పరిహారం కోసం పడిగాపులు | Pariharankosam padigapulu | Sakshi
Sakshi News home page

పరిహారంకోసం పడిగాపులు

Published Wed, Aug 3 2016 11:04 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM

Pariharankosam padigapulu

ఆరు నెలలైనా అందని పంట నష్ట పరిహారం
మండలంలో రూ.8 కోట్ల మేర పంట నష్టం
రైతుల ఎదురుచూపులు

 సదాశివపేట రూరల్‌: వరుస కరువులతో అల్లాడిన రైతులు పంటనష్ట పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నారు. వర్షాభావం కారణంగా గత ఏడాది ఖరీఫ్‌లో పంటలు ఎండిపోయాయి. దీంతో రైతులు నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులను గమనించి సదాశివపేటను కరువు మండలంగా ప్రకటించింది. దీంతో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గ్రామంల్లో పంట నష్టం వివరాలను సేకరించారు. గత ఖరీఫ్‌లో రైతులు సుమారు రూ.8 కోట్ల మేర పంటనష్టాన్ని చవిచూశారని అధికారులు అంచనా వేశారు.

ఈమేరకు పరిహారం అందజేయాల్సిందిగా ప్రభుత్వానికి నివేదికలను పంపారు. కరువు సాయం కోసం నివేదికలు పంపి ఆరునెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులకు నయా పైసా విదిల్చచలేదు. దీంతో రైతులు పరిహారం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజనల్‌లో వర్షాలు కురుస్తుండటంతో సాగు పనులు ముమ్మరమయ్యాయి. ఇప్పుడే రైతులకు పంటల సాగు కోసం పెట్టుబడి అవసరం అవుతుంది.

ఈ సమయంలోనైనా ప్రభుత్వం పంటనష్ట పరిహారం డబ్బులు అందజేసి ఆదుకుంటారని భావించిన రైతాంగానికి నిరాశే ఎదురవుతోంది. పరిహారం చెల్లింపుపై అధికారులు సైతం స్పష్టత ఇవ్వడం లేదు.
కాగితాలకే పరిమితమైన పరిహారం
సదాశివపేట మండలంలో గత ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావంతో తీవ్రంగా పంట నష్టం జరిగింది. వ్యవసాయశాఖ అధికారుల వివరాల మేరకు మండలంలో 11,153 హెక్టార్లలో పత్తి, 348 హెక్టార్లలో కంది, 146 హెక్టార్టలో మొక్కజొన్న, 47 హెక్టార్టలో సోయాబీన్, 22 హెక్టార్లలో మినుము, 15 హెక్టార్టలో జొన్న, ఏడు హెక్టార్లలో పెసర పంటలు దెబ్బతిన్నాయి. మండలంలో మొత్తం 11,800 హెక్టార్టలో సుమారు రూ.8 కోట్ల విలువ చేసే పంట నష్టం వాటిల్లింది. ఈ మేరకు అదికారులు పరిహారం చెల్లించాల్సిందిగా ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయితే పరిహారం చెల్లింపులు కాగితాలకే పరిమితమయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రైతులకు మేలు చేసేలా వెంటనే పంటనష్ట పరిహారం చెల్లించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం పంటనష్ట పరిహారం చెల్లింపులపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయటంలేదు. దీంతో రైతుల్లో నైరాశ్యం అలుముకుంది. హెక్టారుకు పత్తికి రూ.6800, కందికి రూ.6700, సోయాబీన్‌ 6700, మొక్కజొన్నకు రూ.8700 పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంకా చెల్లింపులు జరగాల్సి ఉంది.
ఇప్పటికైనా పరిహారం ఇప్పించాలి
గత ఏడాది కరవుతో పంటలు నష్టపోయాం. వర్షాలు లేక పంటలు చేతికి రాలేదు. ప్రభుత్వం పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. కరువు కారణంగా రైతులంతా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. ప్రభుత్వం వెంటనే పంటనష్ట పరిహారం విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి.
- అబ్దుల్‌ రషీద్, రైతు
సాయం కోసం ఎదురుచూపులు
ప్రభుత్వం అందించే నష్ట పరిహారం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాం. పరిహారం ఇస్తే కొంత వరకు ఆసరగా ఉంటుంది. అప్పులు చేసి ఖరీఫ్‌ సాగు చేస్తున్నాం. ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెలిస్తే ఎంతో మేలు చేసినట్లు అవుతుంది.
- మాణయ్య, రైతు
నివేదికలు పంపాం: బాబూనాయక్‌
మండలంలో సుమారు రూ.8 కోట్ల మేర ఖరీఫ్‌లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదించాం. వ్యవసాయ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాల వారీగా నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. ప్రభుత్వం పంట నష్టపరిహారం డబ్బులు చెల్లించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement