బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి
-
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కూసుమంచి: పాలేరు ఉప ఎన్నిక ప్రచారంలో ప్రజలకు తాను ఇచ్చిన హామీలన్నిటినీ ఈ ఏడాదిలోనే నెరవేరుస్తానని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని సాగర్ ఎడమ కాలువ నుంచి పెరికసింగారం, గోరాలపాడు పంచాయతీల్లోని హీరామాన్‌తండా, భగవాన్ తండాకు బీటీ రోడ్ల నిర్మాణాన్ని మంగళవారం ప్రారంభించారు. పలుచోట్ల జరిగిన సభల్లో మంత్రి మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గంలో తారు రోడ్లు లేని గ్రామాలు ఉండకూడదన్నది ప్రభుత్వ సంకల్పమని అన్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ నియోజకవర్గానికి కేవలం మూడు నెలల కాలంలో 100 కోట్ల రూపాయల పనులను కేటాయించినట్టు చెప్పారు. ఇందులో, కేవలం తండాలకే రూ.60 కోట్ల విలువైన పనులు మంజూరు చేసినట్టు చెప్పారు. ప్రతి ఊరికి రోడ్లు, తారునీరు, సాగు నీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చి కొత్త సంవత్సరం ప్రారంభం నాటికి కానుకగా ఇస్తానని అన్నారు. మండలంలోని గణేష్ కుంట వద్ద హరితహారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అక్కడ ఈత మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విద్యాచందన, సర్పంచులు నాగమణి, సుజాత, నాగమణి, విజయ, ఎంపీటీసీ సభ్యులు జూకూరి విజయలక్ష్మి, పద్మారాంకుమార్, సీడీపీఓ ఉషారాణి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ పుష్పలత, ఏడీ వాణి, ఏఓ అరుణజ్యోతి, ఏఈలు రామకృష్ణ, శ్రీనివాస్, జగదీష్, అరుంధతి తదితరులు పాల్గొన్నారు.