
గాయాలు చూపిస్తున్న చిన్నారులు
♦ తాండూరు బస్టాండ్‌లో దిక్కుతోచని స్థితిలో చిన్నారులు
♦ పిల్లల ఒంటిపై గాయాలు, పోలీసులకు అప్పగింత
♦ తండ్రే మెహిదీపట్నంలో బస్సు ఎక్కించాడంటున్న వైనం
తాండూరు: తల్లిదండ్రులకు పిల్లల పోషణ భారమైందో.. లేక కుటుంబ కలహాలతో కావాలనే వదిలించుకున్నారో తెలియదు గానీ.. ఇద్దరు చిన్నారులు దిక్కులేని వారయ్యారు. ఓ అక్కాతమ్ముడు ఒంటి మీద గాయాలతో రంగారెడ్డి జిల్లా తాండూరుకు చేరారు. ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ఏడుస్తుండడం స్థానికుల హృదయాలను కదలించింది. తాండూరు బస్‌స్టేషన్‌లో ఈ ఘటన మంగళవారం రాత్రి వెలుగుచూసింది. తాండూరు డిపో మేనేజర్ కృష్ణమూర్తి, అర్బన్ ఎస్‌ఐ నాగార్జున కథనం ప్రకారం.. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు యాదరిగుట్ట నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని మోహదీపట్నం బస్టాండ్‌కు చేరుకుంది.
అక్కడ ఓ వ్యక్తి ఓ బాలిక, బాలుడిని బస్సులో ఎక్కించి తాండూరులో చిన్నారులను దించాలని కండక్టర్ లక్ష్మికి టికెట్ డబ్బులు ఇచ్చి వెళ్లిపోయాడు. ఎవరూ తోడులేకుండా చిన్నారులను తీసుకెళ్లేందుకు కండక్టర్ అంగీకరించలేదు. తాండూరులో పిల్లల అమ్మమ్మ ఉంటుందని.. గతంలో కూడా ఇలాగే పంపించామని సదరు వ్యక్తి కండక్టర్‌కు నచ్చజెప్పాడు. రాత్రి 9 గంటలకు బస్సు తాండూరు బస్టాండ్‌కు చేరుకుంది. చిన్నారులను కండక్టర్ కిందికి దించింది. అరగంటైనా చిన్నారుల గురించి ఎవరూ రాలేదు. వారిని వివరాలు అడిగే ప్రయత్నం చేయగా ఏమీ చెప్పలేని పరిస్థితి. వారి అమ్మమ్మ గురించి ప్రశ్నించగా సమాధానం లేదు. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు.
వారి ఒంటిపై గాయాలు న్నాయి. డిపో మేనేజర్ కృష్ణమూర్తి తాండూరు అర్బన్ పోలీసులతోపాటు 1098 చైల్డ్‌లైన్ నంబర్‌కు సమాచారం ఇచ్చారు. చైల్డ్‌లైన్ ప్రతినిధులు పిల్లలను తీసుకొని ఠాణాకు తీసుకెళ్లారు. పోలీసులు వివరాలు అడుగ్గా తన పేరు అనూష(5), తమ్ముడి పేరు అయ్యప్ప(3) అని బాలిక తెలిపింది. తమ తండ్రే చేతులు, కాళ్లపై కాల్చినట్టు వివరించింది.
తల్లిదండ్రులు టింకూ, మైసమ్మ అని పిల్లలు వివరించారు. తమ తండ్రే బస్సు ఎక్కించి వెళ్లిపోయాడని చెప్పారు. ఆ సమయంలో తమ తల్లి కూడా ఉందన్నారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగానే పిల్లలను వదిలించుకున్నారా.. మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. అనంతరం చైల్డ్‌లైన్ ప్రతినిధులు పిల్లలను తమ కేంద్రానికి తీసుకువెళ్లారు.