీపీ నేతలు
- రూ.1500 వరకు పెంచాలని డిమాండ్
- ధర పెరుగుదల కోసం రైతులు ఎదురుచూపులు
- కేరళ ఎగుమతులు పెరగడంతో ధర పెంచుతున్న మిల్లర్లు
- కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లపై అనుమానాలు
మండపేట : మొదట్లో 75 కిలోల బొండాలు బస్తా రూ.1,150లు మించి కొనుగోలు చేయని మిల్లర్లు ముందెన్నడూ లేనివిధంగా సీజన్ ఆరంభంలోనే ధర పెంచుతున్నారు. ఊహించని విధంగా ఇప్పటికే రూ.1400లు వరకు పెరగ్గా కేరళ డిమాండ్ మేరకు ఈ ధర మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది ఆరంభంలోనే అమ్మకాలు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతాంగం ఈ సీజన్‌లో ఆచీతూచీ అడుగేస్తున్నారు. ధాన్యం అమ్మకాలు మందకొడిగా సాగుతుండగా ప్రస్తుత మిల్లింగ్, భవిష్యత్తు స్టాకుల కోసం మిల్లర్లు ధర పెంచక తప్పడం లేదని తెలుస్తోంది. జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టాలతోపాటు మెట్టలోని మొత్తం 4.2 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరిగింది. 80 శాతం మేర బొండాలు రకాన్నే సాగుచేశారు. వాతావరణం అనుకూలించడడంతో ఈ సీజన్ ఆశాజనకంగా సాగింది. ఎకరానికి కొన్నిచోట్ల 47 బస్తాల నుంచి 50 బస్తాలకు పైబడి దిగుబడి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 13.77 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి లక్ష్యం కాగా దానిని అధిగమించి రైతులు దిగుబడులు సాధించారు. మాసూళ్లు మొదలుకావడంతో ధాన్యం మార్కెట్‌ను ముంచెత్తుతాయని భావించిన మిల్లర్లకు ఈసారి చుక్కెదురైంది. సాగు కోసం చేసిన అప్పులు, ఎరువుల దుకాణాల బాకాయిలు చెల్లించేందుకు సాధారణంగా సన్నచిన్నకారు రైతులు దళారులకు కళ్లాల్లోనే ధాన్యాని అమ్మేస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని సీజన్ ఆరంభంలో ధర తగ్గించేసి రైతుల వద్ద ధాన్యం అయిపోయిన తర్వాత మిల్లర్లు, దళారులు ధర పెంచడం పరిపాటి. ఈ క్రమంలో మిల్లర్లు, స్టాకులు పెట్టుకున్న దళారులు భారీగా లాభపడుతున్నారు. గత ఏడాది ఇదే పరిస్థితి ఎదురైంది. కేరళలో డిమాండ్ లేదంటూ మొదట్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాని మిల్లర్లు కొనుగోళ్లు సీజన్ ముగిసిన అనంతరం ధర పెంచడం ప్రారంభించారు. 75 కేజీల బస్తా ధర క్రమంగా పెంచుతూ రూ.1800లు వరకు పెంపుదల చేశారు. రబీ సీజన్ మాసూళ్లు దగ్గరపడే వరకు రూ.1800లుండగా మార్కెట్‌లోని ధాన్యం రావడం ప్రారంభించే సరికి ఒక్కసారిగా ధరను రూ.1,150లకు తగ్గించేశారు. గత ఏడాది ఇదే తరహాలో మొదట్లో ధరను తగ్గించేయడం, తమవద్ద ఉన్న ధాన్యం అయిపోయిన తర్వాత మిల్లర్లు ధరను పెంచడంతో మోసపోయిన రైతాంగం ఈసారి అమ్మకాలు చేసేందుకు ఆచితూచీ అడుగేస్తున్నారు.
పెంచకుంటే ఉద్యమిస్తాం : వైఎస్సార్ సీపీ
కేరళలో ఉన్న డిమాండ్ మేరకు 75 కేజీల బస్తా రూ.1500లు వరకు కొనుగోలు చేసే వీలుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాసూళ్ల ఆరంభంలోనే పేర్కొన్నారు. ఈ మేరకు కంగారు పడి అమ్మకాలు చేయరాదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ కోరారు. రూ.1500 కొనుగోళ్లు చేయకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని, అందుకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
రూ. 1500లకు కొనుగోలు చేయాలి
ప్రస్తుతం కేరళ మార్కెట్ దృష్ట్యా బస్తా రూ. 1500లు వరకు కొనుగోలు చేసే వీలుంది. ఆ దిశగా కొనుగోళ్లు జరపడం ద్వారా రైతులకు మేలు చేయాలి. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వారి పక్షాన ఉద్యమిస్తాం.
వేగుళ్ల లీలాకృష్ణ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్.
Advertisement