
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట లభించింది. బ్యాటరీలకు సంబంధించి అదనపు భద్రతా ప్రమాణాల అమలును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి అయితే అక్టోబర్ 1 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలు అమల్లోకి రావాల్సి ఉంది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాల ప్రకారం.. నూతన బ్యాటరీ భద్రతా ప్రమాణాలను రెండంచెల్లో అమలు చేయనున్నారు.
మొదటి దశ నిబంధనలు ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. రెండో దశ నిబంధనలు 2023 మార్చి 31 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం తెలిసిందే. ప్రమాదాలకు కారణం బ్యాటరీలేనని తేలింది. దీంతో నిపుణుల సూచనల మేరకు కేంద్ర రవాణా శాఖ అదనపు భద్రతా ప్రమాణాలను రూపొందించి, ఆ మేరకు నిబంధనల్లో సవరణలు చేసింది. బ్యాటరీ సెల్స్, ఆన్ బోర్డ్ చార్జర్, బ్యాటరీ ప్యాక్ డిజైన్, వేడిని తట్టుకోగలగడం తదితర అంశాల విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది.