
రామ్మా.. సమంత..!
రామ్మ చిలకమ్మా...
ఐశ్యర్యారాయ్.. ప్రీతీజింటా.. సమంతా.. కాజల్.. ప్రియాంకచోప్రా... బయటకి రావమ్మా... అయ్యగారు వచ్చారు... నీకు కానుకలు తెచ్చారు.. దీంతో నువ్వు పండ్లు కొనుక్కోవచ్చు... నేను మందు కొనుక్కోవచ్చు.. అయ్యగారి అదృష్టాన్ని.. కీర్తిని.. హోదాని బయటకి తీయవమ్మ.. లక్ష్మీతల్లి వరించాలా.. సరస్వతమ్మ కరుణించాలా.. బెజవాడ కనకదుర్గా.. శ్రీశైలం మల్లన్న.. తిరుపతి వెంకన్నా.. నిన్ను కరుణించుగాక..
చిరంజీవి.. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ప్రభాస్.. అందరూ రండి.. అందరూ కలిసొచ్చి అయ్యగారి కార్డు తీయడానికి మా సమంత(చిలక)కు సహకరించండి.. అయ్యగారూ.. యాభై రూపాయలు అక్కడ పెట్టండి.. సమంత రావమ్మ.. నీకు కానుకలు వచ్చాయి.. అయ్యగారు చక్కగా.. బలంగా ఉన్నారు.. అయ్యగారికి తగ్గట్టు మంచి కార్డు తీయమ్మ... అయ్యగారికి ఈసారి దశ తిరిగిపోవాలి..
ఇలా చిలకజోస్యులు పుష్కరాల్లో సందడి చేస్తున్నారు. పుష్కరఘాట్‌ల వద్ద చిలకజోస్యం చేప్పించుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఓ వైపు పుణ్యస్నానాలను ఆచరించి అమ్మవారిని దర్శించుకుని వస్తున్న వారిని చిలక జ్యోతిస్యులు ‘ఒక్క చిన్నమాట..’ అని పిలిచి కూర్చోబెడుతున్నారు. ‘మా సమంత చెప్పింది జరగాల.. జరిగాక అయ్యగారు, అమ్మగారు మెచ్చాలా..’ అంటూ భక్తులను ఆకర్షిస్తున్నారు. చిలకలకు సినీతారల పేరు పెట్టుకుని తమ మాటలతో భక్తులను అలరిస్తున్నారు.
మారిన చిత్రాలు
కాలంతోపాటు చిలకజోస్యంలో కూడా మార్పులు వచ్చాయి. గతంలో దేవుళ్లు, దేవతల చిత్రపటాలు ఉన్న ఫొటోలను చిలుకలతో తీయించి జోస్యం చెప్పేవారు. మారిన ట్రెండ్ ప్రకారం దేవతల స్థానంలో సినీనటుల ఫొటోలు వచ్చి చేరుతున్నాయి. చిలక తీసిన ఫొటోలను బట్టి వచ్చినవారి హావభావాలకు అనుగుణంగా జోస్యం చెబుతున్నారు.
- విజయవాడ(గుణదల)