అమ్మానాన్నలే ‘ప్రేరణ’ | Parents 'motivation ' | Sakshi
Sakshi News home page

అమ్మానాన్నలే ‘ప్రేరణ’

Published Sat, Aug 20 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

ఐటీడీఏ పీఓ రాజీవ్‌

ఐటీడీఏ పీఓ రాజీవ్‌

  • వారి స్ఫూర్తితోనే ఐఏఎస్‌ సాధించా..
  • ఎంత బిజీగా ఉన్నా పాపతో రిలాక్స్‌
  • మంచి స్నేహం లక్ష్య సాధనకు దోహదం
  • ఇప్పటికీ స్నేహితులతో టచ్‌లో ఉంటా...
  • క్రికెట్‌ ఇష్టం.. చికెన్‌ బిర్యానీ, ఫ్రాన్స్‌ కర్రీ మహా ప్రీతి
  • రాజీవ్‌గాంధీ హన్మంతు, ఐటీడీఏ పీఓ
  • భద్రాచలం : గ్రామీణ నేపథ్యం.. సాధారణ మధ్య తరగతి కుటుంబం.. ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య.. కానీ లక్ష్యం మహోన్నతం. ఐఏఎస్‌ సాధించాలనుకున్నారు..   ఆకాంక్ష నెరవేర్చుకున్నారు.. ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు. ప్రభుత్వోద్యోగులైన తల్లిదండ్రుల స్ఫూర్తితో.. కలెక్టర్‌ ఉద్యోగం గురించి.. వారి మాటల స్ఫూర్తితో అనుకున్న లక్ష్యం సాధించారు. ఎంత ఒత్తిడి ఉన్నా తన కూతురు ప్రేరణతో గడిపితే ఇట్టే రిలాక్స్‌ అవుతానని.. ఇప్పటికీ స్నేహితులతో టచ్‌లో ఉంటానని..క్రికెట్‌ అంటే ఇష్టమని.. చికెన్‌ బిర్యానీ, ప్రాన్స్‌ కర్రీ బాగా తింటానని.. ఇలాంటి ఎన్నో విషయాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలే నేటి సండే స్పెషల్‌...
    ఐఏఎస్‌ కావాలనే ఆలోచన..
    అమ్మానాన్నలు ఇద్దరూ ప్రభుత్వోద్యోగులు కావడంతో తరచూ అధికారుల పనితీరు గురించి మాట్లాడుకునే వారు. ఆ మాటల్లో జిల్లా కలెక్టర్‌ గురించి ఓ రోజు ప్రస్తావించారు. అవే నాకు ప్రేరణను ఇచ్చాయి. ఆ రోజే అనుకున్న నేను ఏనాటికైనా కలెక్టర్‌ స్థాయి ఉద్యోగం పొందాలని. పట్టుదలతో సాధించాను.. అమ్మానాన్న ఎంతో ఆనందించారు.
    కుటుంబం గురించి..
    నా భార్య విజయలక్ష్మి ఎల్‌ఎల్‌బీ చదివింది. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటుంది. హరితహారం పథకంలో భాగంగా ఐటీడీఏ ప్రాంగణంలో అధికారులతో కలిసి మొక్కలు నాటింది. ఇకపోతే మా అమ్మాయి ప్రేరణ అంటే నాకెంతో ఇష్టం. ఎంత అలసటతో ఇంటికెళ్లినా మా పాపతో గడిపితే ఎంతో రిలాక్స్‌. వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా నాన్న ఎక్కువ సమయం హాస్టల్‌లోనే ఉండేవారు. నాలుగైదు రోజులకోసారి ఇంటికి వచ్చేవారు. ఇంటిదగ్గర ఉన్నప్పుడు మాత్రం నాతో ఎక్కువ గడిపేవారు. నాన్నతో కబుర్లు చెప్పాలనే కోరిక ఉండేది. ఉద్యోగరీత్యా కుదిరేది కాదు. అటువంటి వెలితి నా కుమార్తెకు రావద్దని ఎక్కువ సమయం ఆమెతో గడుపుతాను. ఎంత బిజీగా ఉన్న కుటుంబానికి తగిన సమయం కేటాయించాలి.
    చిన్నప్పుడు..
    చదువుకునే రోజుల్లో క్రికెట్‌ బాగా ఆడేవాళ్లం. ఇంటర్మీడియెట్‌ రెసిడెన్షియల్‌ కావడంతో ఆటలకు బ్రేక్‌ పడింది. కానీ బీటెక్‌లో మళ్లీ స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఇరగదీసేవాణ్ని. మంచి స్నేహితులు లక్ష్యానికి దోహదపడతారు. కాలేజీ నాటి స్నేహితులతో ఇప్పటికీ టచ్‌లో ఉంటాను.
    ఐఏఎస్‌ అధికారిగా..
    ఆసిఫాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా పనిచేసిన రోజుల్లో జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాను. ప్రాజెక్టు నిర్మాణానికి రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాకపోవటంతో ఎన్నో ఏళ్లు అది ముందుకు సాగలేదు. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో రైతులతో నేరుగా మాట్లాడాను. నా హయాంలో మరో మారు సర్వే చేయించి, రైతుల అంగీకారంతో భూ సేకరణ చేపట్టాను. భద్రాచలం ఐటీడీఏ పీఓగా కొండరెడ్ల అభివృద్ధి కోసం ‘గోల్కొండ హ్యాండీ క్రాప్ట్‌’ ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నాను.
    గిరిజనాభివృద్ధికి...
    ఐటీ డీఏలో ఉద్యోగ రీత్యా  గిరిజనాభివృద్ధికి పాటుపడే అవకాశం దక్కింది. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు గిరిజనులందరికీ అందేలా మరింత సమర్థవంతగా పనిచేయాలి. గిరిజనులు విద్య, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా ఐటీడీఏ ద్వారా తగిన కార్యాచరణ సిద్ధమవుతోంది. మెరుగైన వైద్యం అందేలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక వైద్య నిపుణులతో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం.

