
అమరావతిలో అణుబాంబుల తయారీ అట!
- ఏపీ రాజధాని నిర్మాణాలపై పాక్ మీడియాలో అడ్డగోలు చర్చలు
హైదరాబాద్: 'అమరావతిలో ఆటం బాంబులు తయారు చేయబోతున్నారు. నదీ తీరంలో నిర్మించనున్న ఈ నగరంలో అమెరికా మద్దతుతో లెక్కకు మిక్కిలి న్యూక్లియర్ రియాక్టర్లు, హ్రైడ్రోజన్ బాంబు తయారీ కేంద్రాలు కట్టబోతున్నారు. కావాలంటే వాటికి సంబంధించిన డిజైన్లు చూడండి. అటామిక్ సిటీ నిర్మాణం ద్వారా భారత్.. పాకిస్థాన్, చైనాలను భయపెట్టాలనుకుంటోంది'
సత్యదూరమైన, అర్థం పర్థం లేని ఈ అడ్డగోలు మాటలు పాకిస్థాన్ టీవీ చర్చల్లో తరచూ వినిపిస్తున్నాయి. మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లు.. ఇండియాలో జరిగే ఏ పనికైనా విపరీత అర్థాలు ఇస్తూ చెవాకులు పేలే పాక్ మీడియా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. ఏపీ కొత్త రాజధాని అమరావతిలో న్యూక్లియర్ ప్లాంట్లు కడుతున్నారంది. 'పాకిస్థాన్ మీడియాలో జరిగిన చర్చాకార్యక్రమం' అంటూ ఒక చానెల్ ప్రసారం చేసిన కథనం ఆధారంగా పలు జాతీయ వార్తా సంస్థలు ఈ అంశంపై వార్తలను రాశాయి. గతేడాది డిసెంబర్ లోనూ అమరావతిపై పాక్ టీవీ చానెళ్లలో ఇలాంటి కథనాలు ప్రసారమయ్యాయి.
ఇదీ అసలు నిజం..
అమరావతి మాస్టర్ ఆర్కిటెక్ట్ గా ఉన్న జపాన్ సంస్థ మాకీ అండ్ అసోసియేట్స్ కొద్ది నెలల కిందట రాజధాని డిజైన్లను రూపొందించి, ప్రభుత్వానికి అందించింది. అమరావతిలో బౌద్ధ అవశేషాలు ఉండటంతో.. కొత్తగా రూపొందించిన అసెంబ్లీ సహా ఇతర ముఖ్య నిర్మాణాల డిజైన్లను డోమ్ ల(ప్రాచీన బౌద్ధారామాల లాగా) మాదిరి రూపొందించారు. వీటిని దూరం నుంచి చూస్తే అచ్చం అణుశుద్ధి కేంద్రం లాగే కనిపిస్తుంది. అనేక కారణాల వల్ల ప్రభుత్వం ఆ డిజైన్లను రద్దుచేసి, కొత్తవి ఇవ్వాల్సిందిగా మాకీ సంస్థను ఆదేశించింది. అదిగో, ఆ డిజైన్లను అడ్డంపెట్టుకునే పాక్ మీడియా ఏవేవో కథనాలు అల్లుతోంది.