Kesamudram railway station
-
ఆ దుర్ఘటన జరిగి 11 ఏళ్లయింది
సాక్షి, కేసముద్రం : దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన గౌతమి ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాద ఘటన జరిగి నేటికి పదకొండేళ్లు. ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం – తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్ల మధ్య 2008 జూలై 31న అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి కాకినాడకు డౌన్‌లైన్‌లో వెళ్తున్న గౌతమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగగా కొద్ది నిమిషాల్లోనే మంటలు దావానంలా వ్యాపించాయి. దీంతో నాలుగుబోగీలు పూర్తిగా కాలిపోగా.. ముప్ఫై మంది ఆ మంటలకు బలయ్యారు. ఈ ఘటన జరిగి 11 ఏళ్లు పూర్తవుతున్నా స్థానికుల మదిలో నుంచి ఆనాటి బాధితుల ఆర్తనాదాలు, మంటలు చెరిగిపోవడం లేదు. ఉలిక్కిపడిన కేసముద్రం రైలులోని ప్రయాణికులందరూ నిద్రలో జోగుతున్నారు.. ఇంకా కొన్ని గంటల్లో తమ గమ్యస్థానాలకు చేరుతామనే ధైర్యంతో నిశ్చింతగా నిద్రపోయారు. కానీ వారికి అదే చివరి రాత్రి అయింది. ఇదీ గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో 11 ఏళ్ల క్రితం ప్రయాణించిన వారికి ఎదురైన పరిస్థితి. సికింద్రాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరిన గౌతమి ఎక్స్‌ప్రెస్ కేసముద్రం – తాళ్లపూసపల్లి స్టేషన్ల మధ్యకు చేరుకుంది. ఇంకా కొద్దిసేపు అయితే మహబూబాబాద్ స్టేషన్లో ఆగాల్సి ఉంటుంది. దీంతో జనరల్ బోగీల్లోని పలువురు దిగేందుకు సిద్ధమవుతుండగా బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక బోగీ నుంచి మరో బోగీకి మంటలు వ్యాపిస్తూ ఏం జరిగిందో తెలుసుకునే లోగా ఎస్9, 10, 11, 12 బోగీలు పూర్తిగా అంటుకున్నాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఆ బోగీల్లో ప్రయాణిస్తున్న 32 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గుర్తుపట్టలేనంతగా... గౌతమి ఎక్స్‌ప్రెస్‌లోని నాలుగు బోగీలు కాలిపోయిన ఘటనలు ఇద్దరు మహిళలు ఊపిరాడక మృతి చెందారు. మరో 30 మంది అగ్నికీలల్లో మాడి మసయ్యారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి కొందరి మృతదేహలను గుర్తించినా... మరో 20 మంది మృతదేహాలను గుర్తించలేకపోయారు. దీంతో ఆ రైలులో ప్రయాణిస్తూ గల్లంతైన వారికోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు రెండేళ్ల పాటు నిరీక్షించారు. చివరకు బాధితులు మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో వారి ఆదేశాల మేరకు గుర్తించని గల్లంతైన వారు గౌతమి ఘటనలో మృతి చెందినట్లుగా ఏప్రిల్ 2010 అంటే ఘటన జరిగిన తొమ్మిది నెలలకు కేసముద్రం తహసీల్దార్ కార్యాలయం నుంచి మరణ ధృ«వీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ మేరకు వారి కుటుంబాలకు రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందింది. కాగా, ఈ ఘటన జరిగిన రోజు కేసముద్రం మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన జరిగిన తెల్లవారుజామున రైల్వే ఉన్నతాధికారులతో పాటు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి, కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి నారాయణ్‌బావ్ రత్వా, రైల్వే సేఫ్టీ కమిషన్ అధికారులు, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు కేసముద్రానికి తరలివచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి గౌతమి బోగీల్లోకి ఎక్కి పరిశీలించడంతో పాటు బాధితులను ఓదార్చారు. పది రోజులకు పైగా మృతి చెందిన వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఇక్కడే తిరగడం.. కలిసిన అధికారులకు తమ గోడు వెళ్లబోసుకోవడం వంటి హృదయవిధారక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక కాలిబూడిదైన బోగీలను చూసేందుకు వచ్చిన చుట్టుపక్కల వారంతా అస్తిపంజరాలు, కళేబరాలను చూసి తట్టుకోలేక పోయారు. గౌతమి ఘటన జరిగిన పది రోజుల పాటు ఈ ప్రాంత ప్రజలు దిగ్బ్రాంతి నుంచి కోలుకోలేకపోయారు. రైల్వే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండురోజుల పాటు కాజీపేట – విజయవాడ సెక్షన్లలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. -
రక్తమోడిన రైలు పట్టాలు