    రాజీవ్‌ నేపథ్యం..
    – పేరు :  రాజీవ్‌గాంధీ హనుమంతు
    – జననం :16–06–1987
    – తల్లి : వనజాక్షి ( టీచర్‌)
    – తండ్రి : కృష్ణారావు ( అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ అధికారి)
    – అక్క: యూఎస్‌లో ఎంఎస్‌ న్యూరాలజీ
    – భార్య : విజయలక్ష్మి ( ఎల్‌ఎల్‌బీ చదివారు)
    – కుమార్తె : ప్రేరణ
    – స్వస్థలం : పలాస, శ్రీకాకులం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
    – విద్యాభ్యాసం: 1 నుంచి 8 వరకు పొలాకి పభుత్వ పాఠశాల, 9,10 పలాస, ఇంటర్‌ (నారాయణ రెసిడెన్షియల్‌ కాలేజ్‌), ఇంజినీరింగ్‌(ఆంధ్ర యూనివర్శిటీ) విశాఖపట్నం.
    – 2010లో సివిల్‌ సర్వీస్‌  పరీక్ష రాసి 719 ర్యాంకుతో ఐఆర్‌టీఎస్‌కు ఎంపిక
    – 2011లో రెండోసారి సివిల్స్‌ పరీక్ష రాశారు. 131వ ర్యాంకు రావటంతో ఐఏఎస్‌కు ఎంపిక. ముస్సోరిలో ఐఏఎస్‌ శిక్షణ పొందారు.
    – వరంగల్‌ జిల్లాలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా (ట్రైనీ)  పనిచేశారు.
    – 13–01–2015 ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు.
    – 15–12–2015న భద్రాచలం ఐటీడీఏ పీఓగా విధుల్లో చేరారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement