
టీసీ రాగానే ట్రైన్ నుంచి దూకేశాడు..
వరంగల్ : టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి టిక్కెట్ కలెక్టర్ రాగానే భయంతో రైలులో నుంచి దూకేశాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపానికి కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు రాగానే టీసీ వచ్చాడు. అయితే టిక్కెట్ కొనని దారావత్ రమేష్ తనను టీసీ టిక్కెట్ అడుగుతాడేమోనన్న భయంతో నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేశాడు.
కేసముద్రానికి చెందిన దారావత్ రమేష్ వరంగల్లో కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కాడు. అయితే అతడు ఫుట్ బోర్డులో కూర్చుని ప్రయాణిస్తున్నాడని అందువల్లనే టిక్కెట్ చూపించే క్రమంలో కిందపడ్డాడని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే రమేష్ స్నేహితుడి వాదన మరోలా ఉంది.. తన మిత్రుని వద్ద టిక్కెట్ ఉందని, టిక్కెట్ చూపించే విషయంలో టీసీ తమ వద్ద దుర్భాషలాడారని చెప్పాడు. ట్రైన్లు తక్కువగా ఉండటంతోనే రమేష్ ఫుట్బోర్డు ప్రయాణం చేయాల్సి వచ్చిందని ప్రయాణికులు అంటున్నారు. అతడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.