వేర్వేరు చోట్ల రైలు కిందపడి ముగ్గురి మృతి కేసముద్రం : జిల్లాలో వేర్వేరుచోట్ల రైలు పట్టాలు రక్తమోడాయి. రైలు కింద పడి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడగా, మరొకరు ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మృతిచెందారు. కేసముద్రం మండలంలోని ధన్నసరి శివారు బిచ్చానాయక్ తండాకు చెందిన బాదావత్ బాలు(43) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మనోవేదనకు గురైన బాలు శుక్రవారం సాయంత్రం ధన్నసరి శివారు కొత్తూరు వద్దనున్న రైల్వేట్రాక్‌పైకి వెళ్లి అప్‌లైన్‌లో(424కిలోమీటర్వద్ద) అటుగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య అస్లి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటన స్థలంలో ముక్కలైన మృతదేహన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసముద్రంస్ల్స్టేషన్ సమీపంలోని రైలు కిందపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం మృతిచెందినట్లు జీఆర్పీ సీఐ స్వామి తెలిపారు. 40 సంవత్సరాల వయసు గల ఓ వ్యక్తి 420/25మైలు రాయి వద్ద అటుగా వచ్చే రైలు కింద పడి మృతిచెందాడు. మృతదేహం పరీశీలిస్తే మృతుడి నడు ము భాగం నుంచి తల భాగంవరకు కనిపించకుండా పోయింది. కొంతదూరంలో ఓ వ్యక్తి ఫొటో ఉండటం, మృతదేహం పైభాగం లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. జీఆర్పీ పోలీసులు మాత్రం ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. ప్రమాదవశాత్తు రైలుకింద పడి వ్యక్తి మృతి స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ఓ వ్యక్తి ఘన్పూర్ రైల్వేస్టేషన్లో దిగేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుతప్పి కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు బ్లాక్ ప్యాంట్, బ్లాక్ అండ్ వైట్ షర్ట్ ధరించి ఉన్నాడు. కాజీపేట జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టీసీ రాగానే ట్రైన్ నుంచి దూకేశాడు..
-
టీసీ రాగానే ట్రైన్ నుంచి దూకేశాడు..
వరంగల్ : టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి టిక్కెట్ కలెక్టర్ రాగానే భయంతో రైలులో నుంచి దూకేశాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపానికి కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు రాగానే టీసీ వచ్చాడు. అయితే టిక్కెట్ కొనని దారావత్ రమేష్ తనను టీసీ టిక్కెట్ అడుగుతాడేమోనన్న భయంతో నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేశాడు. కేసముద్రానికి చెందిన దారావత్ రమేష్ వరంగల్‌లో కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కాడు. అయితే అతడు ఫుట్ బోర్డులో కూర్చుని ప్రయాణిస్తున్నాడని అందువల్లనే టిక్కెట్ చూపించే క్రమంలో కిందపడ్డాడని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే రమేష్ స్నేహితుడి వాదన మరోలా ఉంది.. తన మిత్రుని వద్ద టిక్కెట్ ఉందని, టిక్కెట్ చూపించే విషయంలో టీసీ తమ వద్ద దుర్భాషలాడారని చెప్పాడు. ట్రైన్లు తక్కువగా ఉండటంతోనే రమేష్ ఫుట్‌బోర్డు ప్రయాణం చేయాల్సి వచ్చిందని ప్రయాణికులు అంటున్నారు. అతడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. -
సాంకేతికలోపంతో నిలిచిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్
వరంగల్ : సాంకేతిక లోపాలు తలెత్తి ఓ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోవడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. వరంగల్ జిల్లాలోని కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో అక్కడే నిలిచిపోయింది. దీంతో ఈ మార్గంలో వెళ్లవలసిన పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల నుంచి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎక్స్‌ప్రెస్ రైలులో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
కృష్ణా ఎక్స్‌ప్రెస్ బోగీలో పొగలు
కేసముద్రం, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ వరంగల్ జిల్లా ఇంటికన్నె రైల్వేస్టేషన్ దాటాక మధ్య బోగీ కింద నుంచి పొగలు లోపలికి వస్తుండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో రైలును కేసముద్రం రైల్వేస్టేషన్లో అధికారులు నిలిపివేశారు. బ్రేక్‌లైనర్లు పట్టేయడం వల్లే పొగలు వ్యాపించినట్లు తెలిపారు. ఉదయం 9.25 గంటలకు వచ్చిన రైలు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. రైల్వేసిబ్బంది మరమ్మతులు చేసి రైలును పంపించారు.