రైతన్నకు సంకెళ్లు! | Raitannaku manacles! | Sakshi
Sakshi News home page

రైతన్నకు సంకెళ్లు!

Published Wed, Dec 28 2016 12:37 AM | Last Updated on Mon, Oct 22 2018 8:25 PM

రైతన్నకు సంకెళ్లు! - Sakshi

రైతన్నకు సంకెళ్లు!

  •  పరిహారం ఇవ్వకుండానే శరవేగంగా సోలార్‌ పనులు
  • నాల్గో విడత భూసేకరణకు సిద్ధమైన రెవెన్యూ అధికారులు
  • పరిహారం కోసం ప్రశ్నించిన రైతులపై కేసులు
  • రేపో, మాపో అరెస్ట్‌ల పర్వం
  • 'అయ్యా..ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండానే మా భూములను లాక్కున్నారు. అక్కడ సోలార్‌ ప్లాంట్‌ పనులు శరవేగంగా చేస్తున్నారు. మా భూముల్లోకి వెళ్తే పోలీసులకు చెప్పి లాఠీలతో కొట్టిస్తున్నారు. గతంలో సేకరించిన భూములకే ఇంకా పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ నాల్గో విడత భూసేకరణ అంటూ గ్రామాల్లోకి వచ్చారా! ఇదెక్కడి న్యాయం?' అంటూ ఎన్‌పీకుంట మండలం పి.కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని పలుగ్రామాల  రైతులు ఇటీవల అక్కడికెళ్లిన కదిరి ఆర్డీఓ వెంకటేశును నిలదీశారు. అయితే.. తమ పై అధికారిని నిలదీస్తారా.. మీకెంత ధైర్యం? అంటూ ఆ మండల ఇన్‌చార్జ్‌ తహశీల్దార్‌ కృష్ణప్రసాద్‌ రైతులపై ఎన్‌పీకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ రమేష్‌బాబు కేసు (క్రైం నంబర్‌ 83) నమోదు చేశారు. అమాయక రైతులను రేపో మాపో అరెస్ట్‌ చేసే అవకాశముంది.

              ఎన్‌పీకుంట మండలంలో వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంతో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ బాధ్యతను నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) చూస్తోంది. ఇందుకోసం ఎన్‌పీకుంట పంచాయతీ పరిధిలో 2,079.38 ఎకరాలు, పి.కొత్తపల్లి పరిధిలో 5,094.87 ఎకరాలు కలిపి.. మొత్తం 7,174.25 ఎకరాల భూమిని మూడు విడతల్లో సేకరించారు. పట్టా భూములకు ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.3.20 లక్షలు, అసైన్డ్‌ భూములకు రూ. 2 లక్షల నుంచి రూ.2.10 లక్షల చొప్పున మొత్తం 741 మంది రైతులకు రూ.44.44 కోట్ల పరిహారం చెల్లించారు. ఇంకా పట్టా, అసైన్డ్‌ భూములు కోల్పోయిన 103 మంది రైతులకు రూ.6.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో పెండింగ్‌లో ఉంది. ఎటువంటి పట్టా లేకుండా తరతరాలుగా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మాత్రం ఇంత వరకు ఒక్క రూపాయి కూడా  పరిహారం చెల్లించలేదు. ఇలాంటి వారు పి.కొత్తపల్లి పరిధిలో 592 మంది, ఎన్‌పీకుంట పంచాయతీ పరిధిలో 205 మంది, పక్కనున్న వైఎస్సార్, చిత్తూరు జిల్లాల వాసులు 249 మంది,  ఇతరులు 110 మంది.. ఇలా మొత్తం 1,156 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. వీరికి ఎకరాలతో సంబంధం లేకుండా కుటుంబానికి   రూ.లక్ష చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి మూడేళ్లు కావస్తోంది. అయితే.. ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. వీరి భూములు మాత్రం స్వాధీనం చేసుకున్నారు.

              నాల్గో విడత భూసేకరణ పేరుతో ఈ నెల 23న పి.కొత్తపల్లికి ఆర్డీఓ వెంకటేశుతో పాటు ఆ మండల రెవెన్యూ అధికారులు వెళ్లారు.  ఏళ్ల తరబడి పరిహారం కోసం ఎదురు చూస్తున్న బాధిత రైతులు ఆర్డీఓను నిలదీశారు. 'మాకు పరిహారం ఇచ్చే వరకు నాల్గో విడత భూసేకరణ జరక్కూడదు. పరిహారం కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి? పరిహారం ఇవ్వకుండానే మా భూముల్లో సోలార్‌ పనులు శరవేగంగా చేస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఆ భూముల్లోకి అనుమతించలేదు. వెళ్తే పోలీసులకు చెప్పి లాఠీలతో కొట్టిస్తున్నారు. పరిహారం ఇచ్చేవరకు ఇక్కడికి రాకండి' అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీన్ని రెవెన్యూ అధికారులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఆరోజు అక్కడికొచ్చిన రైతులందరిపై కేసులు నమోదు చేయాలంటూ ఆ మండల ఇన్‌చార్జ్‌ తహశీల్దార్‌ కృష్ణప్రసాద్‌ ఎన్‌పీకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలానా సెక‌్షన్లు కూడా బనాయించాలంటూ ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఎంతమంది రైతులనే విషయం మాత్రం అందులో తెలపలేదు. ఆ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రమేష్‌బాబు కేసు (క్రైంనెం.83) నమోదు చేశారు. అయితే.. ఆ సంఘటన జరిగినప్పుడు తాను సంఘటన స్థలంలోనే లేనని ఇన్‌చార్జ్‌ తహశీల్దార్‌ చెప్పడం కొసమెరుపు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement